2787* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు?

వేకువ 4:18 నుండే శనివారం నాటి వీధి పారిశుధ్యం - @2787*

          స్థలం - బందరు దారిలోని 6 వ నంబరు కాల్వ - రిజిస్ట్రార్ కార్యాలయం - ఉత్తరంగా పని చేయని వడ్లమర దాక! పారిశుద్ధ్య కార్మికుల అవతారమెత్తింది 25 మంది రకరకాల నేపథ్యం ఉన్న మూడూళ్ల వ్యక్తులు!

 

      వాళ్ల పని చోటుకు కొలతలున్నవి గాని- పంచుతున్న స్ఫూర్తికీ,పొందుతున్న తృప్తికీ హద్దులూ, పద్దులూ లేవు! 2787* నాళ్ళ నా - కనుచూపు మేరలో ముగింపు పొడ కట్టని స్వచ్ఛ - సుందర శ్రమ ధారావాహిక టూకీగా నేటి ఎపిసోడ్ ది!

          మరికొంత వివరంలోకి వెళితే :

          ఈ వేకువ కత్తుల, దంతెల పనికన్న ఎక్కువగా చీపుళ్లకే పని తగిలింది. సగం మందికి పైగా - ఇటు వంతెన గోడల మధ్య ప్రారంభించి - 2 ఆస్పత్రుల - రామ్దేవ్ టీ దుకాణ - రాజ ద్రవ్య నిధి(SBI) భవన - పురాతన విద్యా సంస్థ - మరి కొన్ని మెకానిక్ షెడ్ల - రహదారి భాగాన్ని దర్శనీయంగా మార్చేశారు!

          వాళ్ల ఒంటి చెమటల్తో వీధి దుమ్ము జిగటగా అంటుకొన్నదో - బట్టల రంగూ - రూపూ మారిపోయినవో - చీపుళ్లు లేపుతున్న ధూళి ముక్కుల్లోకి దూరిందో వంగుంటే, కూర్చొని జరుగుతూ శ్రమిస్తుంటే మోకాళ్ళు - డుములో నొప్పులే వచ్చాయో – అదంతా వేరే కథ!

          పంట కాల్వ వంతెన గట్లూ - ముఖ్యంగా ఉత్తర దిక్కు 10 మంది కార్యకర్తల కష్టాన్ని ఆహ్వానించగా, మినీ ఉద్యానమూ, కాల్వ గట్టు పడమటి వీధి భాగమూ వాళ్ళ ఓర్పును పరీక్షించగా, గడ్డి - పిచ్చి కంపలు కూడ తగుమాత్రపు శ్రమను కోరుకొనగా

          అన్ని సమస్యలనూ నేర్పుగా పరిష్కరించిన సహనశీల కార్యకర్తలభివందనీయులు!

          రామానగర సరిహద్దు నుండి రోడ్డునూ - దాని మార్జిన్లనూ, బ్యాంకు ముందరి, కళాశాల ద్వారం ఎదుటి, వేగ నిరోధకాల నడిమి, టిఫిన్ బళ్ల వ్యర్థాల్నీ, ఇసుక దుమ్ము మిశ్రాన్నీ ఎంత శ్రమిస్తే గంటన్నర ప్రయత్నంతో ఈ వీధి నిన్నటి కన్న భిన్నంగా మాత్రం పొందికగా మారింది?

          ఇక్కడి సువిశాల రహదారి, చల్లదనాన్నీ -బ్రతుకు గాలినీ పంచుతున్న చెట్లూ, ఉద్యానాలూ, కార్యకర్తల శ్రమ వేడుకకు సజీవ సాక్ష్యాలే గదా!

          6.05 కు చెత్త లోడింగు పూర్తయి, 6.10 కి కాఫీల - కబుర్లు ముగిసినపుడు గాని చివరి పెద్దలిద్దరూ పని ముగించలేదు. అప్పుడు వినసొంపుగా ముమ్మారు పాటల శ్రీనివాసుని స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలు!

          6. 20 కి ఇళ్లకు బయల్దేరే ముందు - కళాశాల ముఖద్వారం విజయలక్ష్మి మెడికల్ దుకాణాల దగ్గరే రేపటి వేకువ పారిశుద్ధ్య ప్రయత్నమని నిర్ణయించారు.

            జాగృతికి సంకేతముగ!

చిరంతనముగ - నిరంతరముగ ప్రగతి శీల స్వచ్ఛ సుందర

సమాజానికి మహర్దశగా - జాగృతికి సంకేతముగ - దు

స్వార్థ చింతకు చెంప పెట్టుగ త్యాగమున కొక ఉదాహరణగ

మిగిలి పోదా గ్రామ చరితన మీ వినిర్మల శ్రమాధ్యాయం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.06.2023.