మన కాలపు స్ఫూర్తి దాతలు – 5....           27-Jul-2020

మన సమకాలంలో ప్రత్యక్షంగా ఒంటరిగానూ, సామూహికంగానూ అన్ని కాలుష్యాల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న అద్భుత సంగ్రామాలు చూస్తుంటే విప్లవ మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటే గుర్తొస్తున్నది.

 

తూరుపు దిక్కున వీచే గాలి పడమటి కడలిని పిలిచే గాలి

తూరుపు పడమర లేకంచేసే తుఫానులా చెలరేగే దాకా..

భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం అనంత జీవన సంగ్రామం...”  

 

- 1974 లో వచ్చిన ఒక సినిమా పాట ఇలా సాగిపోయింది.

 

            అపర ఐన్ స్టీన్ గా గుర్తించబడిన స్టీఫెన్ హాకింగ్అంపశయ్య మీద జీవన మలి సంధ్య అంతా ఒక హెచ్చరిక చేస్తూనే గడిపాడు ఇక ఈ భూమికి మిగిలింది గణిత శాస్త్రజ్ఞులు చెప్పినట్లు - వేల కోట్ల ఏళ్ళు కాదు; ప్లాస్టిక్ తదితర కాలుష్యాలతోనూ, మానవ హృదయాల కాలుష్యంతోనూ అది కేవలం వెయ్యేళ్ళకే కుదించుకుపోయింది...అని!

  

            హాకింగ్ గారి వేదన ఎందరిని తాకిందో గాని, బాధ్యతల బరువు మోయడానికి సదా సిద్ధపడే కొందరు మాత్రం కలిసి వస్తే తోటి వారి సహకారంతోను, లేదంటే ఒంటరి గానూ కాలుష్యం అనకొండలను ఎదిరించి నిర్మూలిస్తూనే ఉన్నారు.

 

            అలాంటి ఒక ఎక్కటి జోదుడాక్టర్ అజయ్ కాట్రగడ్డ! ఒకే ఒక్క వ్యక్తి ఎన్నెన్ని దేశాల్లో సేవలందించగలడో తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడో ప్రజాహితార్ధం ఎన్ని అవతారాలెత్తగలడో ఈ వైద్యుని 58 ఏళ్ల జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు. స్వార్ధం అనే మారధాన్ లలో మనుషులు అలిసిపోతున్నారు గాని, సమాజహిత సమరంలో మాత్రం కందుకూరి వీరేశలింగం , కరంచంద్ గాంధీ వంటి వారికి అలుపే ఉండదుకాబోలు!

 

            గన్నవరం దగ్గరి వెలదిపాడు మూలాలు గల అజయ్ మత్తు - నొప్పుల స్పెషలిస్ట్ వైద్యుడుగా ఆస్ట్రేలియా (25 ఏళ్ళు), కెనడా (2), వంటి చాలా దేశాల్లో పనిచేసి, 50 ఏళ్లకే రిటైరై, తన వృద్ధమాత సేవ కోసం సొంతూరు వచ్చారు. అనంతరం మొత్తం సమాజం యొక్క నొప్పుల నివారణ కోసం విజయవాడ ప్రధాన కేంద్రంగా ఆవారా” (అమరావతి వాకర్స్ & రన్నర్స్ అసోసియేషన్) తో కలిసి సామాజిక మార్పుల కోసం, మెరుగుదల కోసం క్రొత్త రకం మారధాన్లు నిర్వహిస్తున్నారు. అతని అనుభవాలను సూక్ష్మంగా చెప్పినా ఒక సుమారైన గ్రంధం అవుతుంది! ఉదాహరణకు కృష్ణా నదిని ప్లాస్టిక్ కాలుష్య రహితం చేయడానికి 400 టన్నుల వ్యర్ధాలను లాగి, మునిసిపల్ కార్పోరేషన్ కప్పగించి, 25000 మొక్కల్ని నాటిన ఆయన తపనను, జన సమీకరణ కోసం ఆ ఎత్తు గడల్ని, చటుక్కున ఎప్పటికప్పుడు మార్చుకొన్న వ్యూహాల్నీ వింటుంటే ఎంత ఉత్కంఠ కలుగుతుందో!

 

            అసంఖ్యాకమైన, వైవిధ్యభరితమైన విజయవాడ ఆవారా కార్యక్రమం ఎక్కువగా శని, ఆదివారాలలోనే – ముఖ్యంగా కృష్ణానదీ పాయలలోనే, దరులమీదనే ముందుగా నడక, పరుగు ఆ తరువాత అనేక రకాల వ్యర్ధాల తొలగింపులుగానూ మరికొన్ని మార్లు సీతానగరం, తాడేపల్లి దాపులలోనూ జరుగుతూ ఉంటుంది. 5 నుండి 97 సంవత్సరాల వయస్కుల భాగస్వామ్యంతో జరుగుతూ ఉంటాయి కూడా.      

 

            ఆ మారధాన్ లకు కాలుష్య నిర్మూలనా సేవలను జోడించిన వైనం ఎంత ధ్రిల్లింగ్ గా ఉన్నదో! ఇసుక మాఫియాల ఆగడాలను అడ్డుకొన్న నేర్పు విజయవాడ విద్యార్ధి యువతరాన్నెంత ఆకర్షించిందో!

 

-  కృష్ణా నదీ కాలుష్య విముక్తి ప్రయత్నంలో ఒక దశలో అక్కడి 600 మంది బహిరంగ మలవిసర్జననాపడంలో తొలుత ఎదురు తిరిగిన ఇద్దరు నాయకులకే ఆ బాధ్యత అప్పగించి, చాకచక్యంగా గెలుపు సాధించారు.

 


-  చెన్నై బెంగళూరు బెజవాడ తదితర చోట్ల ఇప్పుడు ఈ ఆవారా జనం 4500  మంది పైనే తయారయ్యారు. ఒక ఆదివారమైతే కృష్ణానదీ ముఖ పరిశుభ్రత కోసం ఏకంగా 800 మంది పాల్గొన్నారు!

-  ఖచ్చితంగా తూచలేదు గాని, ఈ ఆరేళ్లలో ఆవారా 400 టన్నుల ప్రమాదకర ప్లాస్టిక్ తదితర వ్యర్దాలను తొలగించింది!

 

-  బెంగళూరు లో MBA చదువుతున్న ఒక తమిళ యువతి ఆవారా చేస్తున్న సమాజ సంస్కరణ మీద వ్రాసిన పరిశోధనా పత్రంతో ఆ సంస్థ కార్యకలాపాలు దేశమంతా మారు మ్రోగిపోయాయి!

 

 

-   ఆవారా లో పాల్గొని, రాటు దేలిన 55 మంది మెరికలు కానిస్టేబుల్స్ గా, ఎస్సైలుగా, ఇతర ఉద్యోగులుగా ఎన్నికయ్యారు!

 

 

-   స్వయంగా డాక్టర్ అజయ్ వివిధ నగరాల్లో మారధాన్ ల విజేత!

 

-   చిన్న వయస్సులో గంజాయి, గుట్కాల్లాంటి వ్యసనపరులైన కొందరిలో ఈ డాక్టర్ గారి వల్ల, ఆవారా సాంగత్యం వల్ల వచ్చిన సమూల మార్పులు పోలీసు అధికారులకు అంతులేని ఆశ్చర్యకారకాలయ్యాయి!

 

 

-   విజయవాడ దేవాలయాలు కొన్నిటిని ఈ ఆవారా కాలుష్య విముక్తం చేసింది.

 

 

-  వాకింగ్ తో క్లీనింగ్ ను జత కలిపిన అవారా వాక్లీన్అనే కొత్త పదం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుట్టుకొచ్చింది!

 

-  పర్యావరణ భద్రత మీద ఈ వైద్యుడు సమర్పించిన విలువైన విశ్లేషణలను భారత ప్రభుత్వం పరిగణలోనికి తీసుకొన్నది! (ఆచరణ సంగతి మాత్రం నన్నడగవద్దు!)

 

 

           ఇలా 2012 జులై లో మొదలైన డాక్టర్ అజయ్ అడుగులు ఏ అలసట లేకుండ సాగిపోతూనే ఉన్నాయి. ఈ సమాజం, ఈ పర్యావరణం ఈ మాత్రమైనా భద్రంగా ఉండాలంటే ఆ నడక ఆ పరుగు ఆగకూడదు మరి!

 

            ఐతే ఈ స్ఫూర్తి ప్రదాతకు ఒక దిగులు, అనుమాన మేమంటే స్వచ్చ సైనికులు చల్లపల్లిని అభిమానించి, అమాంతం సొంతం చేసుకొన్నంతగా తాను గాని, ఆవారా గాని విజయవాడ ను అక్కున చేర్చుకోలేదేమోనని!

 

- నల్లూరి రామారావు

   27.07.2020.