మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 ....           08-Aug-2020

 మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 

            చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ కొందరు వ్యక్తుల కాలుష్య నియంత్రణా కృషి, వాళ్ళ ఒంటరి పోరాట స్ఫూర్తి తళుక్కున మెరవడం గమనించవచ్చు. ఈ దేశంలోని పర్యావరణ ప్రమాదాలను శాశ్వతంగా తొలగించుకోవాలన్నా విశాల ప్రజారోగ్య సాధనా సంకల్పం నెరవేరాలన్నా – అలాంటి సత్కార్యాచరణకు సంసిద్ధులం కావాలనుకొన్నా – మన సమకాలిక సంఘటనల్ని, స్ఫూర్తి ప్రదాతల్ని నిరంతరంగా గుర్తుకు తెచ్చుకోకతప్పదు! అశోకుడిలా చెట్లు నాటించిన గొప్పవారే కాదు – పర్యావరణ సమతుల్యత కోసం అరణ్యాలను కాపాడమేం ఖర్మ – ఒంటి చేతితో ఏకంగా ఒక అరణ్యాన్నే సృష్టించిన ఒక ఆదర్శమూర్తి మన దగ్గర్లోనే – మన కాలంలోనే ఉన్నాడు!

            అది ప్రకృతి అందాలకు – హరిత శ్యామల వర్ణాలకు నెలవైన కేరళ రాష్ట్రం! కోజికోడ్ జిల్లాలోని కొడుపల్లి గ్రామస్తుడు మొహమ్మద్! చిన్నతనం నుండీ మహాకవుల సాహిత్య స్వారస్యాలను చెట్ల నీడలోనే కూర్చొని ఆకళించుకొనేతత్త్వం అతనిది. బ్రతుకు తెరువు కోసం సౌదీ అరేబియా కు పోయి, సంపాదనాపరుడయ్యాక – తన భూలోక స్వర్గం వంటి కేరళకు తొందరగానే తిరిగి వచ్చాడు. ఆ తరువాతనే తన గ్రామ చరిత్రనతడు మలుపుత్రిప్పాడు. కుటుంబ పోషణ కోసం ఒక నగల దుకాణాన్ని పెట్టుకొన్నా – బాల్య స్వప్నమైన ప్రకృతి అందాల వెంటనే అతని పరుగు!

            వారసత్వంగా వచ్చిన అరెకరానికి తోడు 2 ½ ఎకరాల భూమిని కొని, మొత్తం మూడెకరాలలో వైవిధ్య భరితమైన సహజ అరణ్యాన్ని అతడు అనతి కాలంలోనే నిర్మించాడు! టేకు, అశ్వ గంధ, వేప, మహాగని, గుల్మోహర్, చెస్ట్ నాట్, వంటి 250 కి పైగా అరుదైన వృక్షాలు ఆ అడవిలో కొలువు తీరాయి. ఐతే – అవేమీ మాట వరుసకో, మ్రొక్కు బడిగానో నాటి – పెంచిన మామూలు చెట్లు కానే కావు! ప్రతి ఆకులో – వేరులో – కొమ్మలో - రెమ్మల్లో మొహమ్మద్ గారి భావుకత, సౌందర్య పిపాస, ఆత్మీయతలు ఉట్టిపడుతూ – ప్రతి చెట్టూ అతడు వ్రాసి అంటించిన కవితాత్మక వ్యాఖ్యానాలతో సందర్శకులతో సరసల్లాపాలు కావిస్తూ ఉంటుంది.

            అసలా అరణ్యానికున్న నాలుగు ప్రవేశ మార్గాల పేర్లేమిటని? షేక్స్పియర్ ద్వారం, షెర్లాక్ హోమ్స్ ద్వారం, పధేర్ పాంచాలి గేటు మరొకటి మాత్రం అతని భార్య పేరిట – లైలా ద్వారం! మొహమ్మద్ గారి ఉద్దేశం స్పష్టమే – రసమయమైన ప్రకృతి రామణీయకతనీ, అద్భుత సాహితీ భావనా ప్రపంచాన్నీ సమ్మిళితం చేయాలనే! ఎలక్ట్రీషియన్ గా సౌదీలో కష్టించి సంపాదించిన డబ్బును – ఏ మాత్రం తెలివైన మనిషైనా ఏం చేయాలి? స్తలాలు కొని, ఇళ్ళు కట్టి, వ్యాపారాల్లో మదుపు చేసి, కోటాను కోట్లుగా మార్చాలి. మరి – ఇతనిది అతి తెలివి కాబోలు! లేదా – తెలివిని మించిన అంతరాంతరాళాల సంతృప్తి కాబోలు!

            ఇంతకీ ఇతడు సాధించినదేమై ఉంటుంది?

- ఇప్పటి కరోనా దెబ్బకు తగ్గిపోయారు గాని రోజుకు 150 మందికి పైగా పర్యాటకులు ఆ అడవిని పరిశీలించి ఉత్తేజితులవుతుండేవారు.

- అంతకు ముందు కొడుపల్లి, ఆరంబ్రా వంటి నీటి ఎద్దడి ఊళ్ళకు ఇప్పుడు సమృద్ధిగా వానలు, నీటి లభ్యత!

- విశ్వ విద్యాలయ పరిశోధక విద్యార్ధులకు చేతి నిండా పని!

- పర్యాటకులకు.... అడవి విశేషాలు విప్పి చెప్పే సమయంలో అతడు పొందే ఆనందం ముందు అసంఖ్యాకంగా అతన్ని వెతుక్కుంటూ వచ్చిన పురస్కారాలు గొప్పవి కాకపోవచ్చు!

- ఈ చిన్న అడవి ఆ కొద్ది పాటి ప్రాంతంలో తొలగించిన కాలుష్య ప్రమాదం సంగతి?

- అసలే నారి కేళ వనాల – పచ్చదనాల పండుగలు చేసుకొనే ఆ కోజీ కోడ్ జిల్లా – కొడుపల్లి పరిసరాలకు మరిన్ని సహజ సౌందర్యాలను జతచేస్తున్న తన అడవిలో నిత్యం వేలాది పక్షుల కిలకిలా రావాల గానాల పరవశం పొందుతూ మొహమ్మద్ మన శ్రీ శ్రీ గారు పునర్జన్మ సినిమా కోసం వ్రాసి (1963) – ఘంటశాల గానం చేసిన పాటను -  

            “ఓ సజీవ వృక్ష సుందరీ! మా జీవన రాగ మంజరీ!

            ఎవరివో! నీ వెవరివో!

            నా భావనలో – నా సాధనలో నాట్యము చేసే రాణివో!

            కవితావేశము కలలై – అలలై – కురిసిన పూవుల వానవో...

            కలువల కన్నుల కాంతివో!...

అని బహుశా పదే పదే మననం చేసుకొంటూ ఉన్నాడేమో!  

(ప్రజాశక్తి సౌజన్యంతో)

నల్లూరి రామారావు

చల్లపల్లి

08.08.2020.