మాలెంపాటి అంజయ్య....           27-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 24

ఐదేళ్లుగా నా జీవితంలో భాగమైపోయిన – 2000 దినాల చల్లపల్లి స్వచ్చోద్యమం

           ఎవరో చెప్పమన్నందుకు చెపుతున్నవి కావు! నా అనుభవంలో నుండి చెబుతున్న మాటలండి : చిలకపలుకులు, వినికిడి మాటలు మనకెందుకు - అవి వేరండి, మన - అనుభవం లో నుంచి వచ్చేవి వేరండి. 

            నా పేరు మాలెంపాటి అంజయ్య. పెద్ద చదువులు లేవనుకోండి; నా చిన్నతనంలో స్వర్ణలోను, యాజలి (గుంటూరు జిల్లా) లోనూ, బండిచాకిరీ వ్యవసాయం చేసిన వాణ్ణి. ఇక్కడ మా అత్త గారి ఊరు - రాముడుపాలెం లోనూ పెద్ద వ్యవసాయం చేయవలసే వచ్చింది. ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు. 20 ఏళ్ల నుండి చల్లపల్లి లో ఉంటూ – 15 ఏళ్ల నుండి ధ్యానమండలిలో ఆరోగ్యం జాగ్రత్త పడుతూ ఉండగా –

            అందులో ఒకళ్ళు - 40 - 50 రోజుల్నుండి జనవిజ్ఞానవేదిక వాళ్ళు, డాక్టరు గారు పొద్దున్నే రోడ్డు ఊడుస్తున్నారంట – మనం కూడ వెళ్దామా” అంటే నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు – చివరికి 10 మందిమి వెళ్ళటం మొదలుపెట్టాం. నా వరకు నేను మొదట 100 రోజులు, నడుముకు ఆపరేషన్ జరిగి మరొక వంద రోజులు తప్ప – ఈ 1800 రోజులు శ్రమదానం చెయ్యక పోతేను- అక్కడ మనసుకు నచ్చే నాలుగు మాటలు చెవిన పడకపోతేను – కాఫీలు తాగుతూ శ్రమను మర్చిపోయి ఒకళ్లతో ఒకళ్ళు సరదా జోకులు లేకపోతేను – అందరము కలిసి, ఆ నాడు శుభ్రం చేసిన వీధినో, మురుగు కాలువనో శ్మశానాన్నో చూసుకోకపోతేను అస్సలు ఆరోజిక ఏమీ తోచదండి – మనం బ్రతుకుతున్న ఈ ఊరి కోసం, దీని శుభ్రత కోసం గంటో – గంటన్నరో చాతనైంది చేస్తే – ఊరి వాళ్ళ కోసం ఇవాళ మనం కూడ ఈ పని చేశాం రా అని గుర్తు చేసుకుంటే – ఇక ఆరోజంతా ఎంత మజాగా ఉంటుందో తెలుసా?

            అసలు – నిన్న మా స్వచ్చ కార్యకర్తె ఒకాయన – పేరెందుకు గాని – “అంజయ్య గారు! మీ నడుం నెప్పితో ఈ వయసులో ట్రాక్టరెక్కి లోడింగ్ చేస్తూ – మురుగ్గుంటలో దిగి తుక్కు ఏరుతూ ఇంకా ఎన్నాళ్లు చేస్తారు?....” అని ఏవేవో అడిగాడు. ఏం చెప్పేది? నా సంతోషం కోసం నేను చేస్తున్న పనాయె. ఐనా నేనొక్కడినే ఇదంతా చేస్తున్నానా? ఇందరు డాక్టర్లు, ఆడ కూతుర్లు, టీచర్లు, పిల్లలు కలిస్తేనే గదా – ఇన్ని వేల రోజులకి ఈ చల్లపల్లి ఇంత అందంగా – శుభ్రంగా – ఆరోగ్యంగా తయారైంది? నా పాటికి నేను ఉడతా భక్తిగా “మనకోసం మనం ట్రస్టు” కు 1,50,000/- మా అత్త గారు 10,000/- సాయపడ్డామంటే – అదీ ఒక తృప్తే మరి!

            రోజూ – వానైనా, మంచైనా – ఎండైనా రోజూ రెండూ గంటలు పాటు బడడమంటే – అది కష్టమేననుకోండి, కాని ఇష్టపడి, ఇంత మంచి గ్రూపులో ఒక మంచి ఉద్దేశం కోసం చేస్తుంటే – ఏమంత బాధ ఉండదు. కాబట్టి దీంట్లో నుంచి కాలూ – చెయ్యీ ఆడుతున్నంత దాక రిటైరు కావడమంటూ ఉండదు. మా డాక్టర్లు – ఊరి కోసం ఇంతగా పాటుబడుతున్న కార్యకర్తలు, ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలనీ, మా ఊరిని చూసి, దేశం లో అన్ని ఊళ్లూ పూర్తిగా మారిపోవాలనే నా కోరికండి.

- మాలెంపాటి అంజయ్య,

                     చల్లపల్లి - 23.05.2020.