ప్రాతూరి శాస్త్రి - 19.10.2020. ....           19-Oct-2020

 మన కార్యకర్తలు

"ప్రాభాత ప్రాంగణాన మ్రోగెను నగారా

ఈ భారత భువిపైన పొంగేను జీవధార.

మన కార్యకర్త, ప్రజాగాయకుడు నందేటి శ్రీనివాస్ గారు తీయగా పాట పాడుతున్నారు.

 

కత్తి పట్టినగాని, గొర్రు పట్టినగాని

పంజా పట్టినా, పార పట్టినా

చెత్త లోడింగ్ వేసినగాని

అదే దీక్ష, అదే స్ఫూర్తి అనేటి

స్వచ్ఛ మనస్కులు మా కార్యకర్తలు.

 

వర్ధిల్లు రేయికి వెలిగిచ్చువానివలె

వర్ధిల్లు దినపు దివాకరునివలె

వర్ధిల్లు స్వచ్ఛతే సేవయనుచు

వర్ధిల్లు ఓ స్వచ్ఛ కార్యకర్తా.

పాదుల్జేసిరి బృందావనాంజయ్యలు,

లెస్సగా సొబగుల్ దిద్దిరి తాటిచెట్టుకు శ్రీను గురవయ్యలు,

సుందరీకరణ వారి శుభ్రతాసొగసు వర్ణించతరమా

వనితలేమో తలదీపాలతో చెత్తపోగుచేయ

మంచుపొగలోని సేవజూడ మానవ నేత్రలుచాలునే.

 

గజఘీంకారాలతో పనిచేయు వేంకటేశ్వరుడు,

నిమ్మకునీరెత్తినట్లు పనిచేయు మెండువారు,

పనియందు మాటలయిష్టము సజ్జావారు,

నాపని నాదేయంచు చెత్తనెత్తు సూపర్వైజరు,

సేవల్మత్తులుగారె చల్లపల్లి సేవకులు

 

మంచు కురిసెనేని దృష్టి మందగించు,

స్వచ్ఛ సేవకుల తలదీపాలు మిణుగురు పురుగుల పోల్చు

పలుగుపోటులు, పారల పరపరలు

గొర్రుల గుసగుసలు నిత్యమయ్యే,

బహువిచిత్రంబు వేకువసేవ ఎన్నడైనన్

 

మెండుశీను చేస్తాడు రోజూ ఓ. మూల

అంజయ్య చేస్తాడు ఫోటోలకు గోల

మహిళలంటారు మౌనంగా చేస్తే పోలా

సుందరబృందం చేస్తారు పరిశుభ్రంగా నేల

ఇదంతా రోజూ వుండే ఆనందహేల

 

రెండు చేతులలో కత్తులతో సవ్యసాచి గురవయ్య

కుడియెడమల కైలావారు, వేముల వారితో

చేయు పనితీరే వేరు సేవయందు

తాటిచెట్ల సొబగులు వారి చేతలే గదా.

 

సాహస కార్యములకు ముందడుగువేయు రక్షకదళము.

ఏపనికైన వెరవని భీకరులు మన భద్రతాదళము

తమకన్నులే దీపముగజేసి పనిజేయు మహిళాశక్తి

దివినుండి భువికి దిగిన దేవతామూర్తులు వీరు

సుందర చల్లపల్లి సాధించుట తధ్యముగాదె.

 

రహదారినూడ్చిన దుమ్ము,ధూళి

ధూపంలా ఎగసిపడుతుంటే,

నర్సరీ నేలను పడుతున్న పలుగుపోటులకు,

మట్టిగడ్డలు పైకిలేస్తుంటే,

పొగుల మట్టిని బుట్ట నెత్తగా

పారల పరపరలు

రేకుల గరగరలు

గొర్రులు గుసగుసలు గా

చెవులకు వినవస్తుంటే,

పేవరుటైల్స్ పై పేరుకున్న మట్టిని

చీపుళ్ళు వింజమరలా వీస్తుంటే,

సేవచేయు కార్యకర్తల మనసులుప్పొంగుతుండగా

సేవాపరిమళం సాగిందిలా.

 

పద్మావతి చెత్త ఎత్తుతూ రాగా

పద్మా నిలునిలుయంచు సాగే

వడివడిగా వాహనము నెక్కి

నడిపెన్ దృష్టి సారించి రామకృష్ణుడు

 

వడివడిగా రామకృష్ణుడు తెచ్చు వాహనము జూచి

గడిగడిగా వెళ్లక నిలుచుండిపోయే

ఆహా ఏమి నా భాగ్యమంచు

నిస్చేష్టయై అలవోకగా పద్మావతి గోముగా.

 

చిత్రాలకు రంగులీనినా

సమాజహిత పనులు చేపట్టినా

మీరజాల గలరా నాయానతి అన్నా

సుందరత్వానికే సౌందర్యం దిద్దగలదన్నా

ఏ స్థితిలోనూ రాజీపడని, ఒకే ఒక్కరు పద్మావతి.

సాహసమే ఊపిరి సహనమే శ్రీరామరక్షగా కార్యకర్తలను మలచి విజయపరంపరలు అందుకుంటూ కన్న కలలు సార్ధకం చేస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి మార్గదర్శకులు ధన్యజీవులు.

 

వారిరువురితో సాంగత్యం కోటి జన్మల పుణ్యఫలం.

 

- ప్రాతూరి శాస్త్రి

19.10.2020.