2110* వ రోజు ....

 2110* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలోని అకుంఠిత గ్రామ సేవలు.

 

ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన కూడలి.

 

నెమ్మదిగా – క్రమంగా – పట్టణీకరణ బాట పట్టిన ఈ ప్రాచీన చల్లపల్లి గ్రామమంతటికీ ఈ చోటే ప్రధాన కేంద్రం. క్రిక్కిరిసిన పలువిధాల దుకాణాలలో – తోపుడు బళ్ళతో - ద్విచక్ర వాహన విక్రయ మరమత్తుల కొట్లతో – ఈ అన్నిటి మూలంగా ఊరిలో నుండి, బైట నుండి వచ్చి పోయే ఏడెనిమిది వేల మంది జనంతో – బస్సులతో, లారీలతో, కార్లతో – ముఖ్యంగా బాధ్యతలు గుర్తించని కొందరు గ్రామస్తులతో నానాటికీ రద్దీగాను, గంట గంటకీ కశ్మల మయం గాను మారే ముఖ్య కూడలి ఇదే!

 

అందుకే పాతిక మంది స్వచ్ఛ కార్యకర్తలు వేకువ 4.14 నుండి రెండు గంటల పాటు పొరాడితే గాని – సూర్యోదయ సమయానికి గాని ఈ ప్రాంతం స్వచ్ఛ - సుందర చల్లపల్లి అనే పేరును సార్ధకం చేసుకోగలిగింది! డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాదు గారు పెట్టిన - కార్యకర్తల కృషికి ముందరి, తరువాతి వాట్సాప్ ఛాయా చిత్రాలను గమనించండి. ఈ 25 మంది పెద్దల – పిన్నల – మహిళామతల్లుల నిస్వార్ధ గ్రామ మెరుగుదల దైనందిన శ్రమ విలువ ఏ పాటిదో తెలిసి వస్తుంది!

 

గ్రామ ప్రజలు కొందరు ఇది వరకటి వలె ఈ స్వచ్చంద శ్రమ కారుల్ని వెర్రి వాళ్ళనో, ఆర్భాటంగాళ్లనో, కొత్తరకం వ్యసనపరులనో ఇప్పుడు జమ కట్టడం లేదు గాని, గౌరవిస్తున్నమాట నిజమే గాని, ఊరి జనంలో 100 శాతం మందిలో గాఢంగా ఇప్పటికే నాటుకుపోవలసిన స్వచ్ఛ సంస్కృతి సంగతేమిటి? జరిగి తీరవలసిన పారిశుధ్య పరమైన సమూల పరివర్తన ఏది? తమ కళ్ల ముందే స్వచ్ఛ కార్యకర్తలు తమ దుకాణాల ముందు పట్టి పట్టి శుభ్రపరుస్తుంటే సదరు దుకాణదారుల్లో కొందరి సముచిత ప్రతి స్పందన, స్వచ్ఛ – శుభ్ర కార్యక్రమంలో పాలుపంచుకొనే తత్త్వం ఏవి?

 

          ముఖ్య కూడలికి ఇరు దిశలా – తూర్పున ఇంధన నిలయం (బంకు), దక్షిణాన అవనిగడ్డ మార్గంలో కొంత భాగంలో - ఇటీవల శుభ్రపరచడం ఆలస్యమైన కారణంగా పేరుకుపోయిన దుమ్ము, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, పూల – పండ్ల అవశేషాలు, టీ కొట్ల ముందరి ఎంగిలి కప్పులూ, ఇసుక లారీల, ఇతర వాహనాల వ్యర్ధాలు, సిగరెట్ – బీడీ పీకలూ, ఖాళీ సీసాలు – ఒకటేమిటి – అన్నిటికీ ఈ పాతిక మంది స్వచ్ఛ కార్యకర్తలే తగు సమాధానం చెప్పారు. గత నెల రోజుల ఈ రహదార్లకు తమ శుభ్ర సేవల అప్పు తీర్చేశారు. (మిగిలిన గ్రామస్తులం మనం సైతం మన గ్రామ ఋణ విముక్తులం కావడమే ఇక మిగిలిపోయిందని సవినయ సంప్రార్ధనం!)

 

కాఫీ ఆస్వాదనం – నేటి కృషి  సమీక్షా సమయంలో 6.20 నిముషాలకు – ఒక వంక శివబాబు గారి చేతుల మీదుగా విజయవాడ కు చెందిన ఒక దాత కొండేటి గాంధీ గారు కార్యకర్తలందరికీ రసాయన రహిత కూర అరటికాయల, మరొకరిచే నిమ్మకాయల పంపకం మరో వంక జరిగిపోయినవి.

 

రేపటి మన గ్రామ బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నది - విజయవాడ దారిలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన దాటిన తరువాత గల కార్ల షెడ్డు ప్రాంతం. వేకువ 4.30 కే మన రేపటి పరస్పర పునర్దర్శనం.

 

           ఆహ్లాదాల శ్రీకారం.  

స్వచ్చోద్యమ చల్లపల్లి చరితార్ధత ఎట్టిదనగ...

సామాజిక ఋణం తీర్చు సాహసమే పునాదిగా...

సొంత కాళ్లపై నిలబడు స్వయం సమృద్ధ గ్రామానికి

ఆరోగ్యపు – ఆనందపు – ఆహ్లాదపు శ్రీకారం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

22.01.2021.