మల్లంపాటి ప్రేమానంద్....           23-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 20

స్వచ్చ సుందర – చల్లపల్లి నిర్మాణంలో

2000 రోజుల నిర్విరామ శ్రమదానం

            ఈ విశిష్ట స్వచ్చ ఉద్యమ నిర్మాతలకు – ఐదారేళ్లుగా అకుంఠిత దీక్షతో – తమ తొలి దినచర్యగా – నిష్టగా ఆదర్శాన్ని ఆచరణగా మారుస్తున్న స్వచ్చ చల్లపల్లి సహ కార్యకర్తలకు ముందు గా నా అభినందనలు.

            నా దృష్టిలో ఈ సుదీర్ఘ ఉద్యమం ఒక ఆత్మాభిమానానికి, ఒక స్వావలంబనకు, ఒక స్వయం కృషికి, ఐకమత్యానికి, పరోపకారానికి, అవగాహనకి, దూరదృష్టికి, సహనానికి, కుల మతా తీత భావనకీ, విశాల సమదృష్టికీ, ఒక ఆదర్శ శ్రమ సంస్కృతికీ – ఇంకా ఎన్నో విలువలకీ  చిహ్నం!

            ఈ స్వచ్చోద్యమ కారుల్లో – “నా ఆస్పత్రి బాగుండాలి – నేను కోటాను కోట్లు వెనకేసు కోవాలి.....” వంటి ఆలోచనలకు భిన్నంగా – “నా వూరు – నా గ్రామస్తులు, అన్ని కులాల – అన్ని మతాల – అన్ని గ్రామాల ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, చైతన్యవంతులు గా మారాలి, ఐకమత్యంగా పది మంది కోసం శ్రమించాలి”.... వంటి ఆదర్శాలు గల – ఆచరణలు గల డాక్టర్లున్నారు.

            “ఏం – మన ఊరి కోసం ఊరి వాళ్ళ స్వస్తత కోసం ప్రొద్దున్నే గంటన్నర పాటు శ్రమిస్తే అరిగిపోతానా? నా కండలన్నీ కరిగిపోతాయా? వస్తే మనకు కాస్త ఆత్మ సంతృప్తి, కొంత ఆరోగ్యం వస్తాయి – పోతే కులమతాల కుళ్ళు, చేతకాని పనికిరాని సొల్లు తొలగిపోతాయి...” అనే ఆలోచనలు పెంచుకొంటున్న, రాటు తేలుతున్న కార్యకర్తలున్నారు. “ఇల్లే వైకుంఠం – వంటిల్లే మన సామ్రాజ్యం ...” అనుకోక వేకువనే 4.00 కే ఇంటికి దూరంగా గ్రామ పారిశుద్ధ్యం కోసం శ్రమిస్తున్న మహిళలున్నారు. అది కూడ ఒకటీ వందా రోజులు కాదు – నేటికి 2020 రోజులుగా!

            నాలుగేళ్ల నాడు పొద్దున్నే – చల్లపల్లి వెళ్తుంటే – మేకల డొంక దగ్గర – డాక్టర్లు, టీచర్లు, ముసలివాళ్ళు 40 మంది మా ఊరి దారిని  ఊడుస్తూ – పూల మొక్కలు నాటుతూ కన్పించారు. మరునాటి నుంచి - అంటే 4.2.2016 నుండి నేను, నా శివరాంపురం గ్రామస్తులు కొందరు వెళ్ళి, వారితో కలిసి పనిచేస్తున్నాం. నా వ్యవసాయ పనులు మరీ ముమ్మరిస్తే తప్ప – క్రమం తప్పకుండా వెళుతూనే ఉన్నాను. ఈ వెయ్యి రోజులు నా కోసం కాక, సమాజ హితం కోసం శ్రమిస్తే కలిగే తృప్తి ఏమిటో – వెళ్లని నాటి వెలితి ఏమిటో అది నా అనుభవైకవేద్యం.

            ఈ స్వచ్చ సుందర ఉద్యమానికున్న గుర్తింపు, వచ్చిన - వస్తున్న – రానున్న అవార్డులు, ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ ఈ రోజు దేశ వ్యాప్తంగా  తెలియని వారు లేరు.

            “40 – 50 మందిమి ప్రొద్దున్నే కలిసి పలకరించుకొంటాం – డాక్టరు గారి నమస్కార పూర్వక పరామర్శలందు కొంటాం – ఏతర తమ భేదాలు లేకుండ రెండు గంటలు శ్రమిస్తాం – తృప్తిగా తిరిగివస్తాం...” ఇంతకన్న ఏమాశించాలి? తినడానికి, ఉండడానికి, సరిపడా నాకు వ్యవసాయమున్నట్లే నా సోదర స్వచ్చ కార్యకర్తలందరికీ అవకాశాలున్నాయి కదా!   

            అందుకే మాది సంతృప్తికరమైన, సుస్ధిరమైన స్వచ్చ కుటుంబం. ఎప్పటికీ దీనికే నా సహకారం.

- మల్లంపాటి ప్రేమానంద్

శివరామపురం, 23.05.2020.