తూములూరి లక్ష్మణరావు....           26-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 49

 

ఈ 2050 రోజుల ఉద్యమం గొప్పదే గాని – ఇందులో నాదే ముంది బాబు!

 

            ఒక రకంగా చూస్తే – ఒక మంచి ఉద్దేశంతో ఇంత కాలం నుంచి – అంత మంది పట్టిన పట్టు వదలకుండా చీకట్లో 4.00 నుండే చేసే ఈ పని చాల గొప్పదేనండి! ఈ సంగతి నేనేమిటి – పేపర్లు, టీ. వీ. లు, పెద్ద పెద్ద నాయకులు ఎన్నో సార్లు చెప్పారు గాదండీ.

 

          ఊరందరి మంచి కోసం ఒక్క పైసా ఆశించక ఇన్ని రకాల మనుషులు పాటుబడడం మెచ్చుకోదగ్గదే అనుకోండి! నేను కూడ మొదటి రోజు నుండి ఈ పనిలో పాల్గొన్న వాడిని ఐనా – ఒక్కోసారి కూర్చొని నా గురించి ఆలోచిస్తే – ఇదే మంత బ్రహ్మండమా అని కూడ అనిపిస్తుంది. ఉన్న ఊరి కోసం ఏదో చేతనైంది రోజుకొక గంటో – రెండు గంటలో చేస్తున్నాను. అంత మాత్రాన నేనేమైనా ఇంద్రుణ్ణో – చంద్రుణ్ణో అయిపోతానా? ఈ ఉద్యమం కోసం నేను లక్షలూ – కోట్లు (అసలు మన దగ్గర లేవనుకోండి!) ఖర్చు పెట్టానా? ప్రాణత్యాగాల్లాంటివి చేశానా? ఎవరి కోసం శ్రమదానం చేస్తున్నాను? నా ఊరికి, నా ప్రజలకే గదా!

 

          ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే – మన కార్యకర్తల్లోనే కొందరు నన్ను “తొలి రోజు నుండి కష్టపడుతున్నవాడి” ననీ, “బుల్ వర్క్” చేస్తాననీ, “గ్రామ రెస్క్యూ టీం” సభ్యుడననీ, ఏవేవో అంటుంటారు. ఇక డాక్టరు గారైతే – నాతో కొన్ని ప్రారంభోత్సవాలు, విద్యార్ధులకి బహుమతి ప్రదానాలు చేయించారు కూడ! నాలో నేను సిగ్గు పడటానికి కాకపోతే – ఇవన్నీ నాకెందుకు బాబు? చదువులేని వాడిని; గుత్తికొండ కోటేశ్వరరావు గారి దగ్గర కోళ్ళ ఫారంలో పనిచేసుకొని బ్రతుకుతూ – నా ఇద్దరు పిల్లల్ని చదివించుకొన్నాను. 27 ఏళ్ల నుండి చల్లపల్లి ఉంటున్నాను గాని, నా అసలూరు పెదముత్తేవండి . అదేమన్నా సామాన్యమైన ఊరనుకున్నారేమో! నిమ్స్ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, సుప్రీం కోర్ట్ జాస్తి చలమేశ్వర్ గారు వంటి పెద్ద పెద్దోళ్ళ ఊరండి! 96 ఏళ్ల మా అమ్మ ఆరోగ్యంగా ఆక్కడే ఉంటున్నదండి! నా అదృష్టం చూశారా? నా జీవితంలో సగభాగం అంత గొప్ప పెదముత్తేవిలో గడిస్తే – మిగతా సగం – 26 ఏళ్ళు ఇంత స్వచ్చ – సుందర – చల్లపల్లిలో ఇంత మంది – ఇంత మంచి కార్యకర్తల మధ్యన సంతోషంగా గడుస్తున్నది.   

 

          2014 నవంబరు 12 వ తేదీ నేనూ, తుమ్మల జనార్ధనరావు గారూ వాకింగ్ చేస్తుంటే – డాక్టరు గారు, మరికొందరు చీపుళ్లతో రోడ్డు ఊడుస్తుండడం చూసి, ఇద్దరం అమాంతం వెళ్ళి చీపుళ్ళు తీసుకున్నాం. అప్పటి నుండి నా జీవితంలో ఈ శ్రమదానం ఒక భాగమై పోయిందనుకోండి. ఏ కారణంతో -  ఏరోజైనా కుదరక రాకపోతే – అదేంటో పిచ్చిగా ఉంటది. స్వచ్చ కార్యకర్తల్లో చాల మందిలాగే నేను కూడ కొన్ని సార్లు రెండు వేలు – మూడు వేలు చందాలు గూడ ఇచ్చాను. మా సారు గుత్తికొండ కోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, లక్ష్మణ స్వామి గారు నన్ను, జానీని వివరాలడిగి తెలుసుకొని వారు కూడ ఇందులో ప్రవేశించి, పెద్ద పెద్ద చందాలెన్నొ ఇచ్చారండి! నేను చేసే ఈ పని నాకు నచ్చింది; కార్యకర్తలు, డాక్టర్లు నచ్చారు; మా వల్ల ఊరికే కొంతైనా మేలు జరుగుతున్నది. అందు వల్ల ఈ శ్రమదాన కార్యక్రమం నేనెందుకు మానుతాను?

 

- తూములూరి లక్ష్మణరావు - చల్లపల్లి

   26.06.2020.