రావెళ్ల శివరామకృష్ణయ్య....           22-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 19

నా కనీస బాధ్యత!

            ఈ ఒక్క చల్లపల్లిలో నే కాదు – అవనిగడ్డ నియోజకవర్గమంతటా – ఇంకా చెప్పాలంటే సుమారు 30 గ్రామాల్లో ప్రతిధ్వనిస్తున్న స్వచ్చ – సుందర గ్రామ సామాజిక  సందళ్లను పరిశీలిస్తున్న వాళ్ళకి నాలాగే “రావలసిన సమయంలో – కావలసిన ఉద్యమంరా ఇది” అనిపించే ఉంటుంది. ఇక ఈ ఉషోదయ శ్రమదాన ఉద్యమంలో పాల్గొనేవాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో వేరే చెప్పాలా? ఐతే – ఈ 21 వ శతాబ్ద సమాజానికి త్యాగం – సమిష్టి కృషి సమైక్యత – ఉమ్మడి సంక్షేమం లాంటి సద్భుద్దులెక్కడా మిగలక – 2000 రోజుల ఇంతమంది స్వచ్చంద శ్రమదాతల నిరంతర గ్రామ సౌభాగ్య కృషిని ఇప్పటికీ కొందరు నమ్మలేకపోతున్నారంటే ఇప్పటి ప్రస్తుత మన సామాజిక నైతిక ప్రమాణాలు అంత దుస్థితిలో ఉన్నాయని అర్థం!

            చిన్ననాడే కుటుంబ వారసత్వంగా కమ్యూనిస్ట్ భావజాలం వంటబట్టిన వాణ్ని – నా 79 ఏళ్ల అనుభవంలో - ఇటీవల కాలంలో ఈ మాత్రం సామాజిక ప్రయోజనకరమైన ఉద్యమాన్ని మళ్లీ దగ్గరగా చూడటం, సుమారు 1600 రోజులు స్వయంగా పాల్గొనడం – తోచినంత ఆర్ధిక ఆలంబన కల్పించడం ఎనలేని సంతృప్తినిచ్చింది. ఈ వందలాది కార్యకర్తలు తమ చల్లపల్లి గ్రామ హద్దులు దాటి చాలా ఊళ్ళకు తమ ఆదర్శ శ్రమను సమర్పించారు.  అందులో నేను ప్రస్తుతం ఉంటున్న శివరామపురం కూడా ఒకటి! (అసలు ఊరు మంగళాపురం). నా పేరు రావెళ్ల శివరామకృష్ణయ్య. నేను, నా భార్య లీలావతి విశ్రాంత ఉపాధ్యాయ పెన్షనర్లం.

            ఈ స్వచ్చోద్యమ ప్రారంభకుల్లో ముఖ్యుడైన – సంచాలకుడైన దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ఒకమారు “మా ఇద్దరిలో ఏ ఒక్కరమైనా – ఏ అనారోగ్య కారణంతోనో పనిచేయకలేకపోతే - ఈ ఆస్పత్రి నిర్వహణ అసాధ్యమౌతుంది..” అన్నారు. ఆయన అన్న మాట ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి కూడ వర్తిస్తుంది. గత మూడు నెలలుగా నా అనారోగ్యంతో హైదరాబాదులో ఉండి, స్వచ్చంద శ్రమదానానికి రాలేక – చూడలేకపోయాను – అదెంత వెలితో ఇప్పుడు తెలిసి వచ్చింది.

            ఈ వైద్య దంపతులిద్దరూ ఏ అనారోగ్యమూ లేకుండ ఇంకా సుదీర్ఘ కాలం ఈ సమాజానికి చికిత్సలు చేస్తూ వర్ధిల్లాలని కోరుకోవడం సరే – ఈ కార్యకర్తలంతా ఇంత త్యాగ నిరతితో –ఇక ముందు  ఎవరి పర్యవేక్షణా లేకుండానే – స్వయం చోదితులై ఆదర్శప్రాయమైన ఈ కార్యక్రమంతో ఈ సమాజ చైతన్యాన్ని కొనసాగించాలనే నా అసలు కోరిక! ఆ మేరకే మీ అందరికీ నా శుభాకాంక్షలు, నా విన్నపం. నేను ఏ కాస్త శక్తి ఉన్నా సరే ఈ వేకువ జాము శ్రమదాన కార్యక్రమానికి వస్తూనే ఉంటాను. చేయగలిగినంత ఏ చిన్న పనైనా చేస్తూ సంతృప్తి చెందుతుంటాను.

- రావెళ్ల శివరామకృష్ణయ్య,

విశ్రాంత ఉపాధ్యాయుడు – శివరాంపురం

                      16.05.2020.