పసుపులేటి సత్యన్నారాయణ....           29-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 26

అపూర్వ వింత అనుభవం 2020 దినాల మా స్వచ్చ చల్లపల్లి ఉద్యమం

          వింత ఉద్యమం కాకపోతే ఏమిటో చెప్పండి. ఎప్పుడో పెద్ద వాళ్ళు చెపితేవిన్నాం. గాంధీ గారు జైళ్లలో ఉన్నప్పుడు ఖైదీల మలమూత్రాల డిప్పలు మోసేవాడని. మళ్ళీ 2014 లో వినడమేమిటి – చూశాను – చల్లపల్లి లో కొన్ని పెద్ద తలకాయలు కూడి, చీపుళ్లేసుకుని వీధులు ఊడుస్తుండగాను, మురుగు కాల్వల పూడికలు తీస్తుండగాను! మరొక 15 రోజుల్లో నే మా వదిన పసుపులేటి ధనలక్ష్మి (4 వ వార్డు మెంబరు) గారు కూడ వాళ్ళతో చేరిపోయి, మా వార్డులోనే - సాగర్ టాకీసు బైపాస్ రోడ్డులోనే – చీకట్లోనే ఇవన్నీ చేస్తుంటే - జానీ, దాసి సీతారామరాజుల ప్రోద్భలంతో నేను కూడ వెళ్ళి, ముందు రోజు దూరంగా నిలబడి చూశాను. కనీసం మా ఇళ్ల దగ్గర చేసేప్పుడైనా ఐదారు రోజులు వెళ్ళకపోతే బాగుండదని వాళ్ళతో కలిసి పనిచేశాను.

          పోనుపోను ఇక అదే అలవాటై – పూర్తి కార్యకర్తగా మారాను గాని, మధ్యలో కొన్ని బ్రేకులు పడ్డాయి. నమ్మిన వాళ్ళతోనే ఆర్ధిక సమస్యలు, ఆడపిల్లల పెళ్లిళ్ల గొడవలు, బండి మీద నుండి పడి యాక్సిడెంట్లు, ఎడం భుజం చాలా కాలం పనిచేయక – ఆరోగ్యం ఒడుదుడుకులు ఎన్నెన్నో వచ్చి పడ్డాయి. ఎన్ని ఇబ్బందులున్నా – నడుమ కొన్ని మార్లు మానినా ఇది కొంత ఊరట నిచ్చే ఉదయ కాలపు స్వచ్చ కార్యక్రమం అని గ్రహించి ఇప్పటి దాక వస్తూనే ఉన్నాను.

          అధికారికంగా 22, అమలులో 18 వార్డులున్న ఇంత పెద్ద గ్రామం పంచాయతీ తన పూర్తి సామర్ధ్యంతో పనిచేయక – ప్రభుత్వ సహజమైన  మందకొడితనంతో శుభ్రత లోపించినపుడు ఈ స్వచ్చ కార్యకర్తలు మేమున్నామని ఐదారేళ్ళ నుండి సాధించిన విజయాలు గాని, ఊళ్ళో శ్రమదానంతో తీర్చిదిద్దిన ప్రదేశాలు గాని చెప్పుకోదగినవే! మా డాక్టర్లక గాని, కార్యకర్తలకు గాని ఉండే త్యాగగుణమూ, ఊరంతా బాగుపడి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే మంచి ఆశయమూ తప్ప, స్వార్ధమూ, అల్పబుద్ధులూ లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఎన్ని అపవాదులూ, అపార్ధాలూ, పెడర్ధాలూ వచ్చినా ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమం 2022 రోజులుగా కుంటుపడక, ఎన్నో ఊళ్ళకు ఆదర్శంగా ముందుకు సాగుతూనే ఉన్నది.

          అందరమూ తలుచుకుంటే – ఒక మంచి ఆదర్శం కోసం మంచి మనసుతో – ఓర్పుతో పనిచేసుకొంటూ పోతే అనుకొన్నవి సాధించవచ్చు అనడానికి చల్లపల్లే ఒక ఉదాహరణ, అసలిందులో వంక పెట్టడానికే ముంది? “ఊరంతటి బాధ్యత నాదే! నాకు చాతనైనంత వరకు ఆ కర్తవ్యం పూర్తి చేస్తూనే ఉంటాను” అని ముందుకు సాగితే అందుకు ఎవరు వేలెత్తి చూపుతారు? ఉంటే ఈ కార్యక్రమం వల్ల గ్రామానికీ, ప్రజలకీ ప్రయోజనముండాలి గాని, నష్టం గాని, అభ్యంతరం గాని ఎందుకుండాలి?

          అందుచేత నేను చెప్పేదేమంటే ఈ స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమం ఎప్పటికీ నిరాటంకంగా నడుస్తూనే ఉంటుందనీ – ఉండాలనీ కోరుతూ – నేను సైతం ఒక చెయ్యి వేస్తూనే ఉంటానని తెలియజేస్తూ....

- పసుపులేటి సత్యన్నారాయణ

      23.05.2020