03.07.2020....           03-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.


03.07.2020 వ నాటి రహదారుల వృక్ష పొందిక.


            నిన్నటితో కరోనా విఘాత స్వచ్చ చల్లపల్లి శ్రమదానం ముప్పది రోజులు ఆగినట్లే. ఐతే ఈ నాటి నిర్మల ఉషోదయంలో ఐదుగురు కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్డులోని సుమారు 30 చెట్ల కొమ్మలుకొన్ని కరెంటు తీగల దాక పెరిగిపోతుండటం గమనించి, విద్యుత్ శాఖ వారి కళ్ళు, కత్తులు వాటి మీద పడక ముందే జాగ్రత్త వహించారు.


            వేకువ 4.00 గంటలకే వీరు బండ్రేవు కోడు వంతెన దగ్గర మొదలు పెట్టి, వానలకు తొందరగా పెరుగుతున్న ఏడాకుల చెట్ల కొమ్మలను బారుకత్తితో అటు తీగలకు తగలబోతున్న ఇటు దారి వైపుకు సాగుతున్న వాటిని కత్తిరించారు. 6.00 గంటల దాక సాగిన ఈ ప్రయత్నంలో ఐదుగురు పాల్గొన్నారు.


            స్వర్వకాల సర్వఅవస్థలలోను కఠిన వాతావరణాలు గానీ, నేటి వలె సుప్రసన్న పరిస్థితులలో గానీ తమ గ్రామ రహదారుల భద్రత మన్నిక సౌకర్యం సౌందర్యం శుచి శుభ్రతల గురించే ఆలోచించే చల్లపల్లి  కార్యకర్త ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తాడు? అన్ని రహదారుల్లో బస్ స్టాండు, శ్మశానం, వంటి చోట్ల తాము నాటి, పోషించి, కాపాడి, పెంచిన వేలాది చెట్ల పూల మొక్కల క్షేమమే తద్ద్వారా 30 వేల మంది జనుల సౌకర్యం, ఆహ్లాదమే అతని మనసులో నిలిచి ఉంటాయి మరి.


            మొన్నటి వేసవి ధాటికి నష్టపడిన కొన్ని పూల మొక్కల భర్తీ కొన్ని రహదారుల్లో జరగవలసి ఉన్నది! అందుకు గాను, 350 మొక్కల సేకరణ జరిగింది కూడ. వర్షం ఉధృతి లేని నాడు నేటి వలెనే మరి కొన్ని చోట్ల పరిమిత సంఖ్యలో కార్యకర్తలు వాటిని ఈ అదనులోనే నాటవలసి ఉన్నది!

 

            అందు నిమిత్తం రేపటి ఉదయాన సైతం ఇలాగే పాగోలు పంచాయితీ పరిధిలోని దారిలో కలువవలసి ఉన్నది.

 

 

         సమైక్య రాగాలాపన. 

 


స్వచ్చోద్యమ చల్లపల్లి క్రమ పరిణితి ఎట్టిదనిన...

సామాజిక ఋణశేషం తొలగాలను పూనికతో

జగమంత విశాలంగా పగలంత ప్రకాశంగా

స్వచ్చ సైన్య సద్భావన సాగి పురోగమించడం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం 03/07/2020, 

చల్లపల్లి.