మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7....

                                        మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7

ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి

“ విప్లవాలయుగం మనది- విప్లవిస్తె జయం మనదె..” అని మహోద్రేకంగా పాడుతూ ఉండేవాడు. అతని కవితలెంత వరకు యదార్థమో అతని స్వప్నాలెంతదాక ఋజువైనవో గాని... మన సమకాలం ముఖ్యంగా ఈ 21 వ శతాబ్దం ద్వితీయ దశకం మాత్రం సామాజిక పరిశీలకులకు

 “ స్వచ్చోద్యమ యుగం మనది- ఉద్యమిస్తె జయం మనది....” అనిపించక మానదు. అటు 2014 ఆగస్టు 15 తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు గాని, ఇటు చాలా రాష్ట్రాలలో ఎక్కడికక్కడ స్వచ్చంద సామాజిక శ్రమదాన సందడులు గాని పుట్టుకొచ్చిన దశాబ్దమది. వైయక్తికంగా కాక, ఒక సామాజిక- సామూహిక- సత్ప్రేరణ గా 2014 నవంబరు 12 నుండి- సుదీర్ఘ కాలం నిరాఘాటంగా - 2070 రోజుల పాటు ప్రజ్వరిల్లిన చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన ఉద్యమం గాని, దాని ప్రేరణలుగా, అనుకరణలుగా, 25-30 గ్రామాలలో పరిఢవిల్లిన ప్రజా ప్రయోజనకర ఉద్యమాలుగానీ ఇటీవలి చరిత్రే!

ఇవి కాక:

2015 అక్టోబరు 15 న ఒంగోలులో శిరసెత్తిన “ భూమి ఫౌండేషన్వారి శుభ్ర-సుందర ఉద్యమం కొంత భిన్నమైనది. ఒక 20 ఏళ్ల యువతి - తేజస్వి తన ఊరి గోడల- వీధుల- పార్కుల జుగుప్సాకర దృశ్యాలను చూసి, తన ఒంగోలు పట్టణ పరిశుభ్రత విషయంలో హిందూ పత్రికలో కించపరుస్తున్న వ్రాతల్ని చదివి, అవమానపడి, మథనపడి ప్రారంభించిన ఉద్యమం అది!  విద్యార్థులతోనూ, వివిధ రంగాల ఉద్యోగులతోనూ, శని ఆది వారాలలో సుదీర్ఘ కాలంగా జరిగిన ఒంగోలు పట్టణ స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ ప్రయత్నం అది! ఉదయం 5.00 కే 60-70 మంది “ భూమి ఫౌండేషన్ “ కార్యకర్తలు ముందుగా నిర్ణయించుకొన్న – ఊరిలో కెల్ల నికృష్ట ప్రదేశాన్ని చేరుకొని, నాలుగైదు గంటలలో దానిని  శుభ్రపరచి, రంగులద్ది, సమూలంగా మార్చివేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, చెరగని ముద్ర వేసే కార్యక్రమం అది!

తొలినాళ్లలో- తొలి ప్రయత్నాల వేళలో అన్ని ఉద్యమాలలాగే  అవహేళనలెదుర్కొని, అడుగడుగునా అకారణ ప్రతి బంధాలను తొలగించుకొని, మొక్కవోని పట్టుదలను నిలుపుకొని, ఆ అవహేళనకారులను – ఆ అకారణ అపహాస్య బ్రహ్మలను కూడ ఆకర్షించి, అక్కున చేర్చుకొని అప్రతిహతంగా పురోగమించిన “భూమి...... ఉద్యమం” అందరికీ స్ఫూర్తిదాయకం కాకపోతుందా?

ఆంధ్ర దేశంలోని 13 వేల,  భారతదేశంలోని 6 లక్షల ఊళ్లు స్వాగతించి, ఆచరించి, తరించదగిన ఉద్యమం!

- పది మందితో ఐదేళ్ల నాడు మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పుడు రెండు వేల మందికి పైగా వచ్చి చేరారు!

- ఒంగోలు లోని 100 కు పైగా వికృతమైన దారులు, పార్కులు, చోటులు ప్రస్తుతం కనువిందుచేసే కమనీయ దృశ్యాలు!

- భాగ్యనగరానికి కూడ విస్తరించిన “భూమి ఫౌండేషన్” తేజస్సు అక్కడి అసంఖ్యాక అనాకారి కూడళ్లను, జన సమ్మర్ద ప్రాంతాలను కూడ సుందరీకరిస్తూనే ఉన్నది.

- గత ప్రభుత్వ సమయంలో రెండేళ్లలోనే రెండు మార్లు స్వచ్చాంధ్ర అవార్డులు ఒంగోలు పట్టణానికి దక్కాయి!

- కాలక్రమాన తెలంగాణ ప్రభుత్వ ప్రశంసలకూఈ సంస్థ పాత్రమైంది.

- ఆ హిందూ పత్రికే స్వచ్చ సర్వేక్షణ్ ప్రకారం ఒంగోలుకు దేశమంతటిలో నాల్గవ స్థానమని ప్రచురించింది.

అన్నింటినీ మించి, గత ఏప్రిల్ మాసంలో – కరోనా కష్ట కాలంలో - తేజస్వి కుటుంబం తమిళ దేశ వలస కూలీలను వందలాది మంది ఆకలి తీర్చి, బ్రతికించడమే అత్యంత మానవీయ సన్నివేశం!

అందుచేత-దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికీ, పట్టణానికీ కనీసం ఒక యశస్వి ఐన తేజస్వి తప్పక ఉండాలనీ, ఆమె మనస్సులో తన ఊరి దుస్థితి పట్ల రోషం పొడుచుకురావాలనీ, ఆ బాధనుండి ఆయా గ్రామాల సమస్యలకు పరిష్కారాలు దొరకాలనీ కోరుకొందాం!   

అప్పటి దాకా ఎవరి జన్మ స్థలాల జుగుప్సాకర దృశ్యాలు వారి కంట పడినప్పుడు-

“ బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్!

ఆ ఎరుకే నిశ్చలానందమోయ్- బ్రహ్మానందమోయ్.....”

అనే 1953 నాటి  మల్లాది / సముద్రాల /దేవదాసు సినిమా పాటను (ఘంటసాల) గుర్తుచేసుకొందాం.

 - నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

చల్లపల్లి - 14.08.2020