1892 * వ రోజు....           16-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!                                                                                                                                                                                                                                                                            

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1892* వ నాటి దృశ్యాలు.

 

చలిగాలి, మంచు దాడి చేస్తున్న ఈ శుభోదయాన 4.05-6.28 నడిమి సమయంలో- గంగులవారిపాలెం దారిలోని బండ్రేవు కోడు సమీపంలో నిర్వహించిన గ్రామ స్వచ్చ-శుభ్ర కృషిలో పాల్గొన్న వారు 30 మంది. ఇది నేటి ప్రధాన కార్యరంగమే ! ఇక్కడికి వచ్చే దారిలో ATM కేంద్రం దగ్గరి అశుభ్రతను, మురికిని కనిపెట్టిన నలుగురు స్వచ్చ కార్యకర్తలు ఆ దుమ్మును, మసిని, ఇతర వ్యర్ధాలను శుభ్ర పరిచిన తర్వాతే ఈ గంగులవారిపాలెం లోని ప్రధాన క్షేత్రంలో చేరారు.

 

మధ్య మధ్య అంతరాయలతో దఫ దఫాలుగా జరుగుతున్న గంగులవారిపాలెం మార్గంలో నేటి స్వచ్చ- సుందరీకరణం జరిగింది 50-60 మీటర్ల పరిధిలోనే గాని, అది తమ ఇంటి పనికన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టి క్షుణ్ణంగా- పరిపూర్ణంగా నిర్వహించిన బాధ్యత:

 

వీరిలో  ఏడెనిమిది మందికి చేతి నిండా పని కల్పించింది బండ్రేవు కోడు వాగులో కలిసే గ్రామ ప్రధాన మురుగు కాలువే. అక్కడి పిచ్చి-ముళ్ల మొక్కలు, తీగలు, గడ్డి వీళ్ల గంటకు పైగా కృషితో తొలగి,  ఆ వ్యర్ధాలన్నీ ట్రస్టు కు చెందిన ట్రాక్టర్ లోకి ఎక్కి, చెత్త కేంద్రానికి చేరాయి.

 

ఈ డ్రైను ఎదురుగా ఉన్న రెండు ఖాళీ స్తలాలలోని ముళ్ల చెట్లను, గడ్డిని, తుక్కును ఐదారుగురు సుందరీకరణ కార్యకర్తలు ఎంతగా శుభ్రపరచారంటే- తెల్లారి, 6.30 తర్వాత ఆ ప్రాంతాన్ని చూసిన వాళ్లకి చూపు మార్చలేనంత!  అక్కడ ఉన్న ఎవరో ఎప్పుడో నరికివేసిన పెద్ద తాడి చెట్టును రోడ్డుకు దూరంగా ముగ్గురు కార్యకర్తలు మూడు నిముషాల్లోనే నెట్టివేసి ఆ దారి ప్రయాణాన్ని సుకరం చేశారు.

 

నలుగురు మహిళా కార్యకర్తలు గొర్రులు- చీపుళ్లు ప్రయోగించి రహదారి నంతటినీ పదే పదే శుభ్ర పరుస్తూనే ఉన్నారు. పుచ్చగడ్డ కు చెంది, కొత్తగా ఆస్పత్రిలో ఉద్యోగిస్తున్న విజయరాణి తొలిసారి స్వచ్చ సైన్యంలో కలిసింది.

 

కత్తి వీరులు ఏడెనిమిది మంది వంగి, అనువుగాని ఇరుకు చోట్ల కూర్చొని దారి మలుపులో, మురుగు కాల్వ గట్టు మీద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ స్తంభాల మధ్య ప్రతి వ్యర్ధాన్ని నరికి, చెక్కి బాట మీదకు లాగి ఆ నికృష్ట ప్రాంతాన్ని పునః పునః దర్శనీయంగా మార్చడమే నా దృష్టిలో నిస్వార్ధ శ్రమ జీవన సాఫల్యం!

 

ఇతర విశేషాలకొస్తే-

- నిన్న ప్రేమానందం గారు స్వచ్చ కార్యకర్తలకు బహూకరించిన పర్యావరణహిత 80 దృఢతర సంచుల్లో కొన్నిటిపైన దేసు మాధురి మనకోసం మనం  ట్రస్టు చిహ్నాన్ని రంగుల్లో అలంకరించారు.

 

- ఒకప్పుడు క్రమం తప్పని మన స్వచ్చ సైనికుడు S.G.A బాష (జీవిత భీమా) గారు ముల్లా అజీమ్ తో తమ కుమార్తె తస్లిమ వివాహ వేడుకకు(ఆదివారం-19.1.2020 మధ్యాహ్నం 12.00కు) స్వచ్చ సైనికులందరికీ ఆహ్వానం పలికారు.

 

- వామ పక్ష ఉద్యమ నాయకుడు ముప్పాళ్ల భార్గవ శ్రీ గారి కుమార్తె- విశాఖ వాస్తవ్యురాలు,  అమలేందు ఆమె భర్త, డాక్టర్ జె. రమేష్ కుమారుడు హష్మి తో బాటు స్వచ్చోద్యమ చల్లపల్లి ని సవివరంగా (నిన్న) పరిశీలించి, ప్రశంసించి వెళ్లడం.

 

- హైదరాబాదులో నివశిస్తున్న చల్లపల్లి మూలాలు గల అన్నవరపు రామ మోహనరావు గారు గతంలో వలె నే ఉదాహరణ యోగ్యమైన స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి ఆర్థిక చేయూతనిస్తూ మనకోసం మనం  ట్రస్టుకు 50,000/-విరాళాన్ని వాగ్దానం చేయడం.

 

6.50 నిముషాలకు గయాజ్ అహ్మద్ బాష గారు ముమ్మారు ప్రకటించిన స్వచ్చోద్యమ దృఢ సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యతల పరిపూర్తి.

 

రేపటి బాధ్యతల కోసం గంగులవారిపాలెం దారి చివర కలుసుకొందాం!

 

         ఆచరణమె గీటు రాయి

వలదు వలదీ చల్లపల్లికి వట్టి గొప్పలు-ఊక దంపుడు

జనానికి చూపించుటకు ఆచరణ ఒక్కటె పనికివచ్చును

అదొకటుంటే ప్రచారార్భటి అనవసర రాద్ధాంతమే

చెప్పిన ప్రతిదీ ఆచరించే చల్లపల్లి స్వచ్చ సైన్యమే!

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 16/01/2020

                                                   చల్లపల్లి.