2072* వ రోజు..........           12-Nov-2020

 చల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం

 

ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ఆస్పత్రి నుండి భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక.

            మొండి అన్నదెందుకంటే – గంటన్నర సమయం పైగా ఈ కార్యకర్తలు అటు ప్రధాన వీధి కాలుష్యాలతోనే గాక, వర్షంతో కూడ యుద్ధం చేయవలసి వచ్చింది. ఒక వంక చలి, ఈదురు గాలులు, ఎడతెగని వర్షం! మరో వంక చీకటి! వాన నీటి వల్ల రోడ్డు కంటుకొన్న ఆకులు, దుమ్ము, కాగితాల ముక్కలు చీపురుతో ఊడిరాకున్నా వ్యర్ధాల పోగు చేతకు శ్రమిస్తున్న కార్యకర్తలు మరొక వంక! అకుంఠిత దీక్ష అంటే ఇదే కదా! మచ్చ లేని సామాజిక బాధ్యతా నిర్వహణంటే ఇది కాదా? స్వచ్చోద్యమ చల్లపల్లి ఈ సమస్త సువిశాల దేశానికి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధనా మార్గాన్ని చూపిస్తున్నది ఇలాగే కదా?   

            ఈ పాతిక – ముప్పై మంది కార్యకర్తల కృషితో రహదారి వనంలోని కలుపు, వ్యర్ధాలు తొలగిపోయి, తెల్లవారిన తరువాత ఈ ప్రాంతం ఎంత నిర్మలంగా ఉన్నదో గమనించండి.. ఆ సుందరీకృత వనం చూస్తున్న కార్యకర్తల సంతృప్తి ఏ స్ధాయిలో ఉన్నదో ఊహించండి!

            ఒక లెక్క ప్రకారం స్వచ్చోద్యమ చల్లపల్లి కీ రోజు 7 వ సంవత్సర ప్రారంభం! సరిగ్గా పనివేళకే గనుక ఇంత భారీ వర్షం రాకుంటే మరింతగా ఎక్కువమంది పాల్గొనేవారు. గ్రామ బాధ్యతలో 7 వ ఏడాది గుర్తుగా స్వచ్చోద్యమ నినాదాల నడుమ కార్యకర్తలు కేకు వేడుక జరుపుకొన్నారు.

            ఈ ఉద్యమ సంచాలకుడైన డాక్టర్. డి.ఆర్.కె. ప్రసాదు ఉత్సాహ ఉద్వేగాలతో గత ఆరేళ్ళ గ్రామ బాధ్యతా నిర్వహణను సింహావలోకనం చేసి, ఇక ముందు గ్రామానికవసర చర్యలను ప్రస్తావించారు.

            ఆరేళ్ళ సేవల జ్ఞాపికగా తాతినేని రమణ బాగా పెరిగిన కదంబ వృక్షాన్ని బహూకరించారు.    

            తరువాతి స్వచ్చంద సేవల కోసం 15.11.2020 ఆదివారం వేకువన ఈ బందరు రహదారిలోని భగత్ సింగ్ గారి ఆసుపత్రి వద్ద కలుసుకొందాం.

            షష్టవర్ష సమాజ బాధ్యత.

ఎచట చూడని – వినని సేవలు ఇరువదొకటవ శతాబ్దానికి!

షష్టవర్ష సమాజ బాధ్యత చల్లపల్లను పట్టణానికి!

ఎవరి స్వేదం – ఎవరి త్యాగం ఈ మహత్తర ప్రయాణంలో?

స్వచ్చ – సుందర కార్యకర్తల సఫల సంచిత ప్రయత్నంలో?

- నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 12/11/2020

చల్లపల్లి.