2792* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

2792* వ వీధి సంస్కరణ ప్రక్రియ కూడా షరామామూలే!

          అనగా - నిన్నటి వలే 22 + 3గ్గురే! కాకపోతే ఇది గురువార(8.6.23)మనుకోండి - అదే మునసబు బజారు దగ్గర 4:15 కే దర్శనమిచ్చిన తొలి కార్యకర్తలూ, నిన్నటి ఉదయం వలెనే కాస్తంత మర్యాదగా కనిపించిన వాతావరణమూ!

          తెల్లారి, బారెడు పొద్దెక్కాక - 6:20 సమయంలో - నేటి శుభ్ర - సుందరీకృత ప్రదేశం పట్టిపట్టి కాక - పైపైన చూసే వాళ్లకు – ‘ఈ 20 కి పైగా కార్యకర్తలు 30 - 40 పని గంటల్లో ఉద్ధరించింది ఈ 70/80 గజాల 2 వీధుల్నేనా?’ అనిపించొచ్చు! కాని, అలా తలపోసే వాళ్ళు గనక :

1) చర్చి ప్రక్క 40 గజాల వీధినీ, మురుక్కంపు గొడుతున్న డ్రైన్ల బాగుచేతనూ, ఆక్రమణకు గురై పాడుబడిన చెరువు గట్టున ఏడెనిమంది శ్రమనూ,

2) తిని సగం పారేస్తే - కుళ్లుతున్న అన్నం ఘాటు వాసనల్లో ప్లాస్టిక్ లు ఏరుతున్న, కొలుముల్ని శుభ్రం చేస్తున్న, గడ్డినీ - పిచ్చి కంపల్నీ కోస్తున్న - చెక్కుతున్న కర్మిష్టుల్నీ,

3) నిన్నిటి - నేటి వ్యర్ధాల్ని డిప్పలకెత్తి, లోడు చేస్తున్న నలుగురైదుగుర్నీ,

4) ఒకప్పుడు ఉన్నతోద్యోగాల్లో ఒక వెలుగు వెలిగి రిటైరై కూడ దుకాణాల ముందు సుందరీకరిస్తున్న పెద్దల్నీ,

5) బండెడు చెత్తనీ, 2 గోతాల ప్లాస్టిక్ వ్యర్థాల ప్రోగునూ

          ఒక్క అరగంట అక్కడ ఓపిగ్గా ఉండి, వీలైతే కలిసి ఒంగి పని చేస్తే మాత్రం తమ ఆలోచనల్ని మార్చుకొంటారు!

          ఈ కార్యకర్తల గుంపు ఈ తొమ్మిదేళ్లుగా ఎందుకు శ్రమిస్తున్నదో ఏమి సాధించిందో - ఎప్పటికైనా తాము కలగన్న స్వచ్ఛ - సుందర చల్లపల్లి వాస్తవికత పట్ల ఎంత నమ్మకంగా ఉన్నదో తప్పక బోధపడగలదు!

నేటి శ్రమ సమీక్షా కాలపు విశేషాలివి :

- వారం రోజులకు పైగా ఊరికి - స్వచ్ఛ సుందరకర్మలకీ దూరమైన కాశ్మీర్ దేశాన ఉండి వచ్చిన DRK డాక్టరు గారు మళ్లీ స్వచ్ఛ కార్యకర్త అవతారమెత్తడం,

- గతంలో తనది కాని, ఉద్యోగ రీత్యా వచ్చి ఉంటున్న చల్లపల్లిని ఎడనెడా సేవించిన ఇటీవల రావీలుపడని - ఇకా ముందసలేరాలేని శాయిబాబు (వెటర్నరీ) గారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు పలకడమూ, త్వరలో ఇబ్రహీంపట్నంలో జరిగే తన కుమారుని వివాహనికాహ్వానించడమూ,

- చల్లపల్లిలో శ్రమదాన ఫలితాన్ని మిక్కిలినేని మధు వివరించడమూ,

- డాక్టరు గోపాలకృష్ణుల వారి 2000/-, కోడూరు వారి 520/- విరాళాలూ,

- డాక్టరు గారి పర్యటనానుభవాలు.....

          రేపటి వేకువ మన కర్మక్షేత్రం మునసబు గారి బజారు వద్దగా నిర్దారింపబడెను!

         దశాబ్దాల నిరీక్షణకు

స్వయం సమృద్ధ శ్రమ సంస్కృతి జనంలోన ఇంకేందుకు

పది కాలాలీ గ్రామం పచ్చగ వర్ధిల్లేందుకు

ఎన్నేళ్లైన పట్టవచ్చు ఈ గ్రామ సముద్ధరణకు

శ్రమదాతలు సంసిద్ధులె దశాబ్దాల నిరీక్షణకు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.06.2023.