2102* వ రోజు ....

 2102* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు.

 

వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా – ఈ మంగళవారం (12.01.2021) నాటి వేకువ 4.24కే – అదేదో శుభకార్య ముహూర్తమన్నట్లుగా తరిగోపుల ప్రాంగణానికి చేరుకున్న స్వచ్చోద్యమ కారులు రెండు గంటల సేపు శక్తి వంచన లేకుండ తమ గ్రామ ప్రయోజనకర చర్యలలో నిమగ్నమయ్యారు.

 

శ్మశాన అంతర్గత రహదారి వెంట, ముఖద్వారం దగ్గర, చల్లపల్లి దిశగా విజయవాడ బాటలోని బాలాజి భవన విభాగాల (అపార్ట్మెంట్స్) దాక ఈ 36 మందిసైన్య బలగం స్వచ్చ కార్యకలాపాలు విస్తరించాయి. దేశమంతా ప్రశాంత సుఖ నిద్ర చెందుతున్నప్పుడు సరిహద్దుల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో – కోట్లాది ప్రజల నిశ్చింతకు కారకులౌతూ సైన్యం కాపు కాస్తున్నట్లే – చల్లపల్లి కి చెందిన 30 వేల మంది హాయిగా శయనిస్తున్న వేకువ వేళలో వారి స్వచ్చ – శుభ్ర – స్వస్తతలకు పూచీపడుతూ 36 మంది స్వచ్చ కార్యకర్తలు పూర్తి బాధ్యత వహించారన్నమాట!

 

          ఇంత దట్టంగా పడుతున్న మంచుకు తోడైన చలి గాలిలో – శ్మశాన కర్మల భవనం దగ్గర చిక్కగా – ఒత్తుగా పెరిగిన పూల మొక్కల, చెట్ల క్రింద దీక్షగా ఆకులు ఊడ్చి, కలుపు తొలగించి, పాదులు సవరించి, శ్మశాన సంభరిత అందాలకు మరిన్ని మెరుగులు దిద్దుతున్న సుందరీకర్తలకు –

 

          బెజవాడ మార్గంలోని డ్రైనుల – గట్టుల గడ్డిని, పిచ్చి – ముళ్ల మొక్కల్ని, ప్లాస్టిక్ తుక్కును తలదీపాల (హెడ్ లైట్స్) వెలుతురులో తొలగిస్తూ పాటుబడుతున్న శ్రమదాతలకు -  

 

దారి ప్రక్కల గతంలో తామే నారుపోసి, నీరుపోసి, పాదులు చేసి, పెంచిన వందలాది మొక్కల, పూల తీగల, చెట్ల అనుచిత శాఖల్ని – కరెంటు స్తంభాల కృషికి సంతృప్తి చెందుతున్న ఆదర్శ ఉద్యమకారులకు –

 

          ఈ గ్రామస్తులు ఎన్ని మార్లు ధన్వవాదాలు తెలపవలసి ఉన్నదో మరి!

 

          అంత చీకట్లో – వాహన రద్దీల నడుమ డ్రైను మట్టిని ట్రాక్టర్ లో నింపి, సుందరీకరణకో – రహదారి భద్రతకో వినియోగిస్తూ – తాము చేసేది అసలు శ్రమేకాదన్నట్లుగా – అలవోకగా వేల దినాలుగా ప్రయత్నిస్తున్న రెస్క్యూ టీముదే ధన్యత!

 

          ఈ ఉదయం 6.45 సమయంలో కాఫీల కబుర్ల కాలక్షేపం వేళ నిబ్బరంగా గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందరోద్యమ సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించిన వారు హీరో షోరూమ్ అధిపతి దాసరి శ్రీనివాసరావు. కార్యకర్తల కృషిని, పట్టుదలను అభినందించి, సమీక్షించిన వారు మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీ దాసరి రామకృష్ణ ప్రసాదు!

 

రేపటి మన పునః సమాగమ ప్రదేశం కూడ ఈ చిల్లలవాగు దగ్గరి తరిగోపుల ప్రాంగణమే! రేపు భోగి వేడుకల నిర్వహణము, ప్రజాప్రతినిధి (MLA) శ్రీ సింహాద్రి రమేష్ గారు సపరివారంగా 5.30 కే వచ్చి, శ్మశానమందలి స్వచ్చ సుందర మూత్రశాలల, టాయిలెట్ల ప్రారంభోత్సవం చేస్తున్నందువల్లను – కార్యకర్తలందరం ఏకరూప స్వచ్చోద్యమ బట్టలతో 4.30 కే కలుసుకొందాం. అక్కడి కార్యక్రమ సన్నాహాలు చూసుకొందాం. మరెక్కడైనా ఈ విడ్డూరం ఉందో లేదో గాని – రేపటి భోగి మంటల, ఇతర పండగ వేడుకలను శ్మశానం అనబడే ఈ స్వచ్చ – సుందర ప్రదేశంలో నిర్వహించుకొందాం!

 

              నీవు సైతం – నేను సైతం.

అనాలోచిత – దురాలోచిత – ఆభిజాత్యపుట హంకృతులూ

స్వార్ధపూరిత – భోగలాలాస – ప్రయాసలతో ప్రయాణాలూ

మానుకొంటే – ఊరి మేలుకు పూనుకొంటే నీవు సైతం

అనుసరింతువు – ఆదరింతువు – స్వచ్చ సంస్కృతి సంప్రదాయం!    

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

12.01.2021.