1888* వ రోజు....           12-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1888* వ నాటి ఉత్సాహాలు

 

          ఆఫీసుల హడావుడి తక్కువగా ఉండే ఈ ఆదివారం వేకువ 4.05 - 6.20  సమయాల మధ్య నిన్నటి తరువాయిగా గంగులవారిపాలెం బాటలో కొలిమి మేస్త్రి గారి ఇంటి దగ్గర నుండి బండ్రేవుకోడు దాకా జరిగిన స్వచ్చ శుభ్ర సుందరీకరణ కృషి జరిపిన వారు 49 మంది.

 

          వీళ్ళ గ్రామ బాధ్యతా నిర్వహణ తరువాత – దారి కిరువైపుల బారులు తీరిన పచ్చని చెట్లు మరింత అందంగా కనిపిస్తున్నవి; వాటి పాదుల్లో గడ్డి, పిచ్చి మొక్కలు, తీగలు తొలగిపోయి బాట కూడ విశాలంగా, పొందికగా అనిపిస్తున్నది; డ్రైనులోని తాడి మట్టలు, ఎండు కొమ్మలు, గడ్డి, ముళ్ళ – పిచ్చి మొక్కలు, తీగలు పూర్తిగా తొలగి, పొలం వైపు లోపలిగట్టు కూడ స్పష్టంగా – శుభ్ర సుందరంగా – చూడాలనిపించేట్లుగా ఉన్నది.

 

          15 మంది చీపుళ్ళ వాళ్ళ ఊడ్పుతో ఈ దారి వాహనచోదకులకు, పాదచారులకు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకొన్నదంటే – ఇది ఈ వీధిలోని 12 మంది నివాసుల ఔత్సాహిక భాగస్వామ్య ఫలితమే! నడక సంఘం మిత్రుల, లయన్స్ క్లబ్ వాళ్ళ ఈ నాటి సహకారమే! చల్లపల్లి గ్రామంలోని అన్ని వీధుల వారూ ఇలా స్పందిస్తే – వారి వారి ప్రాంతాలలో స్వచ్చ – సుందర – శుభ్రతలకు బాధ్యతవహిస్తే – స్వచ్చ సైన్యంతో కలిసి వస్తే – ముందు ముందు ఈ గ్రామం ఇంకెంత మనోహరంగా, ఆదర్శంగా మారుతుందో వర్ణించగలమా?

 

          సుందరీకరణ బృందం వాళ్ళు ఈ ప్రధాన స్వచ్చ సందడికి దూరంగా – శాయినగర్ ప్రవేశక మార్గం దగ్గర నిన్నటి తమ సౌందర్యారాధనను కొనసాగించి, ఆ బొమ్మలకు, నినాదాలకు మరింత సార్ధకతను, సంపూర్ణతను కల్పించారు. ఈ రెండు గంటల పాటు వీళ్ళ దొక ఆనంద ప్రపంచం! సుందరీకృత స్వగ్రామ విలోకనా తన్మయత్నం!

 

          ఇంతమంది నిస్వార్ధ శ్రమదాతల సుదీర్ఘ నిరంతర మహాకృషిని కీర్తి –  గుర్తింపుల ప్రయత్నంగానో, హేమంత నిశీధులతో నిద్ర పట్టని దురదృష్టవంతుల ఉన్మాదకార్యకలాపంగానో భావించే – పేర్కొనే మహానుభావులింకా ఉంటే – జాలి చూప దాగిన వాళ్ళనుకోవాల్సిందే! “కాలోల్హయం నిరవధిః విపులాచ పృధ్వీ...అన్న ఒక సంస్కృత మహాకవిలాగే స్వచ్చ కార్యకర్తలు తమ మేలి – మేటి దారిలో ముందుకు సాగవలసిందే!

 

          స్టేట్ బ్యాంక్ శాఖాధిపతి, నడక సంఘ మిత్రుడూ – అరజా రాజేంద్ర ప్రసాద్ ముమ్మారు విస్పష్టంగా ఎలుగెత్తి చాటిన చల్లపల్లి స్వచ్చ – సుందర – సంకల్ప నినాదాలు మారు మ్రోగి, 6.55 నిముషాలకు నేటి మన గ్రామ సమాజ బాధ్యతలకు స్వస్తి!

 

          రేపటి మన ఔత్సాహిక స్వచ్చంద కృషిని బందరు మార్గంలోని సంత వీధి దగ్గర కలుసుకొని ప్రారంభించాలి.

         

              ఏవం విధసేవా విధి

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమ సంస్కృతి ఎట్టదనిన...

సామాజిక ఋణం తీర్చు తాత్వికతే పునాదిగా

రెండొందల మంది జనుల రెండు లక్షల పని గంటలు

ఉన్న ఊరు శ్రేయస్సుకు ఉద్యమించి సాగడం!

  

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 12/01/2020

చల్లపల్లి.