2075* వ రోజు....           22-Nov-2020

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు

            ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27  సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారిలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గర వాహనాలను నిలుపుకొని, వివిధ పనిముట్లతో సన్నద్ధులై తూర్పు రామమందిరం నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి దాక టీ దుకాణాల వద్ద, టిఫిన్ సెంటర్ల దగ్గర చేరిన గ్రామస్తుల సాక్షిగా సాగిన వీధి శుభ్రతా చర్య ప్రధానమైనది. ఎక్కువమంది కార్యకర్తల శ్రమార్పణం ఇక్కడే జరిగింది!

            తమవి కాని మేదర కార్మికశాలల ఎదుట, మాంసపు అంగళ్ళ వద్ద, కూరల దుకాణాల దగ్గర, కాఫీ – టీ – ఉపాహార శాలల ముందర ఈ స్వచ్చ కార్యకర్తలు కాక – ఈ బ్రహ్మ ముహూర్తంలో గంటన్నర పాటు మరెక్కడైనా, ఎవరైనా ఇంతగా శ్రమిస్తున్నారేమో తెలియదు. కంపు గొట్టే మురుగు మట్టిని, దుమ్మును, ఇతరేతర సమస్త వ్యర్ధాలను – ఎక్కువ మంది గ్రామస్తులు నిద్రిస్తున్న సమయంలో – తమ చేతులతో ఇంకెవరు ఊడ్చి, కెలికి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి ఎవరు చేర్చగలరు? గోకుడు పారలతో దారి మీది మట్టిని గోకుతున్న డాక్టర్లను, ఉన్నతోద్యోగినులను, వృద్ధులను, చీపుళ్ళతో గూళ్ళు నెప్పి పుట్టుతున్నా వదలక ఊడ్చి, ప్రధానవీధి స్వచ్చ శుభ్ర సౌందర్యాలు నింపుతున్న గృహిణులను బహుశా ఈ చల్లపల్లి లో మాత్రమే చూడగలరు!

            ఈ 36 మంది స్వచ్చ కార్యకర్తలు ఊడ్చి, గుట్టలు చేసిన మట్టిని, డ్రైన్ల మురుగు మట్టిని కొందరు ఔత్సాహికులు ట్రక్కులో నింపి, భారతలక్షి వడ్ల మర వీధికి చేర్చారు. అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్ వారు దారి ప్రక్క పల్లాలను సరిజేసి, గుంటలు పూడ్చి, వాహనదారుల భద్రతకు పూచీ ఇచ్చారు.

            స్వచ్చోద్యమ చల్లపల్లి కి పునఃపునరంకితమైపోతున్న దాసరి వారి కుటుంబానికి చెందిన – సుదూరంగా ఎక్కడో దుబాయ్ లో ఉద్యోగిస్తున్న దాసరి స్నేహ – సకుటుంబంగా కాక ఒంటరిగా శ్రమదానంలో పాల్గొనడం నేటి ప్రత్యేకత.  

            6.10 కి కాఫీ ఆస్వాదన వేళ, డి.ఆర్.కె. ప్రసాదు గారి అభినందన పూర్వక దినచర్యా సమీక్షతో నేటి కార్యక్రమం ముగిసింది. 

            మన తదుపరి గ్రామ పౌర సామాజిక బాధ్యతల కోసం బుధవారం – (25.11.2020) వేకువ 4.30 కి బందరు జాతీయ మార్గం లోనే ... కమ్యూనిస్ట్ వీధి మొదటిలోనే కలుసుకొందాం.

 

            కార్యకర్తకు హృదయభారం!  

మాయ – మర్మపు మాటకాదది – మనం మనకోసం శ్రమించిన

చెమట చిందిన – ఉద్యమించిన – స్వచ్చ సంస్కృతి ప్రోదిచేసిన

గ్రామ స్వస్తత సమార్జించిన – కరోనాతో నిలిచిపోయిన

ఉదయ సమయపు సేవలాగుట ఎంత నష్టం! ఎంత కష్టం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

22.11.2020.