09.07.2020....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.


09.07.2020

 

            గత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి నుండి, ఇతర చోట్ల నుండి తెప్పించినవి ఇకపై స్వచ్చ చల్లపల్లి వివిధ వీధులలోనూ, కొన్ని రహదారులలోనూ వినియోగించి సుందర చల్లపల్లి కోసం ప్రయత్నించవలసి ఉన్నది.

 

            ఈ ఉదయం 11 గంటల సమయంలో ఐదుగురు కార్యకర్తలు - డా. డి.ఆర్. కె. ప్రసాదు, డా. పద్మావతి, BSNL నరసింహారావు, కస్తూరి శ్రీను, బృందావన్ గారలు ఒక్కటొకటిగా కొన్ని వీధులలో, బైపాస్ మార్గంలో, మూడు రహదారులలో తిరిగి, పరిశీలించి ఎక్కడ ఏ విధమైన పూల మొక్కలతో ఆయా ప్రదేశాలకు మరింత అందం చేకూర్చవచ్చో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు వీరి దగ్గర ఉన్న రంగురంగుల, రకరకాల పూల మొక్కలు రాబోయే నాలుగైదు రోజులలో ఆహ్లాదాన్ని పంచుతూ ఆయా బాటలలో నడిచే వారిని పలకరిస్తూ, తలలూపుతూ కొలువు తీరుతాయన్నమాట!      

 

            పాగోలు రోడ్డులో మూడు రోజుల పాటు స్వచ్చ కార్యకర్తలు ఒక క్రమపద్ధతిలో పెట్టిన 158 మొక్కలకు ట్రస్టు కార్మికులు కళాత్మకంగా కంప కట్టడం నేటితో పూర్తయింది.

 

            వర్షం వెంటాడే రోజులలో కూడా ఇలా ఏ 11 గంటల సమయంలోనో ఈ కార్యకర్తలు గ్రామంలో ఇన్ని వీధులలో పరిశీలనగా సంచరించడం, ట్రస్టు కార్మికులు ముళ్ళ కంపలతో ఇన్ని పూల మొక్కలకు కంచెలు నిర్మించడం వారి వారి సొంత గ్రామ సుందరాకృతుల పట్ల నిబద్ధతలను తెలియజేయడం లేదూ?     

 

            సంపూర్ణముగ నమ్ముతున్నా.

ప్లాస్టిక్ వస్తువులొద్దని ప్రత్యామ్నాయములె ముద్దని...

పచ్చదనం స్వచ్చ పధం ప్రగతికి తొలి అడుగులని...

పరిసరాల పరిశుభ్రతె ప్రామాణిక జీవనమని...

గ్రామస్తులంత నమ్మి, ఆచరించే రోజొస్తుందని...

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

గురువారం – 09/07/2020,

చల్లపల్లి.