మనకాలపు స్ఫూర్తి ప్రదాతలు - 4....

             మన కళ్లముందే కాలం ఎన్నెన్ని దుర్మార్గపు పోకడలు పోతుందో, దాని కడుపు నుండి ఇడీ అమీన్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి రాక్షసులెందరు పుట్టుకొస్తారో, అదే గర్భం నుండి బుద్ధుడు – జీసస్ - గాంధీ వంటి దైవాంశ గల పుణ్య పురుషులు సైతం ఆవిర్భవించి, మానవ మాత్రుల్లోని రాక్షసాంశలను ఎలా దుంపనాశనం చేస్తూ పోతారో పరిశీలిస్తుంటే భలే విచిత్రంగా ఉంటుంది! ఇప్పటికిప్పుడు – ఈ శతాబ్దంలోనే మనం చూస్తుండగానే కాలమనే మహాక్షీర సముద్రం కడుపారకన్న ఒక అనర్ఘ మానవ జాతి రత్నమూ, స్వయం హననానికి పాల్పడుతున్న మనతరాన్ని బ్రతికించే అమృతభాండమూ గ్రేటాథన్ బర్గ్.

 

            ఆమె పుట్టిందీ పెరిగిందీ స్వీడన్ అనే చిన్న దేశంలో. నేటి ప్రపంచపు కొలమానాలైన తలసరి సంపద, జి.డి.పి., పర్యావరణ విధ్వంసం, పరదేశాల దురాక్రమణం, మానవ విలువల్ని, పౌర హక్కుల్నీ కాలరాయడం వంటి ప్రమాణాల్లో అది బొత్తిగా అభివృద్ధి చెందని బుల్లి దేశం. ఆ టీనేజి యువతికిప్పుడు 16 ఏళ్ళు. తన కౌమారప్రాయం నుండి, గత ఐదారేళ్లుగా ఆమె ఈ భూమండలాన్ని కుదిపేస్తూనే ఉన్నది. తన ఎనిమిదో ఏడు నుండి ప్రపంచంలోని సమస్త శిశువుల, బాలల తరపున కాలుష్యాలను కనిపెంచుతున్న దేశదేశాల నాయకత్వాలను, ప్రభుత్వ విధానాలను పిడుగుల్లాంటి తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నది.

 

            ఎనిమిదేళ్ళ వయసులో బడిలో గురువులు వాతావరణ కాలుష్యం గురించి చెప్పినప్పుడు ఆమెకు అర్ధమైంది తక్కువ. మరి కాస్త కాలం గడిచాక అదే విషయం మీద బడిలోనే చూపిన లఘు చలన చిత్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో సముద్రగర్భాలు నిండిపోయి, పెరిగిన ఆ కాలుష్యం దెబ్బకు ధ్రువపు ఎలుగు బంట్లు ఎలా మరణిస్తున్నాయో, భూగోళం వేడెక్కి మంచు ఖండాలు కరిగి, ఎంతగా మిధేన్ వాయువు పర్యావరణం మీదికి విరుచుకుపడుతున్నదో – సముద్ర జీవ జాతులెన్ని నశించి పోతున్నాయో, కార్భన్ డయాక్సైడ్ పెరిగిపోయి ఇంకెన్ని జీవజాతులు నశిస్తున్నాయో అర్ధం చేసుకొన్న ఆ బాలికకు కన్నీళ్లు ఆగలేదు. ఒక వేళ ఆగినా – మనసులో సుడులు తిరుగుతున్న దుఃఖం తగ్గనే లేదు. ఇతరులకు చెప్పే ముందుగా తన నిత్య జీవితంలో పర్యావరణ రక్షణపరమైన మార్పులు చేసుకొని, తల్లి దండ్రులను కూడ మార్చింది.

 

            నానాటికీ మానసిక క్షోభ తీవ్రమై, జరిగే అనర్ధాలను చూస్తూ బ్రతకలేక 12 వ ఏట – ఒక దశలో మానసిక రోగిగా కూడా మారింది. తృళ్ళింతలతో ఉత్సాహకెరటంల ఎగసి పడవలసిన వయసులో ఆమె చదువు మానేసింది. సైకిలు మీద ఒంటరిగా తన దేశ పార్లమెంటు దగ్గరకు పోయి, ఆ రోజు సమావేశాలు జరిగే ఆరేడు గంటల పాటు మౌనవ్రత పోరాటం చేసింది. తొలిరోజామె ఏకాకే గాని, కొద్ది రోజులకే వందలు వేల మంది అనుసరించారు.

 

            112 దేశాల – 14 లక్షల మంది పిల్లలు ఆమె అడుగుజాడలో బడికిపోమని 2019 మార్చిలో సమ్మె చేశారు. మరి రెండు నెలలకే ఆ నిరసన చిచ్చు125 దేశాలకు అంటుకొన్నది.

 

            ఈ ధన బెర్గ్ మాట్లాడేదేమో తక్కువ ఆచరణే ఎక్కువ. లోహాల కోసం, క్రూడాయిల్ గ్యాస్ కోసం భూమిని త్రవ్వరాదనీ, విమాన ఇంధన కాలుష్యం భూగోళాన్ని ముంచెత్తున్నదనీ, అడవుల నరికివేత ఎన్నో అనర్ధాలు తెస్తున్నదనీ, కనపడిన ప్రతి ప్రకృతి వనరునూ సంపదలుగా మార్చవద్దనీ ఈ భూగోళం యొక్క హోమోసెపియన్ (మానవ) జాతి యొక్క ఆయుర్దాయాన్ని కుదించవద్దనీ ఈ బాలిక సందేశం! దేశదేశాలు తిరిగే ఒపేరా గాయని ఐన ఆమె తల్లినీ, రంగస్థల కళాకారుడైన తండ్రిని విమాన ప్రయాణాలు మాన్పించింది. పర్యావరణ రక్షణా సదస్సుకు హాజరైన వివిధ దేశాధిపతుల సమావేశానికి గాని, దావోస్ లో జరిగిన సదస్సుకు హాజరైన వాళ్ళలో గాని, విమానం ఎక్కక, రైలులో 32 గంటల ప్రయాణం చేసిన ప్రతినిధి గ్రేటా ఒక్కతే! ఆమె ఈ ఒక్క ఆచరణతో విమాన ప్రయాణాలు తగ్గి, స్వీడన్ లో రైలు ప్రయాణాలు 8% పెరిగాయట! రెండు సదస్సుల్లో ఆమె మాటలు, ప్రవర్తన, ధృడ మనోబలం, గమనించిన కొందరు ప్రతి నిధులకు ఆమెలో గాంధీ మహాత్ముని సూటి మాట, నిరాడంబరత, మానవాళి భవితవ్యం పట్ల పడే తపన స్పష్టంగా కనిపించాయట!

 

            ఆ వూపులో టైమ్పత్రిక ఆ నెలలో తన ముఖచిత్రంగా గ్రేటాను చూపింది. నార్వే దేశపు పార్లమెంటైతే ఈ 15 ఏళ్ల పాపకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తీర్మానించింది. గాంధీ మహాత్మునికి పద్మశ్రీ బిరుదూ స్టీఫెన్ హాకింగ్ కు సైన్స్ అవార్డూ, ధన్ బర్గ్ కు నోబెల్ బహుమతీ అవసరమా? అందుకు గాను ఆయా దేశాల వాళ్ళు సంబరాలు చేసుకొని ఊరేగి ఊరుకుంటే చాలా? సమస్త మానవాళి కోసం పరితపించే ఆ మహనీయుల ఆశయాలను సాధించుకోవడం గదా ఇప్పుడు కావలసింది?

 

            ప్రభావవంతమైన ఇటువంటి స్ఫూర్తి దాతల ప్రేరణతో ఎక్కడికక్కడ ఈ భూగోళమంత కాలుష్య వ్యతిరేక స్వచ్చోద్యమాలు కదా రావలసింది?       

 

- నల్లూరి రామారావు

చల్లపల్లి

24.07.2020.