2022* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2022* వ నాటి శ్రమదాన వైవిధ్యం.

            ఈనాటి వేకువ జామున కూడ స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణం కోసం అదే సమయం(4.00-6.05)- అదే శ్రమదానం- 40 మంది చిందించిన అవే చెమటలు- అదే ఫలితము - 2 గంటల పాటు మెదళ్లకు ఒడలుకు పదునులు- పనులు! (సందర్భం వేరు గాని- 60 ఏళ్ల నాటి డా. కొమ్మూరి వేణు గోపాల రావు గారు మేనరికాలను నిరసిస్తూ వ్రాసిన “ ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల పేరు గుర్తుకు వస్తున్నది!)

            15-16 రోజుల నుండి ఈ పాగోలు బాటలో స్వచ్చంద శ్రామికులు, వాళ్ల స్వచ్చ తాత్విక స్ఫూర్తి ఏ మాత్రం తగ్గక, మారక సాంచి అశోక స్తూపం లా స్థిరంగా నిలవ బట్టే ఈ రహదారిలో ఇప్పుడూ ఇక ముందూ పాదచారులు ఆహ్లాదంగా- నడవబోతారు!  సత్యమేవ జయతే అనే ఆర్య సూక్తి తో బాటు - శ్రమయేవ జయతే అనే కొత్త సూక్తి  కూడ మన సమాజానికి అన్వయించాలని కోరుకుందాం!

            ఈ రెండు వారాల-1200 పని గంటల- శుభోదయాలలో స్వచ్చ కార్యకర్తలు ఈ రహదారి మెరుగుదలకోసం ఏం పాటుబడ్డారని ఆలోచించడం కంటే- అసలు వీళ్లు చెయ్యనిదేమిటి? అని ప్రశ్నించడం కూడ సమంజసం.

- రహదారి ముఖద్వార మురుగు కాల్వ వంతెన ఇప్పుడు పెళ్లి కూతురి పూలపల్లకిలా లేదా? అక్కడి నుండి అపార్ట్ మెంట్ ల దిశగా ఉభయ దిశల్లో నాటిన 50 మైలు రాళ్లకు గూడ రంగులు పూస్తున్నారిప్పుడు.

- మహాబోధి పాఠశాల దక్షిణ దిశ పరిసరాల చిట్టడవులు తొలగిపోయి, వేప మొక్కలు మాత్రం మిగిలి, రెండు డ్రైనులు, దారి అంచులు పాఠశాల మలుపు దాక 2 వారాల క్రిందటి కన్న ఇప్పుడు శోభాయమానంగా లేవా? వచ్చే-వెళ్లే వాళ్లు వేగం తగ్గించి ఈ స్వచ్చతను, శుభ్రతను చూసుకొంటూ వెళ్లేంతగా మారలేదా?

- మొక్కలకు కుదుళ్లు బాగుపడి, అన్ని పూల చెట్ల కు ముళ్ల కంచెలతో రక్షణ దొరికి, పచ్చదనం చిరునవ్వులొలకిస్తూ- పాగోలు సీనియర్ స్వచ్చ కార్యకర్త కంఠంనేని రామబ్రహ్మం గారి మనసుకెంత తృప్తిగా నిండుగా ఉన్నది?

- మనం చూసి ఆనందించగలగాలే గాని, ఇప్పుడీ పాగోలుదారే చాలా ఇతర రోడ్లకు ఉదాహరణ యోగ్యంగా లేదా?

నేటి కాఫీ సేవానంతర DRK గారి సమీక్షా వాక్యాలతో బాటు- ఈ రహదారి గత- వర్తమాన దృశ్యాలను గుర్తుకు తెచ్చే ఒక పాటను నందేటి శ్రీనివాస్ గళం నుండి అందరూ విని సంతసించారు!

నందేటి శ్రీనివాస్ గారే ముమ్మారు పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను మిగిలిన వారు పునరుద్ఘాటించారు.

రేపటి తో ఈ పాగోలు బాట నవీకరణ- సుందరీకరణలు ముగించేందుకు వేకువ 4.00 కు ఇదే చోట(పాగోలు రోడ్డు) కలుద్దాం!               

    మేలుకొలుపిది నిజంగానే?

పై సహాయం పాటి చేయక- స్వయం కృషికే పీట వేస్తూ

ముప్పై వేల జనాలలో నవ స్ఫూర్తి నింపగ పాటుబడి-ప

ర్యావరణ సమతౌల్యతకు తమ శక్తియుక్తులు ధారపోస్తూ

చల్లపల్లిని నిజంగానే స్వచ్చ సైన్యం మేలు కొలిపిందా!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

సోమవారం 25/05/2020,

చల్లపల్లి.