1966*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1966* వ నాటి ప్రధాన వీధి శుభ్రతలు

          నేటి వేకువ కూడ – సోమవారం సంప్రదాయాన్ని అనుసరించి నాగాయలంక బాటలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమయిన గ్రామ ప్రధాన వీధి శుభ్రతలు మూడు రోడ్ల కూడలి, బందరు మార్గం లోని మరొక పెట్రోల్ బంక్, ATM సెంటర్ మీదుగా రక్షక భట వీధి వరకు నిర్విఘ్నంగా సాగినవి. ఇక్కడ పాల్గొన్న 33 మంది కాక కమ్యూనిస్ట్ వీధిలో స్వచ్చ సుందరీకరణ కర్తవ్యం నెరవేర్చిన ఏడుగురితో కలిపి మొత్తం 40 మంది స్వచ్చ సైనికుల శక్తి వంచన లేని నిస్వార్ధ కృషి ఉదయం 4:04 - 6:12 నిముషాల మధ్య స్ఫూర్తిదాయకంగా ముగిసింది.

          ముందుగా కరీముల్లా దుస్తుల దుకాణం దగ్గరలో తమ తమ ద్విచక్ర వాహనాలను, చీపురు – దంతె – చాట చీపురు వంటి సామానుల వాహనాన్ని నిలిపి చేతి తొడుగులు ధరించి ఆయుధాలను చేతబూని, గ్రామ వీధుల కాలుష్యం మీద యుద్ధం మొదలుపెట్టారు. విజయవాడ, బందరు, అవనిగడ్డ అనే మూడు రహదారుల కూడలి, రెండవ పెట్రోల్ బంక్, రెండు దేవాలయాలు, ATM సెంటరు, కూరల – చిన్న హోటళ్ళ – పిండి మిల్లుల – టిఫిన్ తోపుడు బళ్ళ ప్రదేశాలన్నీ ఈ స్వచ్చ సైనికుల యుద్ధ ప్రాంగణాలుగా మారిపోయినవి.ఒక ప్రక్కన దుమ్ము రేగుతూ, గాలికి అది తమ శరీరాలను కప్పి వేస్తున్నా సరే వెనకడుగు వేయక ఈ సైనికులు ప్లాస్టిక్ వ్యర్ధాలను, దుమ్ము, ఇసుక మిశ్రమాలను, టిఫిన్ పొట్లాలకాగితాలను, పూల అంగళ్ళ పూల రేకులను –ఒకటేమిటీ, అన్ని రకాల కాలుష్య కారక వస్తువులను ఊడ్చి పోగులు చేసి ట్రాక్టర్ లో కి నింపుకొని తమ కృషిని విజయవంతంగా నెరవేర్చారు. ఈ దుమ్ము, ధూళి ని గ్రామ రక్షక – ప్రమాద నివారక దళం వారు RTC బస్ ప్రాంగణం దగ్గరకు చేర్చి అక్కడ గుంటలలోని రాళ్ళ మధ్య పోసి తమ పని తాము ముగించారు.

          సామ్యవాద మార్గపు వీధిలో సుందరీకరణ సభ్యులు ఏడుగురికి ఈ నాడు కూడా చేతినిండా పనే! మిగిలిన కొన్ని చిన్న ప్రహరీలను కూడా వదలక ఆకర్షణీయమైన బొమ్మలు చిత్రించి, సృజనశీలతను ప్రదర్శించారు. స్థానిక కళాభిమానులు కొందరు వీళ్ళ చిత్రలేఖన నైపుణ్యానికి సాక్ష్యులుగా ఉన్నారు.

          యధావిధిగా 6 గంటలకు, గ్రామ స్వచ్చ విధులకు స్వస్తి పలికి, కాఫీ – టీ లను ఆస్వాదించి విడివిడిగా నేటి స్వచ్చ శ్రమదానాన్ని ప్రస్తావించుకొని గృహోన్ముఖులయ్యారు.

          రేపటి మన శ్రమదాన ప్రధాన కేంద్రం కీర్తి ఆసుపత్రి ముందరి బందరు మార్గం.     

        వ్యక్తి – సమాజం

వ్యక్తుల – బిడ్డల బాధ్యత సమాజానికున్నప్పుడు

వికాసాల – వ్యధల – సుధల కర్తవ్యం మోయునపుడు

గ్రామ బాధ్యతలు మాత్రం వ్యక్తి కసలు పట్టావా?

స్వచ్చ గ్రామ పురోగతికి సాహసించకూడడా?

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 30/03/2020

చల్లపల్లి. 

4.04 కు సెంటర్లో
ఫౌండ్రీ షాపు వద్ద పేరుకున్న చెత్తను తొలగించి ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్న కార్యకర్తలు