2025 * వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2025* వ నాటి బాధ్యతా నిర్వహణలు! 

మా ఒకానొక స్వచ్చ కార్యకర్త నిన్న సరదాగా అన్నట్లు- చల్లపల్లి దే గాక, పొరుగూరుకు ఏనాడో పడిన అప్పును నేటి వేకువ 3.59-6.10 మధ్య 38 మంది కార్యకర్తలు చెల్లించుకొన్నారు(రశీదు తీసుకోలేదు!) ఎవరు చూసి వచ్చారు- గతంలో చేసిన ఋణం తీర్చుకొంటున్నారో,  లేక ఈ చల్లపల్లి, పాగోలు గ్రామలే వీళ్ల కిపుడు కొత్తగా బాకీ పడుతున్నాయో! 150 ఏళ్ల నాడు గురజాడ అప్పారావు గారు బలంగాను, సులభంగాను సెలవిచ్చినట్లు-

“ దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమ అనుపూలెత్తవలెనోయ్!

నరుల చెమట తొ తడిసి మూలం-ధనం పంటలు పండవలెనోయ్!

 దేశమంటే మట్టి కాదోయ్- దేశమంటే మనుషులోయ్...

అనే కవిత్వాన్ని ఆచరణలో చూపిస్తున్న ఈ స్వచ్చ సైనికులు ధన్యులు!

మనిషై  పుట్టిన ప్రతి వాడికీ- మంచిదో, చెడ్డదో- ఏదో ఒక వ్యాపకం కావాల్సిందే గదా! పనికి మాలిన ఈ వ్యాపకాల్లో ముందు పీటీన నిలబడేది –“ అడక్కుండానే అందరికీ సలహాలివ్వడమూ, అందులో ఒక్కటైనా చచ్చినా ఆచరించక పోవడమూ! గౌతమ బుద్ధుని – ఏసు క్రీస్తుని- గాంధీ మహాత్ముని వ్యవహార శైలికిది పూర్తి వ్యతిరేకం!

అందుకే- తాము నమ్మిన మంచి ఆలోచనను ఎదుటి వాళ్ల మీద పదే పదే రుద్దక- స్వయంగా ప్రతి రోజూ ఆచరించి చూపే స్వచ్చోద్యమ కారులకు మరీ మరీ నా అభివందనం! ఇలాంటి ఆచరణలనూ, ప్రయోజకతనూ ఊహించే కాబోలు – సంపాదక కవి నార్ల వేంకటేశ్వర రావు గారు.

“ గుడులు వేయి ఒక్క గుటక గంజికి సాటి-

వాస్తవంబు నార్ల వారి మాట...

అని కొంత తీవ్రంగా కవిత్వీకరించారు!

3 వారాలు గడుస్తున్నా ఈ పాగోలు గ్రామ పరిధిలోని బాట వంతెన, తదితరాల శుభ్ర- స్వచ్చ- సుందరీకరణం నేడు కూడ అసంపూర్ణమే!

కల్వర్టు గోడల మీద వీరు చూపదలచుకొన్న పేవర్ టైల్స్(రంగు రాళ్ల) చిత్రీకరణం గాని, స్వచ్చ- సుందర-పబ్లిక్ టాయిలెట్ల ఎత్తైన పడమటి గోడ మీద క్రొత్తగా - మాగాణిలో చేపల కోసం జపం చేస్తున్న రంగుల కొంగల చిత్ర లేఖనం గాని ఈ రోజు కూడ ముగియలేదు.

చందమామ విభాగ భవన(అపార్ట్ మెంట్స్) సమీపాన 15 మంది కార్యకర్తలు ఈ రోజు చేపట్టిన డ్రైను ఉత్తరపు గట్టు మీద స్వచ్చ-శుభ్ర-నవీకరణం కూడ రేపటికి మిగిలిపోయింది! పాగోలు యువ కార్యకర్తలు డ్రైనులో దిగి, వ్యర్ధాలను నరికి, ప్లాస్టిక్ సంచుల్ని అందిన కాడికీ ఏరి, కొత్తగా నిన్న – ఈ రోజూ వచ్చిన మద్యం ఖాళీ సీసాలను మళ్లీ  పోగులు చేసే పనుల్లో గడిపారు. రోడ్డు ను చీపుళ్లతోను, కాల్వ గట్టును దంతెలతోను శుభ్రపరిచే అమ్మాయిలు తమ బాధ్యత తాము నెరవేర్చారు.

మాలాంటి వాళ్ల కళ్లకేమో ఈ మొత్తం 2 గంటల శ్రమదాన కార్యక్రమం ఆ సాంతం ఒక నయన మనోహర దృశ్యకావ్యం! వేరెవరికైనా “ ఇది ప్రొద్దున్నే ఇళ్ల దగ్గర తోచని వాళ్ల కాలక్షేపం” అనిపిస్తే వాళ్ల తప్పు కాదు. మనది భావ స్వేచ్చా సమాజం! లోకోః భిన్న రుచీ అనే సర్ది చెప్పుకొనే లోకం!

గోళ్ల సాంబశివరావు గారు తన మనుమరాలు- ప్రతిభ జన్మదిన సందర్భంగా ఇచ్చిన 2000/- విరాళానికి, రావెళ్ల శివరామ కృష్ణయ్య - లీలావతి గార్ల 7000/- ఔదార్యానికీ మనకోసం మనం ట్రస్టు కృతజ్ఞతలు.

ఈ ఇద్దరు దాతలకు తోడు గత వారంలో కార్యకర్తలందరికీ పుష్కలంగా పంపిణీ చేసిన పాగోలుకు చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ  గారు నేడు కూడా ఒక పెద్ద గోతం నిండా లేలేత సొరకాయలను మళ్లీ తెచ్చి అందరికీ పంచి, ఆనందించారు.

గోళ్ల సాంబశివరావు గారే ముమ్మారు స్పష్టంగా ముక్తాయించిన గ్రామ శుభ్ర-సుందర- సంకల్ప నినాదాలతో నేటి శ్రమదానం ముగిసి,

రేపటి శుభోదయ కృషి వేదిక ఈ పాగోలు దారి సమీపమే!

        ఇదిక పై తన....   

ఎవ్వరిని ఉద్దరించేందుకు? ఎందుకీ స్వచ్చోద్యమంబని

రొచ్చు పనులని- పిచ్చి పనులని తొలి దినాల్లో కొందరన్నా

ఈ మహోద్యమ ఘట్టనలతో ఇప్పుడవి వినిపించకున్నవి

వెనకడుగు లేకుండ ఇకపై విశ్వరూపం చూపబోతుందా!          

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

గురువారం 28/05/2020,

చల్లపల్లి.

3.59 నిముషాలకు పాగోలు రోడ్డులో
డ్రైనులో ఉన్న తాటి బొండును తీసి రోడ్డు ప్రక్కన సరిచేసిన కార్యకర్తలు