1964*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1964* వ నాటి ఆదర్శాలు

            నేటి ఉషోదయ పూర్వం, సూర్యోదయానికి ముందు జరిగిన స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న ధన్యులు 35 మందికి పైనే! 3.55 - 6.10 సమయాల మధ్య విజయవాడ బాటాలోను, కమ్యూనిస్ట్ కార్యాలయ వీధిలోను నెలకొన్న స్వచ్చ – శుభ్ర – సుందరీకరణల క్రమంబెట్టినదనిన : 

- చిన్న కార్ల షెడ్డు దగ్గర ఆగి, దానికి ఉభయ పార్శ్వాలలో రహదారిని, రెండు డ్రైన్లను, వాటి నాలుగు గట్లను 30 మందికి పైగా కార్యకర్తలు క్షుణ్ణంగా శుభ్రపరుస్తూ సాగి, 6వ నంబరు పంటకాలువ దాక పరిక్రమించారు. పిచ్చి – ముళ్ళ మొక్కలు, గడ్డి వంటివి తొలగిస్తూ, 12 రోజుల నాటి ఎండిన కొమ్మలను, రాలిన ఆకులను, ఇతర వ్యర్ధాలను ఊడ్చి, ట్రాక్టర్ లోనికి ఎత్తి, చెత్త కేంద్రానికి చేరుస్తూ, కొందరు చీపుళ్లతో రోడ్డు మొత్తాన్ని ఊడుస్తూ, ఒక వంక వచ్చేపోయే వేగవంతమైన వాహనాలను కాచుకొంటూ, ఒకరికొకరు దూరాన్ని పాటిస్తూ గంటన్నర సమయం పైగా (సుమారు 50 – 60 పనిగంటలన్నమాట!) – ఛాయా చిత్రంలో చూపినట్లుగా విజయవాడ మార్గాన్ని శుచి – శుభ్ర సంపన్నం చేశారు. గ్రామ – వృక్ష రక్షకదళం చిందరవందరగా నరికేయబడిన చెట్లకు సుందరాకృతుల ప్రయత్నం చేశారు.

            ఎందరు కార్యకర్తలు – ఎన్ని లక్షల పని గంటలు – అనే గణాంకాల కన్న కార్యకర్తల ఐదున్నరేళ్ల పట్టు వదలని గ్రామ శుభ్ర – సుందర సు సంకల్పమే – వారి స్ఫూర్తి దాయక సుదీర్ఘ ప్రస్థానమే ఇప్పుడు గమనింపదగింది!

            కమ్యూనిస్ట్ వీధిలో గత రెండు వారాలుగా జరుగుతున్న సుందరీకరణం – చిత్రలేఖనం ఇంకా ముగియలేదు. ఈ నాటి ఆ కార్యకర్తల సృజనాత్మక కృషిని, తత్ఫలితమైన ఆ వీధి అందాలకు శంకర శాస్త్రి గారి ఫోటోలే సాక్ష్యాలు!

            దినదినం – క్షణక్షణం విజృంభిస్తున్న కరోనా మృత్యు మృదంగం పట్ల కార్యకర్తలూ, గ్రామస్తులూ తస్మాత్ జాగ్రత్త!

            రేపటి స్వచ్చ – శుభ్ర ప్రయత్న ప్రదేశం కూడ నేటి విజయవాడ మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ పరిసరాల దగ్గరే!

           నివాళితో ఎదురుచూస్తూ...

నిజంగా స్వచ్చోద్యమానికి నివాళితో ఎదురేగి గ్రామ

ప్రజలు సుందర చల్లపల్లి ని స్వాగతిస్తారా!

నిజంగానే స్వచ్చ సైన్యం నీడలోనే సకల గ్రామం

స్వచ్చ – శుభ్ర – స్వస్తతలకై సాహసిస్తుందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 28/03/2020

చల్లపల్లి. 

3.55 కు విజయవాడ రోడ్డులో కార్ల షెడ్డు వద్ద