1967*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1967* వ నాటి స్ఫూర్తిదాయక శ్రమ విశేషం

          ఈ నాటి వేకువ 4.00 – 6.15 నిముషముల మధ్య గ్రామంలో ఉభయత్రా జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం లో కలిసివచ్చిన స్వచ్చంద శ్రామికులు 40 మంది. నిన్నటి నిర్ణయం ప్రకారం గ్రామ మెరుగుదల కృషి జరిగిన ప్రాంతాలు – 1) బందరు మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన 2) కమ్యూనిస్ట్ వీధి పరిసరాలు.

          గంగులవారిపాలెం దారి మొదటిలోనూ, 6 వ నంబరు పంట కాలువ ఉత్తరదిశగానూ ఈనాడు  గ్రామ రెస్క్యూటీమ్ నిర్వహించిన కీలకమైన కృషి ముందుగా ప్రస్తావించదగినది. వీరిలో నలుగురు ప్రభుత్వ కళాశాల గేటు మొదలుకొని కీర్తి ఆసుపత్రి మీదుగా రహదారి వనాన్ని శుభ్రపరచి అక్కడి మలుపులోని 4 అడుగుల లోతు మురుగు కాల్వలో దిగి అక్కడ అడ్డుపడుతున్న రకరకాల తుక్కును, ప్లాస్టిక్ సంచుల్ని, సిల్టుని డిప్పల కొద్దీ పైకి తీసి ఆ మురుగు కాల్వకు కొన్ని రోజుల తరువాత మళ్ళీ సరైన నడక నేర్పారు. వీరిలో మరికొందరు కీర్తి హాస్పిటల్ తూర్పు వైపున, కాలువ లోపల, తూములలోని పాత గుడ్డలు, గోనె సంచులు, ప్లాస్టిక్ తుక్కులు, చెప్పులు వగైరా నానాజాతి కాలుష్యాలను బయటకు లాగి బండెడు చెత్తను పోగులు చేశారు గాని ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించే వ్యవధి చాలలేదు.            

          సుమారు 20 మంది కార్యకర్తలు స్టేట్ బ్యాంకు ఎదుట తమ వాహనాలను నిలిపి సామానుల బండిలోని తమ ప్రియతమ పనిముట్లను చేతబూని భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక ఊడ్చి, ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను పోగులు చేసి అనివార్యంగా రోడ్డు మీద పడుతూనే ఉన్న ఇసుకను, దుమ్మును లాగి పోగులు చేసి తమ స్వచ్చ శుభ్ర ప్రస్థానాన్ని 6 గంటలకు ముగించారు. అదేమిటో గాని ఇన్ని వందల రోజుల తరువాత కూడా పళ్ల దుకాణాల వాళ్ళు బడ్డీ కొట్టుల వాళ్ళు టీ దుకాణాల యజమానులు ఊరంతా శుభ్రం చేయకపోతే పోయిరి – తమ వ్యాపార స్థలాల ఎదుట కూడా శుభ్రం చేసుకోరే!

          ఇక సుందరీకరణ బృందానికి నెల రోజుల నుండీ కమ్యూనిస్ట్ వీధి ఒక్కటే ప్రపంచమైపోయింది. ఆ వీధిలోని చిన్న, పెద్ద ప్రహరీలన్నీ తప్పని సరై, అనివార్యంగా రకరకాల రంగుల చిత్రాలతో నిండిపోతున్నవి. (అసలు ఇందులో కొన్ని ప్రహరీలైతే – నెల రోజుల క్రితం ఉన్నట్లే తెలియలేదు.) ఇంకా ఎన్నాళ్ళకు ఈ సుందరీకరణ తపస్సులు ఈ వీధిలో ముగుస్తాయో తెలియదు. నిన్నటి నందేటి శ్రీనివాస్ స్వయం విరచిత కరోనా గేయాన్ని కార్యకర్తలంతా కాఫీ తాగుతూ ఈ రోజు కూడా శ్రద్ధగా విన్నారు.

          ఉడత్తు రామారావు గారు యధావిధిగా (ఆయన ఇంటి ఎదుట స్వచ్చ కార్యకర్తలు శ్రమించినందుకు గానూ) అందరికీ బిస్కెట్లు పంపిణీ చేశారు.

          రేపటి మన స్వచ్చంద శ్రమదాన ఘట్టం విజయవాడ మార్గంలోని విజయా కాన్వెంట్ సమీపంలో ఉంటుంది.

        ఒకానొక విన్నపం

తరతరాల ప్రజలకు ఒక తరగని స్ఫూర్తిని పంచిన

ధన్యజీవులున్నారని – వారి అడుగు జాడలలో

కాలానుగుణంగ మనము కదలి ముందుకెళదామని

జనం మన్ననలు పొందుట స్వచ్చ విజయ సూచకమని.....

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 31/03/2020

చల్లపల్లి. 

4Am కు SBI వద్ద