2106* వ రోజు ....

 స్వచ్చోద్యమ సుందర చల్లపల్లిలో 2106* వ నాటి నిలువెత్తు స్ఫూర్తి.

 

ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన శ్రమదాతలు 44 మంది. వీరిలో 21 మంది తొలి వాట్సాప్ ఛాయా చిత్రంలో ఉంటే - కొన్ని నిముషాల వ్యవధిలో మిగిలిన బాధ్యులు  తోడయ్యారు. వీరు కాక 6.30 తరువాత అవనిగడ్డ నుండి విలక్షణ రాజకీయవేత్త (సింహాద్రి రమేష్ గారు), తదనుచరులు ఏడెనిమిది మంది కూడ కలిశారు.

 

4.35 సమయంలోని తొలి ఛాయా చిత్రంలో చల్లపల్లి స్వచ్ఛ సైనికులు కాక - విజయవాడ నుండి విచ్చేసిన - ఆవారా కు చెందిన ఒక నిలువెత్తు సామాజిక స్ఫూర్తి మత్వాన్ని, బీహార్ రాష్ట్రానికి చెందిన పాతికేళ్ళ కుర్ర స్ఫూర్తిదాయకుడినీ, (కొద్ది రోజుల క్రితం ప్రమాదం జరిగి) ఊత కర్రలతో మధ్యలో నిలిచిన మహిళా స్ఫూర్తిని, 11-12 ఏళ్ల బాలికా చైతన్య స్ఫూర్తిని కూడ గమనించండి.

 

చల్లపల్లి లోని పాతిక వేల మంది జనం ఇంకా నిద్రించే సమయాన - పైన చెప్పిన వాళ్ళు అంత దూరం నుండి వచ్చి, గ్రామస్తుల బాధ్యతలు స్వీకరించడమే కాలవైచిత్రి కాబోలు! కేవలం ఏడెనిమిదేళ్ళ ప్రాయానిదేకావచ్చు - ఈ స్వచ్చోద్యమం వేల సంవత్సరాల గతం ఉన్న చల్లపల్లి మీద చెరగని ముద్ర వేసి, మార్చి తీరుతుందనే ప్రగాఢ విశ్వాసం నాకున్నది.

 

వారాంత వృత్తి పనుల విరామ కారణమేమో గాని, ఈ వేకువ నిన్నటి కన్న హెచ్చు సంఖ్యలో స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొన్నారు - లయన్స్, మెకానిక్స్, ధ్యానజీవులు, గృహిణులు, రైతులు వీరిలో ఉన్నారు. బెజవాడ దారికి అందరూ పడమటి దిక్కు డ్రైనులోనే శ్రమించారు. కత్తుల నరుకుడుల రాపిళ్ళు, దంతెల గరగర చప్పుళ్ళు, చీపుళ్ళ పరపరలు - నడుమ నడుమ స్వచ్ఛ కృషీ సంబంధిత ఛలోక్తులు, పనిలో వేగవంతం కోసం ఒకరిద్దరి అరుపులు, చీకట్లో దారి మీద వచ్చి – పోయే వాహనాల మ్రోతలు - ఇదంతా 2 గంటల పాటు ఒక ప్రత్యేక ప్రపంచం! ఈ గ్రామస్తులకు, దేశస్తులకుతరగని స్ఫూర్తి నింపగల స్వచ్చోద్యమ ప్రపంచం!! ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకొని, కనీసం 5 - 10 శాతం ప్రజలు వచ్చి చేరితే చాలు ఈ గ్రామాన్ని - రాష్ట్రాన్ని అనారోగ్యం నుండి, అపరిశుభ్రత నుండి, అస్తవ్యస్తత నుండి బైట పడేయగల అద్భుత స్ఫూర్తిదాయక ప్రపంచం!!!

 

ఈరోజున ఒక సంఘటన - కొద్ది రోజుల నాడు బైకు ప్రమాదంలో కాలికి దెబ్బ తగిలిన ఒక సీనియర్ కార్యకర్త మురుగు గుంటను  శుభ్రపరుస్తూ అమాంతం అందులో పడి లేవడం! (ఇలాంటివి అతగాడెన్నో చూసి ఉంటాడు.)

 

6.30 పిదప నేటి నినాద - సమావేశంలో డాక్టర్ కాట్రగడ్డ అజయ్ గారి చెణుకులతో గూడిన ప్రసంగాన్ని జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” లో వీడియోలో వినండి. గోళ్ళ వేంకటరత్నం గారు ముమ్మారు ప్రకటించిన చల్లపల్లి స్వచ్ఛ - శుభ్ర - సుందర సంకల్ప నినాదాలనూ, అందుకు కార్యకర్తల స్పందననూ, ఆ క్షణాలలో ఈ దీక్షాపరుల ఉత్సాహ ఉద్వేగాలను కూడ అజయ్ గారు పసికట్టి, ప్రస్తావించి, ప్రస్తుతించారు. ఈ 50 మంది స్వచ్ఛ కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏ వ్యాయామశాల అక్కరలేదనీ, సమాజ శ్రేయస్సు కోసం కలిసి వేకువనే పాటుబడడమే వాళ్ళకొక పెద్ద జిమ్ అనీ, వాళ్ళకందుకే కరోనా భయాలక్కరలేదనీ భరోసాయిచ్చారు.

 

రేపటి మన స్వచ్చంద శ్రమదాన సందడి కూడ బాలాజి అపార్ట్ మెంట్ పరిసరాలలోనే ఉంటుంది. పునర్దర్శనం వేకువ 4.30 కు.

 

           బాధ్యతా పరిపూర్తి చేసిన...

ఎవరు ఊరికి శ్రమించితిరో - ఎంత దీక్షగ గమించితిరో

ఎంత నిష్కల్మషంగా గత రెండు వేల దినాలుగా - స

ర్వాత్మనా మా చల్లపల్లికి బాధ్యతలు పరిపూర్తి చేసిరొ

వా - రందరికి మా వందనమ్ములు - స్వచ్ఛ సుందర చందనమ్ములు!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

16.01.2021.