సుభాషిణి లంకే....           25-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 48

           

            పేరు లంకే సుభాషిణి. వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయురాలు. నలుగురికి సాయపడాలని నా మాతృమూర్తి ఉగ్గుపాలతోనే నేర్పింది. డాక్టరు కావాలనుకొని పొరబాటున టీచర్ని అయ్యాను. దీనిలో దశాబ్దం పాటు సంతృప్తి లభించింది గాని, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను గాని, ఇంకా ఏదో వెలితి! ఇంకేముంది జనవిజ్ఞానవేదిక సభ్యురాలినయ్యాను. “ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి” అన్నట్లుగా ఈ జనవిజ్ఞానవేదికలో సభ్యులంతా నాకు పరిచయస్తులు, అప్పటికే ఒకే కుటుంబమై వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొంటున్న వారు. దాంతోనాకున్న వెలితి సగం తీరినట్లయింది.

 

            ఇంతలో డాక్టరు గారు స్వచ్చ చల్లపల్లి ఉద్యమం ప్రారంభించారు గాని, 549 రోజుల వరకు నేను మాత్రం ఇదిగో - అదిగో అనుకుంటూ వెళ్లలేకపోయాను. అప్పటికి ఘంటశాలలో నివాసం ఉంటూ, వేకువ చీకటిలో ఒక్కదానినే రావాలన్న భయం - సందేహం నాకాళ్ళకు బంధాలు వేశాయి.

 

            ఏది అయితే అదే జరుగుతుంది. అన్న ఒక దృఢసంకల్పంతో 549 వ రోజు 4 గంటలకే నిద్ర లేచి ఘంటశాల నుండి చల్లపల్లికి బండి మీద చీకట్లో ఒక్క దాన్నే వస్తుంటే - ఏదో తెలియని భయం. నాకు చీకటి ఫోబియా ఉంది. అప్పుడు డాక్టరు దంపతులు, ఇతర కార్యకర్తలు గుర్తు వచ్చి – వీళ్లది చల్లపల్లి కాదే - మరి ఎందుకు ఇంత చీకట్లో ఎన్ని వందల రోజులు శ్రమిస్తున్నారు?’ అనేది తలచుకొని భయాన్ని జయించి చల్లపల్లికి చేరుకొన్నాను.

 

            “వేయి మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం.” అన్నట్లు ఆరోజే నేను తీసుకున్న నిర్ణయం నన్ను వెనుకకు తిరగనివ్వలేదు. అంతకు ముందు అడపాదడపా ఉద్యమంలో పాల్గొన్నప్పటికి 549 అడుగులు ఏసిన స్వచ్చ సైనికులు గాని, నేను గాని వెనకడుగు వేయలేదు. నాకు ఆ రోజుతో చీకటి భయం తొలగిపోయింది.

 

            నేను సాధించినది ఏమీ లేదు - ఏదో గొర్రును అటు ఇటు ఆడించడం తప్ప. ఇక్కడ నాకు ఒక ఆత్మీయ కుటుంబం దొరికింది. స్వచ్చ చల్లపల్లి కార్యక్రమానికి వెళ్ళిన రోజున పొందే ఆనందం మిగిలిన రోజులలో ఉండదు. ఇది నా మనసు లోపలి పొరల్లో నుండి చెప్పుచున్న మాట.  స్వచ్చ చల్లపల్లి ఉద్యమంతో నాకున్న వెలితి ఇప్పుడు తొలగిపోయింది.

 

 

ఇక నా దైనందిన స్వచ్చోద్యమ అనుభవాలు : ఒక్కోసారి మేము రోడ్డు ఊడుస్తుంటే సహకరించపోగా టీ – కాఫీ లు త్రాగి గ్లాసులు మా ముందే గిరాటు వేయడంతో మాకు కోపము, విసుగు వచ్చేవి. కాని అంతలోనె డాక్టరు గారి మాటలు - “ఓర్పు ఉండాలి, ఓర్పు ఉంటేనే  మార్పు వస్తుంది” అనేవి గుర్తుకు వచ్చేవి. “ఆపరేషన్ చేసే చేతులతోనే రోడ్డుమీది మలమూత్రాలు తీసేసి, పేడ తట్టలు, మట్టి గంపలు ఎత్తుతూ, మొక్కలు నాటి, గోడలపై చిత్రాలు చిత్రించి చల్లపల్లి రూపురేఖలు మార్చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్న డాక్టరమ్మ గారి ముందు గొర్రును ఆడించే నేనెంత” అని కూడా తట్టేది.

 

            డాక్టరు గారన్నది కొంచెం ఆలస్యంగానైనా ఋజువైంది - మార్పు దానంతట అదే వచ్చింది. ఒకదాని తరువాత ఒక ఊరిలో చాపకింద నీరులా నెమ్మదిగా మనకు తెలియకుండానే మార్పు తేగలిగాము. చెత్త, పేడ, పెంట, డ్రైన్లు ఇవన్నీ స్వచ్చ సైనికుల సేవల ముందు తలదించుకున్నాయి. “స్వచ్చ – శుభ్రతల పరిపూర్ణతతో చల్లపల్లి చరిత్ర పుటలకెక్కుతోంది. దానికి నిదర్శనమే నాటి చల్లపల్లే నేటి స్వచ్చ సుందర చల్లపల్లి”.

 

            చేతులు, కాళ్ళలో ముళ్ళు దిగుతున్నా, వాడి కత్తులకు వేళ్ళు గాయపడుతున్నా, వర్షం, మంచు, ఈదురు గాలుల చల్లదనం బుసలు కొడుతున్నా, మురుగు కాల్వల వాసనకు కడుపులో దేవుతున్నా, చివరకు కరోనా ప్రకంపనలు వచ్చినా ఆగక స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో పాల్గొంటున్న నా సహచర స్వచ్చ సైనికులారా! మీకు ఇదే నా పాదాభివందనం.

 

            ఏం ఆశించి, ఏ స్వార్ధం లేకుండానే మీరు ఇలా చేస్తున్నారా? - అని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు మీమీద ప్రయోగిస్తున్నారు. ఔను ఊరి కోసం, ఊరి జనం బాగు కోరుకుంటూ, గ్రామ క్షేమం లక్ష్యంగా మీ సుదీర్ఘ ప్రయాణం స్వార్ధమే అయితే మీ స్వార్ధమే ఈ సమాజానికి కావలసింది.

 

            అలనాడు రోడ్డు కిరు ప్రక్కలా చెట్లు నాటించిన అశోకుని వలె ఈ స్వచ్చ సైన్యం ఏ ముప్పై వేల చెట్లు, పూల మొక్కలో నాటి పచ్చదనం నింపిన చరిత్రను మన భావితరాల వారు తప్పక గుర్తిస్తారు.

           

            ఈ కాలంలో ఆధునిక సంపన్నులు లాఫింగ్ క్లబ్బులకు పోయి ఆనందాన్ని వెతుకుంటున్నారు. ఈ స్వచ్చ సైనికులు మాత్రం సమాజానికి ప్రయోజనకరమైన శ్రమదానంతో ఎన్ని రెట్లు ఆనందం, ఆరోగ్యం పొందుతున్నారో గదా!

 

            త్రాగుడుకు, మత్తులకు అలవాటి పడిన వాళ్లకవి దొరకక పిచ్చెక్కడం వంటిదే ఈ స్వచ్చోద్యమం ఆగిపోతే మన కార్యకర్తల పరిస్తితి కూడా.

 

            మన కృషితో శ్మశానవాటిక సైతం పర్యాటక ప్రదేశం అయింది. దశాబ్దాల నాటి మొండి గోడలు సైతం రమణీయ కుడ్యాలుగా మారాయి. మన శాస్త్రి గారి కృషి వలన ఎటు చూసినా బిళ్ళ గన్నేరు వనాలు తయారయ్యాయి. ప్రక్క ఊరి వారికి మనం బిళ్ళ గన్నేరు మొక్కల దాతలుగా మారినాము.

 

            క్రమశిక్షణకు మరో రూపం స్వచ్చ సైనికులు గౌ. నారా చంద్రబాబునాయుడు గారి పర్యటనలో మనం క్రమశిక్షణ, డాక్టరు గారి దంపతుల ఓర్పు, నేర్పు చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారంటే అతిశయోక్తి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధుర జ్ఞాపకాలు మరెన్నో మరపురాని క్షణాలు.

 

            “ఫలితాన్నాశించకుండా నీ పని నువ్వు చెయ్యి” – అనేది గీతా సారం.

            “మన పని మనం చేద్దాం మార్పు అదే వస్తుందన్నది” – డా. D.R.K. గారి ఆలోచనా సారం.

           

            స్వచ్చ సైనికులు నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా మారి చెట్లు అవుతూ రోడ్డు అందాలను మరింత ద్విగుణీకృతం చేస్తుంటే ఒక తల్లి బిడ్డ పుట్టగానే బిడ్డను చూసుకొని పురిటి నొప్పులు మరిచిపోయినట్లుగా స్వచ్చ సైనికులు కూడ తాము పడిన శ్రమనంతా మరచిపోతున్నారు.

 

            స్వచ్చ సైనికులు ముందు నుండి వెనుక నుండి అన్ని విధములా ఊతమిస్తూ ముందుకు నడిపిస్తున్న డాక్టరు గారి దంపతుల శ్రమ, కృషి, పట్టుదల, ఓర్పు, నేర్పు అమోఘం, అద్వితీయం, అజరామరం, అనంతం. వారివురు స్వచ్చ సైనికుల పట్ల చూపే ప్రేమానురాగాలు వెలకట్టలేనివి.

 

            తెల్లని కాంతి ఏడు రంగులతో మిళితమై ఉన్నట్లు స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో అనేకమంది తమ వంతు పాత్రను నిర్విరామంగా, నిరాటంకంగా పోషిస్తున్నారు. మన ఉద్యమానికి సహకరించే అధికారులు, అనధికారులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కవులు, కవయిత్రులు, మాట సాయం చేసేవారు, ఆర్ధికదానకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్చ సైనికుల కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, మీడియా మిత్రులు అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు.

 

            స్వ చ్చమైన మనసులతో స్వ

            చ్చ మైన ప్రేమానురాగాలతో చల్లపల్లి ని         

            సుం దరము గాను

            ర్శనీయ ప్రాంతము గాను మరెంతో

            మణీయం గాను

            ల్లపల్లి ని చూడ చక్కని పి‌ల్లగాను చ(

            ల్ల ని

            ల్లెగా తీర్చిదిద్దుతూ చల్లపల్లి కీర్తి ప్రపంచం నలు దిశలు వె(

                ల్లి విరిసేలా చేస్తున్న

                        ఓ స్వచ్చ సైనికా నీకిదే మా హృదయాంజలి.

 

            డాక్టరు గారు అనుకున్న మార్పుకు కూతవేటు దూరంలో ఉన్నాము. చెత్తను డంపింగ్ యార్డుకు తరలించుటలో సఫలీకృతులయ్యాం. చెత్తను డ్రైనేజిలలో కాలువలలో విసిరే అలవాటును కూడ మనం మాన్పించగలగాలి. అప్పుడే మన ఉద్యమానికి సార్ధకత. అప్పటి వరకు ఓపికతో వేచి చూద్దాం. బాహుబలి సినిమా కోసం 3 సంవత్సరాలు నిరీక్షించాం. మన కోసం మన ఊరి కోసం ఎన్ని సంవత్సరాలు అయినా నిరీక్షించాలి. అట్టి నిరీక్షణలో నేను ఒక సమిధను కావాలని

 

                        ఆశిస్తూ ...... ఆకాంక్షిస్తూ    

 

- సుభాషిణి లంకే

   24.06.2020.