ప్రాతూరి శాస్త్రి - 21.09.2020....           21-Sep-2020

 స్వచ్చోద్యమానికి తలమానికము మన డంపింగ్ యార్డ్

అదే తరిగోపుల ప్రాంగణం

డంపింప్ యార్డు

            చల్లపల్లి చరిత్రపుటల్లో సువర్ణాధ్యాయం. గ్రామానికి మణిపూస.

            చల్లపల్లి కార్యకర్తల మనోధైర్యాన్ని, పట్టుదలను పెంచి దృఢత్వాన్ని కలుగజేసిన నందనోద్యానవనం.

            4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సువిశాల స్థలం. చిల్లలవాగు గట్టు, ఆటోనగర్ ల మధ్య విరాజితం.

           ఈ యార్డులోకి అడుగు వేయాలంటే భయం వేసేది. జంతువుల కళేబరాలు, వూరినుండి వచ్చిన చెత్త చెదారం మొదట్లో ఉన్న తాటిచెట్టు వద్దే పోసిపోయేవారు.

              భరించలేని దుర్గంధం, నాలుగు అడుగులేస్తే వాంతులయ్యేవి.

            200 అడుగులేస్తే స్మశానం,

            ఓ చిన్న షెల్టరు, కర్మలకోసం, పట్టించుకున్న అధికారులు లేరు. ఆ స్థలంలో అలాగే వెళ్లి కర్మలు చేసేవారు కానీ కనీసం దారి వేసినవారు గూడా లేరు.

            చల్లపల్లి పరిస్థితులు అటువంటి స్థితిలో ఉండేవి.

            డంపింగ్ యార్డును వర్ణిస్తూ నందేటి శ్రీనివాస్  ఓ పాట వ్రాసి పాడుతుంటారు.

ప్రాభత ప్రాంగణాన మ్రోగేను నగారా

ఈ భారత భువి పొంగే ముగ్ధ జీవధార.

చల్లపల్లి ని స్వచ్ఛ చల్లపల్లి గా మార్చ ప్రతినబూనిన కార్యకర్తలారా,

పేడ, పెంట, చెత్త, మురుగు ముళ్ళపొదలనే ,

మీ చేతులతో శుభ్రపరచిన ధన్యజీవులారా

కర్మకాండలకైనా, మనిషి కర్మకాండలకైనా

చోటు లేని చోట, అందాల స్వర్గపురి నిర్మించినారు.

(20 వేలమంది జనాభాకు నిలయమైన మన చల్లపల్లి లో ఒక వ్యక్తి చనిపోతే పాడే మోస్తూనలుగురు ఒకేసారి నడవడానికి వీలులేని అతిహేయమైన, అతినీచమైన కుళ్ళిన మాంసకళేబరాలతో నిండిన దారిలో వెళ్ళవలసి వచ్చేది)

            300 రోజుల నాటికే గ్రామాన్ని సుందరీకరించే పనిలో నిమగ్నమైన  స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలకు డంపింగ్ యార్డు పరిశుభ్రత సవాలుగా మారింది.

             డంపింగ్ యార్డు శుభ్రత సుమోటో గా తీసికొన్నవారై డాక్టర్ గార్లు, విద్యాసాగర్, యంపిపి లంకబాబుగారు సమాలోచన చేసి, అడపా రాంబాబుకు తన జేసీబీ తో 200 మీ దూరానికి చెత్త నెట్టించారు.

            తీసినకొద్దీ వచ్చే పాతబట్టలు కళేబరాలు మన కార్యకర్తలు తట్టలతో ట్రాక్టర్ లో నింపి దూరంగా గుట్టవేసేవారు.

            అలా దాదాపు 6 మీ లోతుకి జేసీబీ తో తవ్వి గుట్టకు చేర్చేవారు.

            అలా తవ్వగా పడిన గోతులను బుసక, రాళ్లు మట్టి తో నింపి చదును చేశారు. ఇక అక్కడి నుండి పెళ్లి కళ వచ్చేసింది.

            కర్మలు చేసికొనే చోట బాగుచేయించారు. పైన టాంకు కట్టించి షవర్లు పెట్టించారు. డా. కాలేషావలీ గారు దీని నిమిత్తమై రూ. 50,000 లు విరాళం ఇచ్చారు.

            డంపింగ్ యార్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు తను ఇస్తానని శాంతా బయోటిక్ అధినేత డా. వరప్రసాదరెడ్డి గారు పలికి రూ. 8 లక్షల విరాళం ట్రస్టుకి ఇచ్చారు.

            డంపింగ్ యార్డు లోపల ఎడమ వైపు ఫెన్సింగ్ వేసి పూలమొక్కలు నాటారు.

            స్మశానం తరువాత ప్రదేశంలో ఉద్యానవనం ఏర్పాటుచేశారు. Seasonal plants  నాటి ఉద్యానవనం శోభ పెంచారు.

            ప్రారంభంలో కుడివైపు నీటి ట్యాంకర్ నింపేందుకు బోరువేశారు.

            తోటమాలి ఉండేందుకు, పనిముట్లు పెట్టుకునేటందుకు రెల్లుగడ్డి కప్పుగా గుడిసె వేశారు.

            వెంకయ్య నాయుడు గారు 2015, నవంబరు 15 న డంపింగ్ యార్డ్ ను ప్రారంభించారు.

            వెంకయ్యనాయుడుగారు, అయ్యన్నపాత్రుడు గారు చల్లపల్లి సందర్శనకు వచ్చినపుడు photo exhibition  డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసారు.

            ప్రముఖులు వచ్చినపుడు డంపింగ్ యార్డులో ఓ మొక్కను వారిచే నాటించేవారు మన కార్యకర్తలు.

            అప్పటి మన కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారు, ఓ మినిస్టర్ గారి పియస్ శ్రీ సీతారామాంజనేయులు గారు రెండుసార్లు రెండు మొక్కలు డాక్టరు గారు వారితో నాటించారు.

            నడక సంఘ మిత్రులు ప్రత్యేకంగా రావి, వేప రెండూ ఒకేచోట నాటించాలని డాక్టరు గారికి ఇచ్చారు.

ప్రస్తుతం అవి యార్డులో చక్కగా పెరుగుతున్నాయి.

మరో సంఘటన :

            కలెక్టర్ లక్ష్మీకాంతం గారు కళ్లేపల్లి నుండి చల్లపల్లి మీదుగా వెళ్తారని తెలిసి మన డాక్టరు గార్లు, కార్యకర్తలు, పంచాయితీ కార్యదర్శి ప్రసాదు గారు, సర్పంచ్, జడ్పిటిసీ కృష్ణకుమారి గారు, పంచాయతీ సిబ్బంది మేకల డొంక వద్ద ఎదురు చూస్తూ ఉన్నాము.

            మధ్యాహ్నానికి వచ్చారు. మొక్క నాటమని అడగగా నాటడం కాదు, నాటిన మొక్కను పెంచి పోషించాలి అన్నారు. వెంటనే, మీరు నాటించిన మొక్కని చూపుతాము, ఎంత పెద్దదయిందో చూడండి అని డంపింగ్ యార్డుకు తీసికొనివచ్చి చూపారు.

            కానీ కలెక్టర్ గారికి డంపింగ్ యార్డులోని గార్డెన్ చూసి చాలా ఆశ్చర్యచకితులైనారు. మొక్క నాటి డంపింగ్ యార్డులో సిమెంటు రోడ్డు వేయిస్తామన్నారు.

            అన్నట్లుగానే సీఎం గారి సందర్శనకు వచ్చే ముందు సిమెంటు రోడ్డు వేయించారు.

            డంపింగ్ యార్డు స్థలం ఎంతో అదృష్టవంతురాలు.

ఎంతమందో వారి పుట్టినరోజులు జరుపుకున్నారు. సచ్చోద్యమంలో జరిగే ప్రతి వార్షికోత్సవము, ప్రతి పండుగలకు జరిగే ర్యాలీ లు డంపింగ్ యార్డ్ నుండే ప్రారంభించేవారు.

            మార్కెట్ లో ఎన్ని రకాల పూలమొక్కలు వచ్చాయో అన్నింటినీ డా.పద్మావతిగారు తెప్పించి నాటించేవారు.

            డా.పద్మావతిగారు ప్రత్యేక శ్రద్ధ తీసికొని డంపింగ్ యార్డును సర్వాలంకార శోభితంగా ఉంచేవారు. ఉంచుతున్నారు.

- ప్రాతూరి శాస్త్రి

21.09.2020