ప్రాతూరి శాస్త్రి -18.09.2020. ....           18-Sep-2020

 సుందరబృంద చిత్రకళా విన్యాసాలు:

బస్టాండులో చిత్రకళ

            రవాణా ప్రాంగణమందు రాజుగారి కోట చిత్రము

            వేసిరి సుందరబృందము సౌజన్యముగా

            దుర్గావాసులు మాధురీపద్మావతులు

            అనుభవలపంట గదా ఈ శ్రమజీవుల చిత్రాలు.

            ఈ సంవత్సరం జనవరిలో కమ్యూనిస్టు బజారు బైపాస్ రోడ్డు కలిసే ప్రదేశంలో చివరి కుడివైపు ఇంటిగోడలకు రంగులు వేసి పూల చిత్రాలు, నినాదాలు వ్రాసారు.

కమ్యూనిస్టు బజారు సుందరీకరణ.

            ఆలోచనలను అక్షరాలు కట్టిపడేస్తే

            వచ్చిన ఊహలకు రంగులు జోడిస్తే

            గోడలపై చిత్రాలకు అందమైన రూపమొస్తే

            మనసు ఇంద్రధనసులై పెదవిపై చిరునవ్వు వస్తే

            స్వచ్చ సుందర చల్లపల్లి కృషి

            భావాంబరవీధిన సచేతనమయ్యే.

            సుందరబృంద చిత్రాలు కొన్ని

            అందరికి ముదంబొనరింప

            పూర్ణ కుంభాలు మంచివని యెఱింగి

            జలపాతమునకిరువైపుల చిత్రించిరి

            మామిడాకులు, నారికెళ సహితముగా

            బాజాల యుతముగా నగిషీలు చెక్కిరి.

            సుందర బృందమునకు సహాయముగా స్నేహ, లక్ష్మీ సెల్వమ్, కోట పద్మావతి పాల్గొన్నారు.

మరొక రోజు ఓ ఆదివాసీ చిత్రం.

            "ఆదివాసీ వనిత సంచారజీవనంతో

            నెత్తిన పెరుగుతట్ట, కింద పావడాలతో

            తిరిగిచూచు పెరుగోయన్న పిలుపుతో

            కంఠాన పూసలహారము, ముంజేతి కంకణాల మెరుపుతో,

            కదిలే పడతి మందగమనంతో

            స్వచ్చ సుందర చల్లపల్లి బృందం

            వేసిరి చిత్రకళా వైభవాన్ని మనసుతో.

మరోరోజు ముచ్చటగొలిపే ముద్దుగుమ్మ మోము చిత్రించారు.
           
"చిత్తరాల తిరపడు చూసాడు నగుమోము,

            హరివిల్లు లాంటి కనుబొమ మనసులాగ వెళ్ళాడు,

            దొండపండు లాంటి మోవిజూసి ముద్దాడబోయాడు,

            చిత్తరువని తెలిసి నీరసపడిపోయాడు,

            అదితెలిసి సుందర బృందం పడీపడీ నవ్వారు.

హరితరంగులతో సామ్యవాద బజారుకు కళవచ్చే,

వీధిలోని జనమంత సుందర చిత్రాల తిలకించ వచ్చే,

లతలు, పుష్పాలు, నాట్యభంగిమల కాంచ,

కార్టూను చిత్రాల జూసి పిల్లలేమో చిందులేయ,

ఈ దృశ్యము కాంచి సుందరబృందము

కనుల కాంతులు మిలమిల మెరిసే.

25 రోజులు సామ్యవాద బజారులో చిత్రకళా సేవ జరిగింది.

- ప్రాతూరి శాస్త్రి

18.09.2020.