1889 * వ రోజు....           13-Jan-2020

 

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1889* వ నాటి సంస్కరణలు . 

  దట్టమైన మంచు క్రమ్మిన నేటి చలి వేకువలో 4.06-6.15 నిముషాల నడుమ కాలంలో స్వగ్రామ స్వచ్చ- సుందరీకరణలో పాల్గొన్న ధృఢ మనస్కులు(30+2+3) 35 మంది. వీరిలో ముగ్గురు ట్రస్టు, పంచాయతీ కార్మికులు కాగా అమెరికా ప్రవాస వైద్యులిద్దరు. కార్యక్షేత్రం బందరు మార్గం లోని షాబుల్ వీధి మొదలు అవనిగడ్డ దారిలోని పెట్రోలు బంకు, విజయవాడ బాటలో కొంత మేర.

సంత బజారు మీదుగా-కూరగాయల కొట్ల, టిఫిన్ –టీ దుకాణాల, పిండి మర కార్ఖానాల, సంపటాలమ్మ, వేంకటేశ్వరాలయాల, ATM కేంద్రాల అన్ని రకాల వ్యర్ధాలను ఊడుస్తూ, ఏరుతూ ఆ గుట్టలన్నిటిని డిప్పలతో ట్రాక్టర్ లోనికి నింపి చెత్త కేంద్రానికి తరలిస్తూ, ఉభయ పెట్రోలు బంకుల-బ్యాంకుల ముందు శుభ్ర పరుస్తూ గంటన్నర కు పైగా(50 పని గంటల పాటు) కనిపించిన ఈ నిస్వార్ధ శ్రమ జీవన సౌందర్య దృశ్యం నన్నే కాదు, భావుకుల నెవరినైనా కదిలింప గల ప్రభావశీలమైనదే!

ముఖ్యంగా ఏ.టి.యం. కేంద్రాల వద్ద, మూడు రోడ్ల ప్రధాన గ్రామ కూడలిలో పొగ మంచులోను, వాహనాల రద్దీ నడుమ జరిగిన, నేటి శ్రమ దాన విన్యాసం శ్రీ శ్రీ వంటి కవి గనుక చూసి ఉంటే ఎలా స్పందించేవాడోమరి!

కాఫీ-టీ సేవానంతర సమీక్షా సమావేశంలో :

- నిశ్శబ్ద- నిరాడంబర కార్యకర్త ఆత్మ పర బ్రహ్మం ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుంద్ర సంకల్ప నినాదాలు,

 

- అమెరికా ప్రవాస వైద్యుడు కృష్ణ ప్రసాద్ గారు స్పందిస్తూ “ ఇంత విశిష్ట-సుదీర్ఘ-శ్రమ పూరిత-ప్రయోజనకర ఉద్యమాన్ని తన సహాధ్యాయుడు DRK ప్రసాద్ ఎలా నిర్వహించగలుగుతున్నాడో...” అని ఆశ్చర్యానందాలు ప్రకటించగా, అమెరికాలో చాలాకాలం వైద్య నిర్వహణ పిదప స్వదేశానికి- విజయవాడకు తిరిగి వచ్చి, స్థిర పడిన సూర్య ప్రకాశ్ గారు కూడ స్వచ్చోద్యమాన్ని, కార్యకర్తలను అభినందించారు. వీరిలో మొదటి వారు గుంటూరుకు చెందినా, తన తండ్రి ఉద్యోగ రీత్యా ప్రాధమిక విద్యను చల్లపల్లి లోనే నేర్వడం విశేషం!

 

రేపటి భోగి పండుగ స్వచ్చ వేడుకల కోసం 4.00 కే కార్యకర్తలందరు సంప్రదాయ ఆహార్యంతో ATM కేంద్రం వద్ద కలుద్దాం!

 

          వాళ్లు మినహా...

వాళ్లు లేనిదె చల్లపల్లి కి హరిత స్వచ్చత లందవందురు

అసలు బ్రహ్మ ముహూర్తమందలి స్వచ్చ గీతిక లుండవందురు

వాళ్లు మినహా గ్రామ స్వస్తత వట్టి మాటని కొందరందురు

ఎవరు-ఎవరా ధన్యజీవులు? స్వచ్చ సుందర సైనికులెగద!

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

                                        సోమవారం – 13/01/2020                                         చల్లపల్లి.