1890 * వ రోజు....           14-Jan-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1890* వ నాటి స్వచ్చ భోగి నిర్వహణ.

 

  తెలుగు వారి సాంప్రదాయ పెను పండుగ ఐన ఈ భోగి వేకువ 4.00-7.20 ల నడుమ కాలంలో బందరు మార్గంలోని ATM కేంద్రం వద్ద జరిగిన స్వచ్చ- సుందర భోగి వేడుకలలో 50 మంది స్వచ్చ సైనికులు కాక – శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వంద మంది కి పైగా పాల్గొన్నారు.

 

ఈ ఉత్సవాలకు భూమి పూజ అన్నట్లుగా తొలుత కొందరు అక్కడ ఊడ్చి శుభ్రం చేశారు. ఈ 150 మంది 2 గంటలకు పైగా గడిపిన ఆ ప్రాంతంలో వేడుకలు ముగిసిన తరువాత కూడ కార్యకర్తలు మరొక సారి శుభ్ర పరచడం ఈ గ్రామ స్వచ్చ సాంప్రదాయానికి నిదర్శనం. 1890 రోజులుగా తమ బుద్ధిని, శ్రమను తమ మాతృ గ్రామానికి సమర్పిస్తున్న స్వచ్చ సైనికుల కిదొక ఆట విడుపు!

 

తరతరాల సంక్రాంతి సాంప్రదాయాలను పాటిస్తూ – భోగి మంట, క్షీర పొంగలి, కోలాట భజనలూ, చిన్నారులకు భోగి పళ్లు, (చట్ట పరిధిలో మాత్రమే)- కోడిపుంజుల పౌరుషాలు, చెరుకు గడల ప్రదర్శన, కార్యకర్తల కొందరి పంచె కట్టు, భోగి మంటల దగ్గర వలయ నృత్యం- ఇలా ఒకటేమిటి- గంటన్నర పాటు అదొక ఉత్సాహ విహంగం- ఉద్వేగ తరంగం! అంకం భొట్లు గారి అటు సాంప్రదాయక-ఇటు స్వచ్చోద్యమ ప్రేరక భజన విన్యాసాలు, అన్ని రకాల – రాగాల గీతాలను కోలాటం లోకి ఇమడ్చడం, నందేటి శ్రీనివాసుని పాటలు-పద్యాలాపనలతో కార్యకర్తల ఉత్సాహం, స్వచ్చోద్యమ సన్మానంతో గురువు గారి ఉద్వేగం తారా స్థాయికి చేరిన సన్నివేశం! అడుగడుగునా అప్రయత్నంగా అందరి నోళ్ల నుండి స్వచ్చ- శుభ్ర సుందర గ్రామ సంకల్ప నినాదాలు - ప్రతి నినాదాలతో స్వచ్చ సంప్రదాయం, పండుగ ఉత్సాహం మిళితమై పోయిన అపురూప దృశ్యం!

 

ఈనాటి మన సమాజంలో తరచుగా కనిపించే మత వైషమ్యాలకు భిన్నంగా అన్ని మతస్తుల వారు కూడా ఈ వేడుకలలో పాల్గొని హర్షించి అభినందించడం మెచ్చుకోదగిన పరిణామం.

 

కార్యకర్తలకే గాక, అక్కడ చేరిన గ్రామస్తులకు, ప్రయాణికులకు గూడ కేవలం ఈ వేడుకల తీపి గుర్తులే కాక , నిజంగానే అరిసెలు, పాయసం, చక్కిడాలు పంచి తీపి రుచి చూపడం కూడ విశేషం! నగరాల్లో బ్రతికే ఈ గ్రామ యువకులు, వారి పిల్లలకు ఈ మకర సంక్రమణ వేడుకలు, స్వచ్చోద్యమ పోకడలు మనం ప్రత్యక్షంగా చూపగలిగితే ఎంత బాగుంటుందో! ఈ భోగి రోజు తన 43 వ జన్మదినం కార్యకర్తల మధ్య జరుపుకుంటున్న గోళ్ళ విజయకృష్ణ మనకోసం మనం ట్రస్టుకు 500/- విరాళం సమర్పించడం అభినందనీయం.

 

నేటి కార్యక్రమానికి పతాక స్థాయిలో 7.15 కు డాక్టర్ పద్మావతి గారు ముమ్మారు ఉచ్చ స్థాయిలో ప్రకటించిన గ్రామ స్వచ్చ సుందర నినాదాలు మారు మ్రోగి నేటి మన బాధ్యతలకు తెర పడింది!

 

రేపటి స్వచ్చ సుందర కర్తవ్య నిర్వహణ కోసం ఉదయం 4.00 కు 1 వ వార్డులోని బాలికల వసతి గృహ సమీపంలో కలిసి, శ్మశానం దారి పొడవునా పూల మొక్కలు నాటవలసి ఉంది.

 

              ఈ సుందర చల్లపల్లి

ఇది స్వచ్చోద్యమ సఫలత-ఇది సామాజిక బాధ్యత

ఇదె ధన్యత-ఇదె మాన్యత- ఇది ఊరుమ్మడి సౌఖ్యత

నాకోసం నేను నుండి మనకోసం మన పరిణతి

ఇది వ్యక్తిత్వ వికాసోన్నతి - ఇది గ్రామాభ్యుదయం విస్తృతి!   

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 14/01/2020

చల్లపల్లి.