మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-3....           21-Jul-2020

                                                       మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-3

          2070 రోజుల నిరంతర సుదీర్ఘ శ్రమదాన చల్లపల్లిలో ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మలేనివీ, రోజూ చూస్తున్నపటికీ ఆశ్చర్యకరమైనవి కొన్ని దృశ్యాలను నోరు వెళ్లబెట్టి మరీ చూస్తుండే వాడిని.

- వివిధ నేపధ్యాల ఇందరు వ్యక్తులొక శ్రమ శక్తి గా మారి క్రమం తప్పక వేల రోజులుగా గ్రామం మేలు కోసం కష్టించడం - అది కూడ గ్రామమంతా గాఢ నిద్రలో ఉండే వేకువ 4.00 నుండి 6.00 మధ్య జరగడం,

- ఉద్యోగులు, వృద్ధులు, స్త్రీలు రోడ్లు ఊడవడం సరే- ఆ చీకటిలోనే నడుం లోతు మురుగు కాల్వల్లో దిగి చెప్పరాని కల్మషాలను చేతుల్తో ఎత్తివేయడం,

- శ్మశానాలను, పంట కాల్వల్ని, చెరువుల్ని, గట్టుల్ని శుభ్రపరచి, వందలాది చెట్లనూ, పూల మొక్కల్నీ నాటి  సుందరీకరించడం,

- ఇందులో 60 ఏళ్లు దాటిన వాళ్లు, నడుముల- కాళ్ల నొప్పులున్న వారు అక్కడ తడి లోనూ, మట్టి లోనూ చతికిలబడి పై పనులన్నీ చేయడం,

- ఉన్న ఊరునే కాక- పొరుగూళ్లకు కూడ తమ శ్రమను సమర్పించి సంతృప్తి చెందడం......,

- మనకోసం మనం ట్రస్టు నేర్పరచుకొని, దాని ద్వారా చల్లపల్లి కోసం కోట్లాదిగా ధనం వెచ్చించడం,

          చల్లపల్లిలోనే ఉండి, ఇందరు త్యాగ ధనుల నిస్వార్ధ శ్రమ విన్యాసాలకు ప్రత్యక్ష సాక్షిని గనుక ఈ మాత్రం సాధికారికంగా ఇలా చెప్పగలుగుతున్నాను గాని, బైటి వ్యక్తినైతే బహుశా నేను గూడ ఇవన్నీ కట్టు కథలనో- పబ్లిసిటీ స్టంటులనో తేలికగా తీసుకొని ఉండేవాడినే గదా!  ఆ వ్యవస్థ తప్పి- నేను సైతం ఆ   సైన్యంలో ఒకడినై- ఇన్ని లక్షల పని గంటల పాటు ఈ ఊరికోసం పాటుబడినందుకు కొంత సత్ఫలితంతో సంతృప్తులమై పోయి, అప్పుడప్పుడు లోలోపల గర్వించిన మాట కూడ యథార్థమే!

          ఐతే  గత 11 రోజుల్నుండి చల్లపల్లిని కూడ కరోనా కాటు వేసి స్వచ్చ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోవడంతో - దేశంలో కొన్ని చోట్ల సంభవిస్తున్న స్వచోద్యమాల అధ్యయనం చేసినప్పుడు

- ముఖ్యంగా కొందరు వ్యక్తులు ఒంటరిగానే అసాధ్యాలనుకొన్నవి సుసాధ్యాలు చేసిన ఉదంతాలను తెలుసుకొంటున్నప్పుడు

– అసలట్టి గర్వలేశానికర్థమే లేదనీ, ఎక్కటి మహా యోధుల స్వచ్చ కృషి సాహసాలను మనం తప్పక ఆదర్శంగా తీసుకోవాలనీ అనిపిస్తున్నది.      

కేరళ రాష్ట్రానికి చెందిన అలాంటి ఒక స్ఫూర్తిదాయకుడైన స్వచ్చోద్యమకారుని ప్రస్తావన ఇది:

          కొట్టాయం జిల్లాలోని మణి నిక్కర అనే గ్రామస్తుడతను. పేరు ఎస్. రాజప్పన్. వయస్సు 69 ఏళ్లు! ఫోటోలోనే తెలుస్తుంది చూడండి- కాళ్లులేని, కదలలేని నిస్సహాయ వృద్ధుడతను. రెండు కాళ్లు, తన జవ సత్త్వాలు ఏనాడో పోలియోకు బలైపోయిన దయనీయుడతను! మరి ఎందుకతని గురించి ఎవరైనా తెలుసుకోవాలి?

          ఈ రాజప్పన్ గారి గ్రామంలో “ వెంబనాడ్” అనే అందమైన సరస్సు పర్యాటకుల్ని ఆకర్షించేది. వచ్చిన యాత్రికులేమో అక్కడ కూర్చొని, విందులారగించి, ప్లాస్టిక్ సంచుల్ని, నీళ్ల సీసాలను, కూల్ డ్రింక్ ఖాళీ సీసాలను అక్కడే వదలడం, కాలక్రమాన ఆ వ్యర్థాలతో సరస్సు కలుషితమైపోయి, దాని అందాలు తరిగిపోవడం, చూస్తుండగానే చకచకా జరిగిపోయాయి! చిన్నతనంలో తాను ఆడుకొన్న ఆ సరస్సు పరిసరాలు కళావిహీనమైపోవడాన్ని చూసి, రాజప్పన్, అతని బాల్య మిత్రులు ఎంతో కలత చెందారు. కాని మరీ మరీ స్పందించిందీ, నిద్రలేని రాత్రులతో కార్యాచరణకు దిగిందీ మాత్రం రాజప్పన్!

          కర్రల ఊతతో తప్ప కదలలేని ఈ వృద్ధుడు అతి కష్టం మీద వెంబనాడ్ గట్టుకు చేరుకొనేవాడు. ఆ కర్రలతోనే ఆందినంత మేర ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను, నీటిపై తేలుతున్న ఖాళీ నీటి సీసాలను, శీతలపానీయ సీసాలను ఒకటొకటిగా ఒడ్డుకు లాగి, తాను తెచ్చుకొన్న గోతాల్లో నింపి, తన గుడిసె దగ్గరకు చేర్చేవాడు. ఇలా ఒక రోజో- ఒక నెలో కాదు- కదల్లేని యీ వృద్ధునికీ 5 సంవత్సరాలుగా అదే దీక్ష! అదే ధ్యాస !  ఐతే సడలని ఈతని కృషిలో ఒక మలుపు ఎలా వచ్చిందంటే – సంవత్సరాల తరబడీ తాను పోగేసిన వేలకొద్దీ ఖాళీ సీసాలను ఎవరో డబ్బు చెల్లించి కొనుక్కుపోయారు! ఆ వచ్చిన డబ్బుతో ఇతడొక చెడిపోయిన పడవనుకొన్నాడు. దాన్ని బాగు చేయించి, కొత్త ఉత్సాహంతో అందులో కూర్చొని సరస్సు మొత్తం తిరుగుతూ వ్యర్థాలను, సీసాలను పోగుచేస్తూ – చివరకా సుందర “ వెంబనాడ్” సరస్సుకు దాని తొలినాళ్ల స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలను తిరిగి రప్పించగలిగాడు!

          గత నాలుగు నెలల కరోనా ఉపద్రవం వల్ల వెంబనాడ్ కు పర్యాటకుల తాకిడి తగ్గింది.  దాంతో బాటే కాలుష్యం కూడ తగ్గింది. ఇప్పుడు రాజప్పన్ కు చేతినిండా పని కూడ తగ్గిపోయింది. మొదటి నుంచీ అతడు స్వాభిమానం కలవాడే. ఎవరినీ యాచించడు. తన చిన్న ఇంటిని తన సోదరికిచ్చి,  చిన్న గుడిసెలో ఉంటూ, చేయగలిగిన ఏ పనైనా చేస్తూ తన బ్రతుకు తాను బ్రతికే మనిషి. 2018 లో వచ్చిన జల ప్రళయంతో గుడిసె మునిగిపోతే కొన్ని వారాల పాటు పడవలోనే ఉన్నాడు.

          కాళ్లు లేకున్నా కష్టించి తనను తాను పోషించుకొనే అతని స్వాభిమానం, స్వచ్చ- శుభ్ర- సౌందర్య స్పృహ, తన గ్రామ సరస్సు కోసం అతని చొరవ, ప్రస్తుతం ఎక్కువ మందిలో లోపిస్తున్న సామాజిక చైతన్యం ఎవరికి మాత్రం ఆదర్శాలు కావు?   

(ప్రజాశక్తి పత్రిక వార్త ఆధారంగా........)