2027*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2027* వ నాటి శ్రమదాన సన్నివేశాలు.

            రోజుటి కన్న ఆరేడు నిముషాల వ్యవధిలో - 4.07 - 6.10 వేళల నడుమ 35 మంది ఔత్సాహికుల భాగస్వామ్యంతో – ఉభయ గ్రామాల పరిధిలో – ఉభయ రహదారులలో జరిగిన స్వచ్చ - శుభ్ర – స్వస్త - సుందరీకరణ ప్రయత్నం సంతృప్తి కరంగా నడిచింది!

            10 మంది పాగోలు యువకులు 19 రోజుల తర్వాత శేషించిన తమ గ్రామ దారి మెరుగుదలకు పాటు బడుతుండగా- చల్లపల్లి స్వచ్చ సైనికులు మాత్రం అవనిగడ్డ- పాగోలు బాటల కూడలి నుండి తమ బాధ్యతలకు పూనుకొన్నారు. కొసరుగా ఐదారుగురు తూర్పు ప్రక్క డ్రైనును, గట్లను, వేరుగా ఐదారుగురు బండ్రేవు కోడు వంతెన దాటి- దక్షిణ దిశగా రోడ్డుకు పడమటి డ్రైనును పంచుకొన్నారు. జిల్లేడు, పులుగుడు, ఉత్తరేణి, పిచ్చిమేడి వంటి చాలా పిచ్చి- ముళ్ల మొక్కల్ని- పెనవేసుకొన్న తీగల్ని, ఎండు వరి గడ్డిని నరికారు, మద్యం ఖాళీ సీసాలని ఏరారు - గొర్రులతో లాగి పోగులు పెట్టి ట్రాక్టర్ లో నింపారు- డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

            ఈ రోజు వాతావరణం చిత్రంగా మారింది. ఏ పనీ చేయక నిల్చున్నా, కూర్చొన్నా చాలు బొట్లు గాను, పనిచేసే వాళ్లకేమో ధారలుగానూ చెమట కారిపోతున్నది. మరి ఇలాంటి సమయంలో, ఈ చీకటిలో- మురుగు కాల్వల బాగు చేతలు, రోడ్లు ఊడ్చే పనులు, చెత్త లోడింగులు చేస్తున్న ఈ స్వచ్చంద శ్రమదాతల నిబద్ధత, ఆదర్శం, ముందుచూపు ఎంత గొప్పవై ఉంటాయి?

             రెస్క్యూ టీం అంటే వాళ్ల మొండి పట్టుదల వేరు! డ్రైనులోని మట్టిని సేకరించి మహాబోధి పాఠశాల ప్రధాన ద్వారం ప్రక్కన వాన నీటికి కోసుకు పోయిన వాలులో నింపి, ఆ రోడ్డు కు రక్షణ కల్పించడం - వాళ్ళకిదేంలెక్క?  

            సుందరీకరణ బృందం కూడ ఈ వేళ ప్రధాన స్వచ్చ శ్రమజీవన స్రవంతితో కలిసింది. 3 వారాలుగా వీరు బుర్రలకు పదును పెట్టి- కుంచెలను వాడి వర్ణ మేళనంతో సుందరీకరించిన - చిత్ర లేఖించిన - మెరుగులు దిద్దిన కల్వర్టును, స్వచ్చ - సుందర – పబ్లిక్ టాయిలెట్ పడమటి భాగాన్ని ఈ రోజు నేను మళ్లీ మళ్లీ చూశాను. వీరికి “బాగా అనువైన ఏ మొండి గోడో, ఏ గృహస్తుల రోడ్డు వార అందవిహీనమైన కుడ్యమో శీఘ్రమేవ ప్రాప్తిరస్తు” అని మనసారా దీవిస్తున్నాను. అది వీళ్లకీ, ఊరి సౌందర్య సాక్షాత్కారానికీ మేలు!

            ఇక్కడి ఈ స్వచ్చోద్యమ కారుల 2 గంటల కృషితో అంతకు ముందే కొంత శుభ్రంగా- పడమర దిశగా పరిచిన రంగురాళ్ల తో ఆకర్షణీయంగా-ఉన్న 150 గజాల ఈ ప్రాంతం (చూడగలిగిన వాళ్లకు) మరింత అందంగా రూపొందినది. అలాంటి ఆస్వాదనాపరులు, ఆలోచనాపరులుంటే- ఇక్కడి స్వచ్చ-శుభ్ర- సౌందర్యాల వెనుక వట్టి మాటలు కాక- గ్రామ సమాజం పట్ల నిబద్ధులై గట్టి మేలు తలపెట్టి, రంగంలోకి దిగి శ్రమించిన కార్యకర్తల నిస్వార్ధ శ్రమ శక్తిని గుర్తించవలసినదని మనవి!

            సీనియర్ కార్యకర్త - ఒక బడి పంతులు-భోగాది వాసు మనస్ఫూర్తిగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలతో ఏకీభవించి, కార్యకర్తల శ్రమదాన కృషి రేపటికి వాయిదా పడింది.

            నడకుదురు వీధిలో - కోమలా నగర్ ముఖ్య ముఖ ద్వార మార్గంలో గ్రామ మెరుగుదల కృషి కొనసాగించేందుకు రేపు వేకువ 4.00 కు అక్కడే కలుసుకొందాం.  

              శ్రమ పండుగ కథ ఇదిగో

స్వచ్చోద్యమ చల్లపల్లి విజయం దరహాసమేది?

సామాజిక ఋణ విముక్తి సాధనకై కొంతమంది

తరగని ఉత్సాహంతో తమ గ్రామం బాధ్యతెల్ల

భుజం మీది కెత్తుకొను అపూర్వ నిత్య శ్రమ పండుగ!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శనివారం – 30/05/2020,

చల్లపల్లి.