1968*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1968* వ నాటి గ్రామ శుభ్రతలు.

          కరోనా కల్లోల నేపధ్యంలోనూ, సడలని కర్తవ్య దీక్షను చాటుతూ, ఉదయం 4.00 కే విజయవాడ బాటలోని 6 వ నంబరు పంట కాల్వ వంతెన కేంద్రంగా 26 మంది, కమ్యూనిస్ట్ వీధిలో ఆరుగురు – వెరసి 30 మందికి పైగా స్వచ్చ చల్లపల్లి ఉద్యమకారులు 6.10 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతా వివరాలు:

          ఐదారుగురు మాత్రం వంతెన దగ్గరి డ్రైను లో తుక్కులు లాగారు. ముగ్గురు ట్రస్టు కార్మికులు వంతెన పడమర గట్ల మీద – గతంలో కార్యకర్తలు నాటి, రక్షించి, పెంచిన మొక్కలన్నిటికి నీళ్లందించారు. సుమారు 20 మంది కత్తులు, గొర్రులు, చీపుళ్లతో సంసిద్ధులై వంతెన తూర్పుగా నారాయణరావు నగర్ దిశగా రెండు గట్ల మీద, డ్రైను లో రకరకాల మొక్కలు, తుక్కు, ఖాళీ మద్యం సీసాలు, ఎంగిలాకులు, వంటివి నరికి, ఏరి, ఊడ్చి, పోగులు చేశారు కోరోనా కట్టడికి కావలసింది ఇళ్ళు, పరిసరాలు, వళ్ళు, చేతులకు శుభ్రత ఐతే – అది ఈ 31 మంది కార్యకర్తలకే పట్టి, ఊరికి, తమ ఇంటికి దూరంగా ఉన్న ఈ చోటంతా స్వచ్చ – శుభ్ర – సుందరం చేయడంతో తమ వంతు కర్తవ్యం పూర్తి చేశారన్నమాట!

          కమ్యూనిస్ట్ వీధిలో నేటి సుందరీకరణ కృషి ఎలా – ఎంత జరిగిందో – శంకర శాస్త్రి గారి వాట్సాప్ ఛాయాచిత్ర – వ్యాఖ్యానాలతో తెలుసుకొండి! 6.10 కు శాస్తి గారి తినుబండారాల పంపకంతో – డాక్టరు గారి కరోనా విషయక హెచ్చరికల తో నేటి మన గ్రామ బాధ్యతలు ముగిసినవి. (ఇక్కడి నుండి మన స్వచ్చ కార్యకర్త – నందేటి శ్రీనివాస్ మైకుతో ఊరి ప్రజలకు హెచ్చరికలు/జాగ్రత్తలు వినిపించడం మొదలైంది!)

          రేపటి మన స్వచ్చోద్యమ కృషి కోసం 6 వ నంబరు కాల్వ వంతెన/ విజయా కాన్వెంట్ ఎదుట కలుసుకొందాం!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 01/04/2020

చల్లపల్లి. 

విజయవాడ రోడ్డులో 6వ నెంబరు కాలువ వద్ద