1891 * వ రోజు....           15-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

                                                                                                                                                                                                                                                                  స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1891* వ నాటి సంతృప్తులు.

 

మకర సంక్రమణ పర్వదినమైన ఈ నాటి వేకువ 4.03-6.15 నిముషాల నడుమ – 1 వ వార్డు సబంధిత బాలికల వసతి గృహం వద్ద ఆగి, రెండు దారుల్లోను జరిగిన గ్రామ శ్రేయోదాయక కృషిలో పాల్గొన్న స్వచ్చోద్యమ కారులు 35 మంది.( ముగ్గురు ట్రస్టు కార్మికులు, ఒక అతిథి తో సహా)

 

వారం- పది రోజులు ఇదే చోట చేసిన శుభ్ర-సుందరీకరణ తర్వాత కూడ మళ్లీ ఇదే చోట చేసేందుకు ఏముంటుందనిపించవచ్చు. తమ నిస్వార్ధ గ్రామ ప్రయోజనకర చర్యల్లో గూడ సంపూర్ణత (పర్ఫెక్షన్) కోసం తపించే స్వచ్చ కార్యకర్తలకు అలా అనిపించదు. వీరిలో-

 

- కొందరు బాలికల వసతి గృహం వెనుక 1 వ వార్డులో ఒక మార్గం రెండు ప్రక్కల ఎండు-పచ్చి – రకరకాల మొక్కల్ని, తీగల్ని, గడ్డిని ప్లాస్టిక్ తుక్కును, టిఫిన్ కాగిత పొట్లాలను, ప్లాస్టిక్ గ్లాసుల్ని, నరికి, ఏరి, పోగులు చేసి, డ్రైన్ల లోని అడ్డాలను తీసి, ఈ అన్ని వ్యర్ధాలను డిప్పలతో ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

- ఐదారుగురు మహిళలు చీపుళ్లతో, గొర్రులతో తదేకంగా ఊడ్చి, శుభ్రపరచిన ఈ మూడు చిన్న దారులు, జమ్మి లంకమ్మ ఆలయ పరిసరాలు 6.30 కు చూసినపుడెంత శుభ్ర-సుందరంగా కనిపిస్తున్నాయో చూసి ఆనందించేవాళ్లుంటే ఉండవచ్చుగాని, గ్రామంలోని ఇతర ప్రాంతాల మహిళలు ఎంత దీక్షగా గంటన్నర శ్రమిస్తే ఈ స్వచ్చత వచ్చిందో ఆలోచించరు!

 

1 వ వార్డు నుండి చాలాకాలం తరువాత పాల్గొని శ్రమించిన కొడాలి మురళి ఒక్కడే. బహుశా స్థానిక కార్యకర్త!

 

- ఈనాటి ప్రధాన కృషి ఏదంటే – గునపాలుపయోగించిన కార్యకర్తలిరవై మంది హాస్టల్ దగ్గర నుండి –ఇటు శ్మశానం దారిలో, అటు సాగర్ హాలు మార్గంలో విజయ్ నగర్ దాక మొత్తం 70 గద్దగోరు నామాంతరం గల అడవి తంగేడు పూల మొక్కలు నాటడమే. పాదులు త్రవ్వి , బకెట్లతో నీళ్లు మోసి, పాదుల్లో పోసి, మొక్కలు నాటుతున్న ఈ శ్రామికులకు 6.20 సమయం దాటిందన్న స్పృహ లేదు!

 

కాఫీ – టీ ల సరదా సమయం ముగిసే 6.25 నిముషాలకు జరిగిన సమీక్షా సమావేశంలో పురిటిగడ్డకు చెందిన రామకోటేశ్వర రావు – విశ్రాంత గ్రామ కార్యనిర్వహణాధికారి స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలను అభినందించారు. మరొక ముఖ్య విశేషం- స్వచ్చ కార్యకర్త మల్లంపాటి ప్రేమానందం గారు వినూత్న ఆలోచనతో – విత్తనాల నార సంచుల్ని చేతి సంచులుగా మార్పించి కార్యకర్తలకు పంచడం!

 

కాంపౌండర్ వక్కలగడ్డ వేంకటేశ్వర రావు ముమ్మారు నిర్ద్వంద్వంగా ప్రకటించిన గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలతో 6.48 నిముషాలకు నేటి మన బాధ్యతా పరిపూర్తి!

 

రేపటి మన కృషి గంగులవారిపాలెం రోడ్డు దగ్గర ప్రారంభం!

 

           అదొక చరితార్థత

స్వచ్చోద్యమ చల్లపల్లి చరితార్థత ఎట్టిదనిన....

సామాజిక ఋణ విముక్తి తాత్వికతే పునాదిగా-

సహనం-నిష్కామకర్మ –సమయ, అర్ధదాతలుగా

వందలాది గ్రామస్తులు వరుస కట్టి కదలడం!

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 15/01/2020

                                                    చల్లపల్లి.