2103* వ రోజు ....

 స్వచ్చ- సుందర- చల్లపల్లి ఉంద్యమంలో 2103* వ నాటి మరొక ముఖ్య ఘట్టం.

 

ఈ బుధవారం(13.01.2021) నాటి వేకువ సమయంలో చలి, మంచుల్లో మార్పులేదు; స్వచ్చ కార్యకర్తల ఉత్సాహంలో, క్రమ శిక్షణ లోనూ మార్పులేదు; వారి సమయపాలనలోను ఏ మార్పు లేదు గాని, పని స్వభావంలో మార్పు వచ్చింది! ఈ ఒక్క రోజు మాత్రం కత్తుల- దంతెల – పారల- పలుగుల- చీపుళ్ల బాధ్యతలు కాక ఒక ఆట విడుపుగానూ, ఒక సందేశాత్మక భోగి వేడుకల నిర్వహణ గాను, ప్రముఖుల శ్మశాన సందర్శనానుభూతి గాను మారింది!

 

వేకువ 4.00 తరువాత తరిగోపుల ప్రాంగణానికి చేరుకున్న మహిళా కార్యకర్తలు అసలే అందంగా ఉన్న ఆ చోటులో  రంగుల రంగవల్లులతో, భోగి మంటలకు ఏర్పాట్లతో, సాంప్రదాయక చెరుకు గడలతో, సంక్రాంతి శోభను సాక్షాత్కరింపజేశారు.

 

చల్లపల్లి స్వచ్చోద్యమ పాటగాడు/వ్రాతగాడు సందేశాత్మక గీతాలాపనతో ఉత్తేజపరుస్తుండగానే ముఖ్య అతిథి-శాసన సభ్యుడు శ్రీ సింహాద్రి రమేష్ గారు రావడం, భోగి మంటనుపెట్టడం, అందరి ఉత్సాహం ఇనుమడించడం జరిగిపోయినవి.

 

5.45 కు M.L.A గారు దహన వాటిక ప్రక్కన అత్యధిక వ్యయ ప్రయాసలతో- దాసరి రామ్మోహన రావు గారి కుటుంబ సభ్యులచే నిర్మితమైన స్వచ్చ-సుందర-టాయిలెట్లను ఆవిష్కరించారు.

 

సుమ సుందర కర్మల భవనం ఎదుట- సుమారు 130 మంది స్వచ్చ- సౌందర్య అభిమానుల సమక్షంలో 40 నిముషాల పాటు జరిగిన సమావేశంలో డాక్టర్ పద్మావతి గారు చల్లపల్లి స్వచ్చ-సుందర- అద్భుత శ్మశాన, దహన వాటికల, చెత్త సంపద కేంద్రాల నిర్మాణం గురించి, వరప్రసాద్ రెడ్డి-గురవారెడ్డి తదితర దాతల, కార్యకర్తల దాతృతనూ, శ్రమదాతృతను గురించి సవివరంగా-సుదీర్ఘంగా ప్రస్తావించారు. ఆమె ప్రస్తావనలను కార్యకర్తలంతా చప్పట్లతోను, ఒక దశలో ఉద్వేగంగాను విన్నారు.

 

మన సమకాలంలో కని-విని ఎరుగని చల్లపల్లి స్వచ్చోద్యమ రథసారథి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు  అసలీ స్వచ్చ ఉద్యమ ఆవశ్యకత ఏమిటో-కార్యాచరణమెలాగో, స్వానుభవ పూర్వకంగా వివరించి, రాజకీయుల, వివిధ సంఘాల సహకారాన్ని ప్రస్తుతించి, 2103* రోజుల స్వచ్చ కార్యకర్తల నిస్వార్థ గ్రామ మెరుగుదల కృషిని ప్రస్తుతించి, ఊరి స్వచ్చ-శుభ్ర-సుందర భవిత కోసం మరికొన్ని మెలకువలను సూచించారు.  

 

ఈనాటి మన శాసన సభ్యునిది రాజకీయ ప్రసంగం కాదు! అత్యావశ్యకమైన చల్లపల్లి స్వచోద్యమమూ, ఇంత అంకితభావంతో – ఇంత సుదీర్ఘంగా – క్రమశిక్షణగా ఇందరు కార్యకర్తల నిత్య శ్రమదానమూ, చల్లపల్లిని సమూలంగా మారుస్తున్న స్వచ్చ సేవకుల ఏడేళ్ళ కృషి ఫలితమూ – ఇవన్నీ తన మనసు మీద ఎంతగా ప్రభావం కలిగించాయో సోదాహరణంగా వివరించారు. సింహాద్రి రమేష్ గారి సహర్షమైన, ఆర్ద్రమైన మాటలు శ్రోతల మీద బాగా పనిచేశాయి!

 

మొత్తం మీద అటు సంప్రదాయాన్నీ కాదనక-నేటి సమాజానికవసరమైన కొత్త ఆలోచనల- ఆచరణల మేళవింపుగా నే కుదిరిన ఈనాటి భోగి వేడుకల నిర్వహణం- అదీ సూర్యోదయాత్పూర్వమే-రుద్రభూమిలో-విజయవంతంగా 7.00 వరకు కొనసాగింది.

 

ఇదే వరుసలో నాలుగురైదుగురు చిన్నారులకు భోగి పళ్ల ముచ్చట కూడా జరిపించారు.

 

ముగ్గురు స్వచ్చ కార్యకర్తలు – అహ్మద్ బాషా గారు 10,000/-లను, గోళ్ల విజయ కృష్ణ గారు 2000/-లను, మరొక అజ్ఞాత మహిళా కార్యకర్త 1816/-ను, గుత్తికొండ కోటేశ్వర రావు గారు 2120/- లను విరాళాలుగా సమర్పించారు.

 

రేపటి మన బాధ్యతలు కూడ వేకువనే- 4.30 కే  విజయవాడ రోడ్డు లో నిర్వహించుకుందాం. శ్మశాన స్థలంలో కలుసుకుందాం!

 

              ఆ మూల సూత్రమె మహాదర్శం!

శ్రమే ఉద్యమ మూలస్తంభం-శ్రమ విరాళమె మూల సూత్రం

ధనం-కీర్తి-పదవిలాలస త్యాగ గుణమే ప్రధమ సూత్రం

జనం ఇంతగ చొరవ చూపుట-సహకరించుటె అద్భుతం

రెండువేల దినాల స్వచ్చోద్యమం జగతికి మహాదర్శం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

13.01.2021.