స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1847* వ నాటి ముచ్చట్లు.....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 (ఇతరులను) చలి పీడిస్తున్న ఈ నాటి వేకువ 4.05-6.10 నిముషాల మధ్య నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు నుండి బందరు రహదారి సామ్యవాద( కమ్యూనిస్టు) వీధి దాక సంతృప్తి కరంగా సాగిన స్వచ్చ-శుభ్ర సుందరీకరణ లో 29 మంది పాల్గొన్నారు.

 
చలి నిరోధం కోసం కాబోలు-ఎంతోమంది రోడ్ల మీదకు వచ్చి తేనీరు సేవిస్తున్న-సిగరెట్లు ఊదేస్తున్న ఇంత చలిలో- ఈ స్వచ్చ కార్యకర్తలంతా-
 
ఉభయ పెట్రోలు బంకులు, మూడు రోడ్ల కూడలి, టాక్సీ స్టాండు, ATM కేంద్రం, చిన్న, పెద్ద హోటళ్లు, కూరల దుకాణాలు, తోపుడు బళ్లు వద్ద పుట్టుకొచ్చే చెత్త, రకరకాల వ్యర్ధాలు, టీ-కాఫీ కప్పులు, సిగరెట్ల పీకలు, పెట్టెలు వంటి అనవసర చెత్తను ఏరి- ఊడ్చి-ఆ గుట్టలను ట్రాక్టర్ లోనికి నింపి, డంపింగ్ కేంద్రానికి తరలించారు.
 
దారికిరుప్రక్కల పేరుకుపోయి గట్టి పడిన ఇసుక-దుమ్ముల్ని గోకుడు పారలతో, చెక్కి, గోకి రోడ్డును సువిశాల సుందరం చేశారు.
 
అంగళ్ల మెట్ల మీది చెత్తా చెదారాలను గూడ మహిళా కార్యకర్తలు ఊడ్చి, రహదారి అందానికి మెరుగులు దిద్దారు.
 
ఒక ప్రక్క కాఫీ-టీ-సిగరెట్ ల సంతృప్తి తో బాటు ఆయా వ్యర్ధాల ఉత్పత్తి, మరొక వంక కృత నిశ్చయంతో ఏమైనా సరే దారిని, ఊరిని స్వచ్చ-శుభ్రంగా ఉంచుకొంటున్నామనే మరి కొందరి ఆత్మానందం- ఒకేసారి, ఒకే చోట చూస్తున్న నా వంటి వాళ్ల మనసుల్లో ప్రశ్నార్ధకాలు!
 
ఈ దినం చల్లపల్లి స్వచ్చ-శుభ్రతా సంకల్ప నినాదాలను ముమ్మారు చాటి చెప్పిన వారు 61 రోజులుగా స్వచ్చ యార్లగడ్డ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తూము వేంకటేశ్వర రావు. ఈ ఉభయ గ్రామాలు స్వచ్చ కవలలుగా రూపొందాలని మన అందరి ఆకాంక్ష!
 
స్వచ్చోద్యమ చల్లపల్లికి ఆర్థికంగా మూల స్తంభమైన “మనకోసం మనం” ట్రస్టు కు నారంశెట్టి వేంకటేశ్వర రావు గారు, రాయపాటి రాధా కృష్ణ గారు 2000/-, 1000/- వంతున విరాళమిచ్చినందుకు ధన్యవాదాలు.
 
రేపటి మన స్వచ్చ సంకల్పాన్ని శివరామపురం చెరువు గట్ల మీద పూర్తి చేద్దాం!
 
అందరునూ సామాన్యులె.
కారణ జన్ములెవరు లేరు-కర్మ వీరులీ మనుషులు
వేరు గ్రహం వారు కారు-మీ సోదర గ్రామస్తులు
చల్లపల్లి ప్రజలెందుకు స్వచ్చ సైన్యమున కలవరు?
స్వచ్చ- శుభ్ర సాధకులై చరిత్రలో నిలిచి పోరు?
 
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
సోమవారం – 2/12/2019,
చల్లపల్లి.