1965*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1965* వ నాటి శ్రమదాన సందేశం.

ఈ ఆదివారం వేకువ జామున 4.05-6.10 నిముషాల నడుమ గ్రామంలోని రెండు-మూడు చోట్ల జరిగిన స్వచ్చంద శ్రమదానం లో 43 మంది కార్యకర్తల గ్రామ మెరుగుదల ప్రయత్నాలు అక్కరకొచ్చాయి. విజయవాడ దారిలోని కాటా దగ్గర,  6 వ నంబరు పంట కాలువ దాపున, కమ్యూనిస్టు కార్యాలయ వీధిలో- మూడు చోట్ల మూడు రకాల స్వచ్చ-సుందర ప్రయత్నాలు కాక ట్రస్టు ఉద్యోగులు గ్రామంలో అవసరమైన ప్రతి చోట నీళ్ల టాంకర్ నడుపుకొంటూ పోయి, మొక్కలకు నీరందిస్తున్నారు!

          గ్రామ – వృక్ష రక్షక దళం మరొక మారు చిల్లలవాగు మొదలు కొని, మరికొన్ని చెట్లను ఒకే స్థాయిలో బుట్ట గొడుగుల్లా పెరిగే విధంగా అంచనాల తో ట్రిమ్ చేస్తుండగా-

20 మంది కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ చుట్టుకొని మూడు వైపుల, వంతెన క్రింద, కాలువలో, కాలువ గట్ల మీద పిచ్చి-ముళ్ల మొక్కల్ని తొలగించి, ప్లాస్టిక్ సంచుల్ని పోగులు చేసి, సారా (ఖాళీ) సీసాలను సమీకరించి, ఎండు- పచ్చి గడ్డినీ, తుక్కునూ, గొర్రులతో గుట్టలు చేసి, ట్రాక్టరు లో నింపుకొని, రుద్ర భూమి ప్రక్కన గల చెత్త కేంద్రానికి తరలిస్తుండగా-

సారా బాట్లింగ్ కంపెనీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల దాక మరి కొందరు డ్రైన్లలో, గట్లమీద స్వచ్చ-శుభ్రతల ప్రయత్నంలో ఉండగా-

         ఐదారుగురు చీపుళ్ల వారు దారిని, వంతెనను ఊడ్చి శుభ్రతకు మెరుగులు దిద్దుతుంటే-

          ఏడుగురు సుందరీకరణ బృందం కమ్యూనిస్టు వీధి ప్రహరీలకు మరిన్ని రంగులద్దుతూ, క్రొత్త ఆలోచనల తో క్రొత్త చిత్రాలను లిఖిస్తుండగా-

          ఈ నాటి స్వచ్చ సైనికుల ఊరి మెరుగుదల కృషి విజయవంతమైంది!  ఇందులో ఎవరి తృప్తి వాళ్లదే!

ఒకరు కార్యకర్తలకు మంచి నీళ్లందిస్తారు; మరొకరు ఈ రెండు గంటల శ్రమ జీవన సౌందర్యాన్ని ఛాయా చిత్ర నిక్షిప్తంచేసి, సామాజిక మాధ్యమ ముఖ గ్రంధంలోను, ఏమిటి సంగతి (వాట్సాప్)లోను ప్రసరిస్తారు!

ఇంకొకరు కార్యకర్తల భద్రత పై కన్నేసి, పర్యవేక్షిస్తుంటారు! ఆ విధంగా చల్లపల్లి స్వచ్చోద్యమం పరిపూర్ణమై నిలుస్తున్నది!

రేపటి, ఎల్లుండి మన శ్రమదానం 3 రోడ్ల ప్రధాన కూడలి, కీర్తి ఆస్పత్రి దగ్గర నిర్వహిద్దాం!

       రెండు భిన్న చరిత్రలు

క్రూరత్వం, మోసంతో-ఘోర దుర న్యాయంతో

కుల మతాల కుంపట్ల తొ- కొల్లలు గత చరిత్రలు!

గతం కన్న భిన్నంగా- గ్రామోన్నతి లక్ష్యంగా

స్వచ్చోద్యమ త్యాగ మహిత చరిత్రలివి సశేషంగా!     

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 29/03/2020

చల్లపల్లి.