మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 2 ....

                          మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 2

        మనలో చాలా మందిమి పౌరాణిక అద్భుత కధలను భలే మెచ్చుతాం! ఏ అవతార పురుషుడో దుష్ట - భ్రష్ట రాక్షసుల్ని దుంప నాశనం చేశాడనే (కల్పిత) కవిత్వాలను ఇష్టపడి బాగా ఆస్వాదిస్తాం. భగీరధుడు వంటి ఒక ఉత్తమ వంశ సంజాతుడు వాయిదాల పద్ధతిలో ఘోర భీకర తపస్సులు చేసి – చేసి స్వర్గంలో ఉండవలసిన గంగను – అమాంతం భూమి మీదకి – అందునా మన పవిత్ర భారతావనికి తెచ్చిన అద్భుత ఘట్టాలను ఒకరికొకరు చెప్పుకొని, సినిమాలుగా చూసుకొని (ఆ అతిలోకాద్భుత సాహసం వెనుక అతని స్వార్ధ లేశాన్ని పట్టించుకోక) మురిసిపోతాం! అంతటి గొప్ప ఆదర్శాలను ఆదర్శాలుగానే మిగిలిస్తూ – ఆచరణ జోలికి పోకపోవడం కూడ మనకు రివాజే! కార్యకారణ  సంబంధాన్ని విశ్లేషించే కొందరు మాత్రం ఆ ఉదంతాల వర్ణనలో సమాజానికి పనికి వచ్చే కార్యాచరణనే పరిగణిస్తారనుకోండి! 

            భీష్మ (= భయంకరమైన – కఠినమైన) ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చిన గంగాసుతుని వంటి, సత్యనిష్ట కోసం సర్వస్వం వదిలేసిన హరిశ్చంద్రుని లాంటి, పురాణ పాత్రలే కాదు; 

            “బుద్ధం సంఘం – ధర్మం” శరణం గచ్చామి” అని ప్రవచించి, ఆచరించిన గౌతమ సిద్ధార్ధుని వంటి – అందరి మోక్షం కొరకు తన ఒక్కడి నరకాన్ని ఆహ్వానించిన రామానుజా చార్యుని వంటి – చారిత్రక వ్యక్తులే కాదు;  

            నమ్మిన ఆదర్శం కోసం గడ్డిపోచల్లాగా ప్రాణాలర్పించిన భగత్ సింగ్, సీతారామరాజులూ, రాజకీయాలాలో సైతం సత్యాహింసలనుష్టించిన గాంధీ వంటి వర్తమాన 100 శాతం యధార్ధ ఆదర్శ వ్యక్తులు కూడ మనకు నిత్య స్ఫూర్తి దాతలే! ఎక్కడి, ఎప్పటి ఆదర్శాలో ఎందుకు? ఇప్పటికిప్పుడు – మనకళ్లెదుటే- ఒంగోలులో “భూమి ఫౌండేషన్” కర్త ఐన తేజస్వి లేదా? మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో తన ఊళ్లను తుఫాన్ల నుండి, ఉప్పెనల్నుండి రక్షించడానికి పూనుకొన్న *కృష్ణ చంద్ర బిస్వాల్’* ఉదంతం మాత్రం తక్కువదా?                               

            పూరీ జిల్లా – గుండలబా గ్రామస్తుడైన ఈ సాహసి సైన్యంలో పనిచేస్తుండే వాడు. సెలవు దొరికినపుడతను 1999 లో తన ఊరికి వచ్చి చూస్తే – అక్కడి దృశ్యం భీభత్సంగా కన్పించింది. ఆ ఏడాది వచ్చిన “సూపర్ తుఫాను” పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి, ఊరిని టన్నుల కొద్దీ ఇసుక మేటలతో నింపి, నేలంతా కోతలు పడి, పశువుల నోట మన్ను కొట్టి పోయింది. “కిం కర్తవ్యమ్” అని అంతా నిచ్చేష్టులై ఉండిపోతే – కృష్ణ చంద్ర బిస్వాల్ మాత్రం కార్యాచరణకు పూనుకొన్నాడు.

            పర్యావరణ వేత్తలను సంప్రదించి సముద్రానికీ – తమ ఊరికీ నడుమ 50 వేల చెట్లతోను, సముద్రతీరం దగ్గర వేలాది తాడి చెట్లతోను బలీయమైన – పర్యావరణహితమైన – అటవీ కంచె నిర్మించాలనే సాహసానికి పూనుకొన్నాడు. నిజానికిది ప్రభుత్వమో – పంచాయతీనో – పారిశ్రామిక యాజమాన్యాలో – పెద్ద పెద్ద స్వచ్చంద సంస్ధలో చేయదగిన సాహసం. అతనికి తన గ్రామం మీద ప్రేమ, ధైర్యం, చొరవ ఉన్నాయి సరే. అందుకయ్యే ఖర్చు సంగతేమిటి? దాని కోసం కొద్ది కాలం వేచి చూశాడు. సైన్యం నుండి రిటైరై తాను పొందిన డబ్బునంతటినీ వెచ్చించాడు. గ్రామస్తులతో సంప్రదించి కలిసి వచ్చిన వారితో ముందుకు నడిచి 5 కిలోమీటర్ల మేర – ఆ గ్రామాలకడ్డంగా 50 వేల చెట్లను నాటాడు. ముందు చూపుతో తాను సేకరించిన తాటి గింజలను వేలాదిగా ఆ కడలికి 100 మీటర్ల ఎడంగా నాటి మొలిపించారు. ఇదంతా 2006 వ సంవత్సరం నాటికి ముగిసిన ముచ్చట!

            ఇప్పుడా తాడి, మామిడి, సరుగుడు, జామాయిల్ వంటి మొక్కలన్నీ మహా వృక్షాలైపోయి, మామూలు కాలంలో ఆయా గ్రామాల వారికి ఫలసాయాన్నిస్తున్నాయి. తుఫానులు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల నడ్డుకొని, నేల కోతలను ఆపే రక్షణ కంచెగా మారాయి.

            ఒకే ఒక్కడు – ఉద్యోగ విధిగా అప్పటి దాక దేశ రక్షణకు కంచెగా నిలిచిన సైనికుడు – కృష్ణ చంద్ర తన ఉద్యోగ విరమణ పిదప తన ప్రాంతపు గ్రామాల రక్షణలోను, పర్యావరణ దక్షతలోను కంచెగా నిలిచాడు.

            ఒంటి చేత్తో కొండను తొలిచి, రోడ్డుగా మలిచిన దశరధ్ మాంఝి, ప్రకృతి భీభత్సాల నుండి కొన్ని గ్రామాలను కాపాడిన కృష్ణ బిస్వాల్ వంటి ఒంటరి యోధుల సాహసాలే నేటి మన తరానికి స్ఫూర్తి నింపాలి. ఇలాంటి వీరాధివీరుల జ్ఞాపకాలే స్వచ్చ సుందర చల్లపల్లి వంటి మరిన్ని ఉద్యమాలకు ప్రేరణ కావాలి!

(ప్రజాశక్తి పత్రికా వార్త సౌజన్యంతో)

- నల్లూరి రామారావు

చల్లపల్లి - 17.07.2020.