2109* వ రోజు....

జయహో చల్లపల్లి స్వచ్ఛ సైన్యం - 2109* వ నాటి స్మరణీయ శ్రమదానం.

 

ఇది గురువారం - 21.01.2021! ఈ‌ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసుపత్రి దాక జరిగిన దారి శుభ్రత. నిన్నటి, నేటి డజను మంది మొండి పట్టుదలతో కాల్వగట్టు - కార్యకర్తల అంచనా మేరకు సురక్షితమైన ఉద్యానవనానికి సిద్ధమైనది.

 

గుడ్లు పెట్టె కోడి బాధ తినేవాడికి తెలియదు. 2109 రోజులుగా గ్రామ స్వచ్ఛ – స్వస్తతా బాధ్యతల బరువు మోసే కార్యకర్తల శ్రమ విలువ ఊరి పట్ల నిర్లక్ష్యంగా - నిర్మమకారంగా వ్యవహరించే – కర్తవ్యాన్ని కాక, హక్కుల్నే కోరుకునే కొందరు గ్రామస్తులకూ తెలియడం లేదు! ఇంత పెద్ద గ్రామంలో - ఇన్ని విశాలమైన రోడ్లు - ఇన్ని నాళ్ళుగా, ఇన్నేళ్లుగా - ఇంత శుభ్రంగాను, స్వచ్ఛ సుందరంగాను, సౌకర్యం గాను ఎలా ఉంటున్నాయి? అందుకోసం పంచాయతీ పారిశుధ్య కార్మికులు, మనకోసం మనం ట్రస్టు ఉద్యోగులు - వీరు కాక వందలాది స్వచ్ఛ సైనికులు ఎంతగా ప్రయత్నిస్తే - తపిస్తే - ఏకాగ్రత చూపితే ఈ పాటి ఆహ్లాదం, ఆరోగ్యం మనకు అమరుతున్నాయి? ... ఇలాంటి తర్కం, అభినివేశం, బాధ్యత కొంతైనా లేనప్పుడు మనం వట్టి గ్రామస్తులమే ఔతాం గాని, గ్రామ పౌరులంకాలేము!

 

ఒకరోజు ఆలస్యమైతేనేం – స్వచ్ఛ కార్యకర్తలు తాము అనుకొన్న విధంగా ఈ రోజుతో 6 వ నంబరు కాలువ గట్టును ఉద్యానంగా మార్చగలుగుతున్నారు. బందరు రహదారిలో సుమారు 300 గజాల మేర స్వచ్ఛ శుభ్రతలు నెలకొల్పారు. నేటి సాయంత్రానికి కాలువ గట్టు మీద రహదారి తోట ఇనుప స్తంభాలతో, ఇనుప వలలతో రక్షణాత్మకంగా తయారౌతుంది. అక్కడ ఇక ముందు క్రొత్త ఆక్రమణలు గాని, ప్లాస్టిక్ తుక్కుల విరచిమ్ముడు గాని లేకుంటే చాలు!

 

6.30 సమయంలో కాఫీల ఆస్వాదనల పిమ్మట కార్యకర్తలకు బిస్కట్ పొట్లాల పంపకం చేసిన వారు 77 ఏళ్ల ఉడత్తు రామారావు గారు. కార్యకర్తలకు రోజుటి వలెనే యధాప్రకారం నిమ్మకాయల వితరణ కూడ జరిగింది. దీక్ష గాను, దృఢం గాను చల్లపల్లి స్వచ్చోద్యమ సంకల్ప నినాదాలను ప్రవచించిన వారు BSNL అనే పౌరుషనామం కల గౌరుశెట్టి నరసింహారావు గారు.

 

దైనందిన స్వచ్ఛ శ్రమదాన సమీక్షను డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు నిర్వహించే సమయంలో - చాల రోజులుగా స్వచ్ఛ కృషి ఎడబాటుతో గ్రామ ప్రధాన కేంద్రం కార్యకర్తల రాకకు ఎదురు చూస్తున్నదని ఆలోచించి – రేపు ఒక్క నాడు మాత్రం 3 రోడ్ల ప్రధాన కూడలి దగ్గర మన శ్రమదానం ఉండాలనీ, తదుపరి రెండు దినాలు మళ్ళీ విజయవాడ మార్గాన్ని శుభ్రపరచాలనీ నిర్ణయించడమైనది.

 

కనుక రేపటి మన పరస్పర పునర్దర్శనం కోసం 4.30 కు గ్రామ ముఖ్య కూడలిలోనే!

 

           అలమటించిన అంతరంగం

 

నయరీతి వివరించి – ప్రియ వాక్యములు పల్కి/

     జయ వాచకము చెప్పి చల్లపల్లి

          సంక్షోభమును బాపి – సంక్షేమమును చూపి/

               స్వచ్ఛ సంస్కృతి నెంతొ సంతరించి

                     రెండు వేల దినాల పండు వెన్నెల కాసి

                          గ్రామ స్వస్తత సదాకాంక్ష చేసి

                                 ధన్యజీవనులైన – త్యాగ పావనులైన

                                           - స్వచ్ఛ సుందర కార్యకర్తలిపుడు

 

దారుణ కరోన కల్లోల కారణమున –

నిష్క్రియా పరులైనట్టి నిజమెరింగి

నేటి స్వగ్రామ దుర్గతిని పుడుగాంచి –

అస్మదీయాం తరంగంబు అలమటించు!

(31.07.2020)

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

21.01.2021.