2071* వ రోజు.......           08-Nov-2020

 2071వ నాటి సేవా సౌభాగ్యం

ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, కొబ్బరి బొండాల విక్రయ కేంద్రం, జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం,స్టేట్ బ్యాంక్ ప్రాంగణం వంటి వన్నీ మరొక్కమారు కొత్త కళ సంతరించుకొన్నవి. నెలల తరబడి వానలతో – మంచుతో – దుమ్ము పేరుకున్న రహదారి ప్రక్కన, రిజిస్ట్రార్ కార్యాలయ ముఖద్వారాన గల రంగు రాళ్ళ దుమ్ము తొలగి, మురికి వదలి, రకరకాల వ్యర్ధాలు మాయమై, చల్లపల్లి ప్రత్యేకతను చాటుతున్నాయి. 

            కరోనా ప్రళయంతో తమ గ్రామ బాధ్యతలకు ఎడబాటును సహించలేని నిస్వార్ధ కార్యకర్తలు ఈ ఉదయం మాస్కులు, సామాజిక దూరాలు పాటిస్తూ స్వయం విధిత క్రమశిక్షణతో అత్యంత మెలకువతో నిర్వహించిన గ్రామబాధ్యతలలో పంచాయితీ ఆరోగ్యపర్యవేక్షణాధికారి శ్రీ సుధాకర్ గారితో సహా మహిళలు,వృద్ధులు, రైతులు, ఉద్యోగులు - స్వీకరించగలిగిన వారికి సామాజిక స్పృహను, స్ఫూర్తిని పంచారు. 

            2070 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా నడిచిన స్వచ్చ కార్యకర్తల గ్రామ బాధ్యతా నిర్వహణకిది పునః ప్రారంభం! ఐతే ట్రస్టు ఉద్యోగుల గ్రామ విధులన్నీ ఈ మధ్య కాలంలో ఆగనేలేదు. తాత్కాలిక విరామం తరువాత కార్యకర్తల వీధి శుభ్రతా చర్యల తృప్తి వారి ముఖాలలో స్పష్టమౌతూనే ఉన్నది! అవాంతరాలు ఎన్ని వస్తున్నా తమ చిరకాల స్వప్నమైన స్వచ్చ – సుందర – చల్లపల్లి సాధనలో వారి పట్టుదల చెక్కు చెదరలేదు!

             6.00 గంటల సమయంలో కాఫీ – తేనీటి సేవనా ఘట్టంలో డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారి అభినందన పూర్వక సమీక్ష యధావిధిగా జరిగింది. 

            స్వచ్చోద్యమానికి డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి 2000/- విరాళం గతంలో వలెనే నేడు కూడ అందినది. 

            మరల మన గ్రామ కర్తవ్య నిర్వహణ కోసం 12.11.2020 – గురువారం ఉదయం 4.00 కు మునసబు గారి వీధి దగ్గర కలుసుకొందాం.

            ఇవి పునర్నవ స్వచ్చ సేవలు. 

వీధి శుభ్రతకై తపస్సులు ఇవి పునర్నవ స్వచ్చ సేవలు

కశ్మలంపై పోరు కిందరు – గ్రామ స్వస్తత చెరుపనెందరొ!

శతాధిక దిన విరామంతో స్వచ్చ సైన్యం కదం త్రొక్కుట

స్వచ్చ సుందర చల్లపల్లి ప్రశస్త చరితకు మేలి ముచ్చట!  

- నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 08/11/2020

చల్లపల్లి.