స్వచ్చోద్యమం లో తొలిరోజు అనుభవాలు....           07-Nov-2020

*1. భోగాది వాసుదేవరావు*.

అప్పుడప్పుడే చలి మొదలౌతొంది.

నవంబరు 12, 2014 న వేకువ ఉదయపు నడక ప్రారంభిస్తూ జూనియర్ కాలేజీ వద్దకు వచ్చాను.

కొంతమంది గుమిగూడి ఏదో పని చేస్తున్నట్లు కనబడింది.

దగ్గరకు వెళ్లి చూడగా Dr.DRK గారు

చీపురుతో వుడుస్తున్నారు.

స్వచ్ఛ చల్లపల్లి ప్రారంభించాం అన్నారు.

అరే! మొదటి రోజు miss అయ్యానేమిటబ్బా అనిపించింది.

మరుసటిరోజు నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

వెళ్లి ఏం చేయాలి?

చీపుళ్ళతో రోడ్డు శుభ్రం చేయాలట.

చేయగలమా, లేదా, మీమాంసలో పడ్డాను.

అయినాసరే వెళ్లాలనిపించింది.

మరుసటిరోజు, అదే నేను మొదటిసారి స్వచ్ఛ చల్లపల్లి లో అడుగుపెట్టగానే ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది.

గబగబా ఓ చీపురు తీసికొని తల ఎత్తకుండా వుండడం మొదలు పెట్టాను.

చాలా thrilling …

అబ్బా, మనం గూడా వీరితో కలిస్తే బాగుండునే అనుకున్నాను.

నా కల నెరవేరింది.

*2. గోళ్ళ వెంకటరత్నం* :

మా యోగాసెంటరులో ప్రస్తావించాను. సభ్యులంతా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాల గూర్చి అడిగి తెలుసుకున్నారు.

వారానికోరోజు సేవ చేద్దామనుకున్నాము. 1 కాస్తా 2 అయింది.

చాలా మందికి నచ్చిందేమో ఒక్కొక్కరుగా రోజువారీ కార్యకర్తలైనారు.

అప్పటినుండి ఇప్పటి వరకు శాయశక్తులా సేవాబాధ్యతలు చేపడుతునేవున్నాను.

ఒక స్వచ్చోద్యమం లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

వెళ్ళనిరోజు మనసు ఏదోలా ఉండేది. 

నేను మెచ్చిన, నాకు నచ్చిన, నా జీవితంలో ఆనందమయ లక్షణాలు అంటే స్వచ్ఛ చల్లపల్లి లో పాల్గొనడమే.

జై స్వచ్ఛ సుందర చల్లపల్లి

*3. విజయరమ*

నేను ఘంటసాల విజయరమ.

నా భర్త రాయపాటి రాధాకృష్ణ గారితో కలసి నేను కార్యక్రమానికి వెళ్ళాను.

ఆరోజు ఆదివారం అగుటచే చాలామంది వచ్చారు.

చీపుళ్ళ శబ్దాలు, రికార్డు ప్లేయర్ నుండి వచ్చే పాటలు,తలకు లైట్లు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు.

ఆ వాతావరణం నాకు బాగా నచ్చింది. చేతులకు గ్లౌస్ వేసికోవడానికి సమయం పట్టింది.

ఇంతలో డాక్టర్ గారు వచ్చి నమస్తే టీచర్ గారు అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది.

నాకు కొత్త. ఏ పని చేయాలో చెప్పండి అన్నాను. పద్మావతి మేడం గారు అటు వున్నారు. వెళ్ళండి అన్నారు. అటు వెళ్ళాను.

ఆనాటి నుండి చాలామంది స్నేహితులు అయ్యారు.

లక్ష్మీ, ధనలక్ష్మి, వదినా అంటూ కబుర్లు. అన్నపూర్ణ, సుభాషిణి అందరితో కలిసి పనిచేయడం చాలా బాగుందనిపించింది.

తొలిరోజు నేను ఊడ్చిన చోటు చూసుకుంటే గుండెనిండా ఆనందం పొంగిపొర్లింది. 6 గం. కు డాక్టర్ గారు ఈల వేయగా అందరం కాఫీ తాగి గ్రూప్ ఫోటో తీసికోవడం ఈనాటికీ గుర్తుకొస్తాయి.

*4. రాయపాటి రాధాకృష్ణ* :

జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో డా.డీఆర్కే. ప్రసాద్, డా. పద్మావతి గార్ల నేతృత్వంలో స్వచ్ఛ కార్యకర్తలు గంగులవారిపాలెం నుండి జూనియర్  కాలేజీ మీదుగా చల్లపల్లి 1 వ వార్డు గూడెం వరకు మైకు ద్వారా ప్రచారం చేస్తూ కత్తులు, గొర్రులు, చీపుళ్ళు, డ్రైన్ పారల నుపయోగించి పరిశుభ్రం చేస్తున్న విషయం తెలుస్తువున్నా మా యోగా సమయం, పరుశుభ్రతా సమయం ఒకటే కావడంచేత,100 రోజుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయాను.

100 రోజుల పండుగకు అప్పటి ఉపసభాపతి గౌ. బుద్ధప్రసాద్ గారు పాల్గొంటున్నారని, చల్లపల్లి ని దత్తత తీసికొంటున్నారని తెలిసి, తద్వారా గ్రామ పంచాయతీ కి నిధుల సేకరణ జరిగి, చల్లపల్లి అభివృద్ధి కి దోహదం కాగలదని నమ్మకంతో  ఈ కార్యక్రమంలో నా భార్య విజయరమతో పాల్గొనడం జరిగింది.

నేను భవగ్ని చేరేసరికి ఉదయం 4.45ని అయింది. అప్పటికే బుద్ధప్రసాద్ గారు, పంచాయితీ కార్యవర్గం, కార్యకర్తలు చేరుకున్నారు.

కార్యకర్తలు సమయపాలనతో, తెల్లని దుస్తులు ధరించి కార్యక్రమానికి హాజరవడం ఆశ్చర్యం.

భవగ్ని నగర్ నుండి 1 వ వార్డు వరకు కార్యకర్తలు మంచి మంచి ముగ్గులతో, స్వచ్ఛ చల్లపల్లిజెండాలతో 5 గం. కు ఊరేగింపు ప్రారంభమైంది.

శోభయమనంగా ఉన్న రోడ్లు చూసాక కార్యకర్తలతో ఊరేగింపులో పాల్గొనేందుకు నాకు చాలా ఆనందం కలిగింది.

*5. గోళ్ళ సాంబశివరావు* :

స్వఛ్ఛ చల్లపల్లి కు వెళ్ళగలనా లేదా అనే అంతర్మధనం తో నామొదటి రోజున అడుగు పెట్టాను. డాక్టర్ దంపతులు చిరునవ్వుతో నమస్కారం తో స్వాగతం పలికారు. మొదటి రోజు న చీపురు తో ఊడ్చుతుంటే ఎలా పట్టుకోవాలో డాక్టర్ గారు నేర్పారు. స్వేదం చిందింది. ఎంతో ప్రశాంతంగా వుంది మనస్సు. ఇన్ని రోజులు ఎందుకు రాలేకపోయానా అని నాలో నేను సిగ్గు పడి ప్రతి రోజు అడుగు ముందు కు వేశాను. ఎన్నో మధురస్ముతులు సొంతం చేసుకున్నాను.

జై స్వచ్ఛ సుందర చల్లపల్లి