ముత్యాల లక్ష్మి....           28-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 25

అనుకోకుండా – కనిపించకుండా మా చల్లపల్లిని కుదిపేసిన

2000 రోజుల స్వచ్చ – సుందర ఉద్యమం.

            నిజం చెప్పాలంటే, 50 – 60 రోజులు దాకా మా వూళ్ళో జరుగుతున్న ఈ ఉద్యమం గురించి, చూచాయగా తెలుసుగానీ – నేను పట్టించుకో లేదండి. మాది టిపిను హోటలు వ్యాపారం – ఇంటి ముందు ఎంత గలీజు పడుతుందో చెప్పాలా? రోజుటిలాగే – జనవరి, చలికాలంలో 6 గంటల తర్వాత లేచి రాజ్యలక్ష్మీ ఆస్పత్రి రోడ్డులోని మా హోటలు ముందు శుభ్రం చేద్దామని బైట కొచ్చి చూస్తే – మా ఇళ్ల ముందే కాదు – బజారంతా మురుగు కాల్వతో సహా – అద్దంలా, శుభ్రంగా ఉంది. పక్కింటమ్మాయి చెప్పింది - ఇప్పటి దాక 30 – 40 మంది మన బజారంతా శుభ్రం చేసి వెళ్లారు. అందులో పెద్ద డాక్టర్లు, టీచర్లు - ఆడవాళ్ళు - ఇప్పుడే వెళ్ళిపోయారు ఆంటీ అని. నిజం చెప్పాలంటే - ఆ రోజు నాకు చచ్చేంత సిగ్గేసింది. ఇంత పెద్దలంతా నా ఇంటి ముందు – రోడ్డంతా ఊడుస్తుంటే – మొద్దు నిద్ర పోయానా అని!

          తర్వాత పసుపులేటి ధనలక్ష్మీ వదిన, పల్నాటి అన్నపూర్ణ వదిన కూడా రోజూ ఈ పనిలో ఉన్నారని తెలిసి, వెళ్ళి, మాట్లాడి – నన్ను కూడ అందులోకి రానిస్తారా?’ అని అమాయకంగా అడిగి, 90 వ రోజు తర్వాత పొద్దున్నే రావడం అలవాటు చేసుకొన్నాను.

          డి.ఆర్.కె. ప్రసాదు గారి లాంటి పెద్ద పెద్ద వాళ్ళని, మర్యాదస్తుల్నీ చూసి మొదట్లో వెళ్ళాను తప్ప, కాలం గడిచే కొద్దీ గానీ ఈ గ్రామ పారిశుధ్యం పని విలువేమిటో – నేను గాని, గ్రామస్తులందరు గాని ఎందుకిలాంటి పనులు చేయాలో, చల్లపల్లిలోని ఈ ఉద్యమాన్ని చూసి, రెండు రాష్ట్రాల్లో 30 పైగా ఊళ్ళ వారు కూడ అక్కడ ఇదే పనులెందుకు చేస్తున్నారో – ఏమీ ఆశించక – ఊరి మేలు కోసం ఇంత కాలం చేస్తున్న ఈ పనికి దేశంలోను, ప్రపంచంలోను ఎందుకింత గుర్తింపో తెలిసి వచ్చింది! గుర్తింపులకేం గాని, పొద్దున్నే వెళ్ళి – 2 గంటల పాటు “నేను చేస్తున్నది పది మందికి ఉపయోగపడే ఒక మంచి పని గదా” అనుకొంటూ, అందరం కలివిడిగా మాట్లాడుకుంటూ – రేపు ఇంకా ఏమి చేయగలం అని ప్లాను వేసుకొంటూ, సంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చిన నాటికీ – కుదరక వెళ్లని నాటికీ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది!

          అసలు నాది ఈ వూరే కాదండీ. కోడూరు దగ్గర లింగారెడ్డిపాలెం! “చంటి” (అది మా ఆయన పేరు) హోటలంటే తెలియనివాళ్ళుండరండి. మా అబ్బాయి 4.00 కే నన్ను బండి మీద తీసుకు వచ్చి, మళ్ళీ6.30 కు వచ్చి తీసుకుపోతాడు. నేనైనా మీరైనా ఒక్కటే ఆలోచించాలండి – ఇల్లు దాటని నాలాంటి ఆడవాళ్ళు ఇన్ని వేల రోజులు శ్మశానాల్లో – బస్టాండుల్లో – చెత్త కేంద్రాల్లో – చీకట్లోనైనా వెనుకాడక మురుగులెత్తి, వీధులూడ్చి, మొక్కలు నాటి, .... ఇన్నిన్ని పనులు చేశామంటే – ఎవరికి వాళ్ళుగా చేస్తామా? ఇంతమందిమి ఇదొక మంచి పనని నమ్మి ఐకమత్యంగా నిలబడబట్టే గదా చేస్తున్నది? ఇంటి దగ్గర పనులు, కుటుంబాల్లో సమస్యలు, పిల్లల పనులు, ఆర్ధిక బాధలు, వంట పనులు .... ఇలా ఆడవాళ్ళమన్నాక – ఎన్నో ఉంటాయి గదా – ఐనా సరే – అప్పుడప్పుడూ కాస్త ఇలా ఊరి కోసం కూడా పాటుబడితే పోయేదేముంటుంది?

          సరే! అవన్నీ నాకెందుకు గాని, నా పాటికి నేను మాత్రం ఈ స్వచ్చంద శ్రమదానం మానను. ఈ నాలుగేళ్ల నుండి మా పిల్లల, మనుమల పుట్టిన రోజులు, విందుల్లో మా స్వచ్చ కుటుంబీకులందరూ పాల్గొంటారు. అసలు ప్రతి రోజూ జరిగే మా స్వచ్చ ఉద్యమమే ఒక వేడుక. అంతమంది సొంత ఊరి కోసం పాటుబడడమే ఒక పండుగ! ఔనా, కాదా?

- ముత్యాల లక్ష్మి,

         చంటి హోటల్ – చల్లపల్లి (20.05.2020)