గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు ....           19-Dec-2019

 ఎంతో సంతోషకరమైన గత 6 సంవత్సరాలు

(గ్రామాభివృద్ధి కోసం 6 సంవత్సరాలు )

          మా ఆసుపత్రిని చల్లపల్లిలోని గంగులవారిపాలెం రోడ్డులో 1995 జనవరి 1 న ప్రారంభించాము. అప్పటినుండి ప్రధాన రహదారి మొదలుకొని మా హాస్పిటల్ వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా బహిరంగ మల విసర్జన, కుళ్లిన మాంస వ్యర్ధాలు చోటుచేసుకునేవి. ఈ రోడ్డు ప్రక్కల నివసించే కాలనీ వాసులం కొందరం ఈ బహిరంగ మలవిసర్జనను ఆపడం ఎలా? అనేది చర్చించుకునేవాళ్ళం. కానీ పరిష్కారం మాత్రం మాకు తెలిసేది కాదు.

         

          2013 డిసెంబరులో రామారావు మాస్టారు, డా. పద్మావతి, నేను ఏమైనా సరే, ఈ సమస్య పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాము. కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశాము. ప్రతి రోజూ ఉదయం 3.30 నుండి 6.30 వరకు రోడ్డు మొదట్లో నుంచొని మలవిసర్జనకు వచ్చే వారిని “ఈ బజారులో మలవిసర్జన చేయవద్దు అని మర్యాదపూర్వకంగా అభ్యర్ధించాలి” అని తీర్మానించాము. చల్లపల్లి, లక్ష్మీపురం రెండు పంచాయితీల కార్యదర్శులకు, సర్పంచ్ లకు, D.S.P, C.I, S.I గార్లకు, గ్రామంలో కొంతమంది పెద్దలకు మేము చేయబోయే కార్యక్రమాన్ని వివరించాము. ఇంచుమించు అందరూ సానుకూలంగా స్పందించారు.

         

          డిసెంబర్ 20, 2013 న మా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఉదయం 3.30 నుండి 6.30 వరకు రోడ్డు మొదట్లో నిలబడి మలవిసర్జనకు వచ్చే వారిని అభ్యర్ధిస్తుండే వాళ్ళం. ఉదయం 6.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఒక కాపలాదారుడిని నియమించాము. మొదట్లో కొంతమంది కొంత ప్రతిఘటించి, వాదించినా, 3 నెలలలోనే బహిరంగ మలవిసర్జన పూర్తిగా ఆగిపోయింది. అయినా సరే 11 నెలల పాటు నవంబర్ 11, 2014 వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాము.

 

          2014 నవంబర్ 12 నుండి స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని ప్రారంభించాము. ప్రతిరోజూ ఉదయం 4.30 నుండి 6 గంటల వరకు 30 నుండి 50 మందిమి

                   రోడ్లు, రోడ్డు ప్రక్కలను ఊడుస్తూ,

                   మురుగుకాలువలను శుభ్రం చేస్తూ,

                   రోడ్ల ప్రక్కన కలుపు మొక్కలను తీసివేస్తూ,

                   శ్మశానం, డంపింగ్ యార్డు లను శుభ్రపరుస్తూ,

                   నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను నాటుతూ,

                   అందవికారంగా ఉన్న గోడలకు రంగులు, అందమైన బొమ్మలను వేస్తూ శ్రమిస్తున్నాము.

          మొదట్లో ఊరి పరిశుభ్రత  మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నా ఆ తరువాత

                    పచ్చదనం,

                    సుందరీకరణ,

                    ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం,

                    హరిత వేడుకలను ప్రోత్సహించడం,

                    గృహస్తులను కలిసి చర్చించడం పనిగా పెట్టుకున్నాం.

          స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలందరికైతే వారి జీవితాలలో గత 5 సంవత్సరాలు అత్యంత సంతోషకరమైన రోజులు. తమ కోసం, తమ కుటుంబం కోసం కాకుండా ఊరి కోసం సమిష్టిగా ప్రతిరోజూ 2 గంటలు శారీరక శ్రమ చేయడం ఈ సంతోషానికి కారణం. గంగులవారిపాలెం రోడ్డులో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా పనిచేసిన నాలాంటి మరికొంతమంది కార్యకర్తలకు గత 6 సంవత్సరాలూ సంతోషకరమైన రోజులే. (20.12.2013 నుండి నేటి వరకు)

          ఈ సంతోషాన్ని వదులుకోము, గ్రామభ్యుదయం కోసం ఈ కృషిని కొనసాగిస్తూనే ఉంటాము....

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

19.12.2019.