2133* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

 స్వచ్ఛ సంచిత చల్లపల్లిలో 2133* వ నాటి శ్రమదానం.

 

ఈ బుధవారం (24.02.2021) వేకువ 4.22 కే మొదలై 6.20 దాక ప్రవర్ధిల్లిన గ్రామ ప్రయోజనకర శ్రమదానంలో భాగస్తులైన ధన్యులు 27 మంది. నేటి పరిశుభ్ర – సుందరీకృత భాగం కూడ గత కొద్ది నాళ్ళ వలెనే విజయవాడ బాటలోని 3 రోడ్ల – రెవెన్యూ కార్యాలయాల ప్రాంతమే! కార్యకర్తల పట్టుదలలో గాని, నానాజాతి కశ్మలాలను అందరూ నడిచే అందమైన దారి పైన పడవేసే కొందరి బాధ్యతా రాహిత్యంలో గాని, స్వచ్చోద్యమ దినచర్యలో గాని, ఏ మార్పు లేదు! వాతావరణం మాత్రం చప్పున మారిపోయి, గత కొన్ని దినాలుగా లేని దట్టమైన మంచు క్రమ్ముకొచ్చి, పది అడుగుల దూరంలోని వస్తువులు, వాహనాలు కూడ కనపడని గందరగోళంలోనే – ప్రయాణికులు ఎవరికి వారు బొత్తిగా సహనరహితులై – హారన్లు మ్రోగిస్తూ – గబగబా సాగిపోయే ఒత్తిళ్ళ నడుమనే నేటి స్వచ్చంద శ్రమదాన బాధ్యతలు!

 

- యధా ప్రకారమే రెవెన్యూ కార్యాలయాల ముందు దిష్టిపిడతల్లా నాలుగు నెలల నుండీ పడి ఉండి – ఎండిపోయిన డ్రైను మట్టి దిబ్బలు రెండిటి పని బట్టిన 16 మంది అభినందనీయులు.  పలుగు – పారలతో త్రవ్వకాలు జరిపి, గడ్డల్ని పగలగొట్టి, డ్రైనులోని చెప్పరాని కశ్మలాలను విడగొట్టి, డిప్పలతో రెండు ట్రాక్టర్లు నింపుకొని, చల్లపల్లికే ప్రత్యేకమైన శ్మశాన అవసరాలను తీర్చడానికి రెండు గంటలు శ్రమించడమంటే మాటలా? మనిషికి ఐదారు వందలు ఇచ్చినా – ఇంత శ్రద్ధగా పని జరుగుతుందా!

 

- మట్టి మేటలు తొలగించిన మేర ఎత్తుపల్లాలను సరిజేసి, రోడ్డుదరిపల్లాలను సవరించి, రక్షణ కల్పించే, ఆయా స్థలాలను అద్దాలుగా మారుస్తున్న సుందరీకర్తల శ్రమకు ఫలితమేది? నిన్నటి స్వచ్ఛ – సుందర జాగాలో రాత్రికి రాత్రే వెలసిన పెద్ద (అగ్ని పండుగల) ఫ్లెక్సీ సంగతేమిటి?

 

- ఆదివారం నాటి చేపల – టిఫిన్ బళ్ళ – టీ కప్పుల – టిఫిన్ పళ్ళాల వంటివి నిన్న మహిళా కార్యకర్తలు ఊడ్చి, శుభ్రపరచిన – RTC ప్రయాణికుల అందమైన ప్రాంగణంలో ఇప్పుడు తెలవారే సమయానికి కల్లా మందు వీరులు త్రాగి వదలిన ఖాళీ సారా సీసాలు, తిని పడవేసిన అనుపానాల పొట్లాలు, సిగిరెట్ల – బీడీల పీకలు!

 

చల్లపల్లి జన హృదయాల్లో – అందరిలో – పూర్తి మార్పు వస్తే – ఈ స్వచ్ఛ సైనికులు డిసెంబరు 2013 లగాయతూ ఏడేళ్లుగా శ్రమించే అవసరమే ఉండకపోను! “ఇది నా గ్రామం – దీన్ని మురుగు – ధూళి – దూసర రహితంగా, హరిత – స్వచ్ఛ – శుభ్ర – సుందరంగా ఉంచుకొంటేనే 25 వేల మందికి సంక్షేమం...” అని సోదర గ్రామస్తులంతా గుర్తుంచుకొనే శుభదినం ఎప్పుడు వస్తుందో!

 

వయసుతో సంబంధం లేని ఉత్సాహ వంతుడైన ఒక కార్యకర్త – సబ్బినేని బోసు గారు బాగానే ముమ్మారు పలికిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర - సుందర సంకల్ప నినాదాలతో 6.40 కి నేటి స్వచ్ఛప్రయత్నం ముగిసింది.

 

రెవెన్యూ కార్యాలయాల – బైపాస్ ముఖ ద్వారం దగ్గర శేషించిన మరికొన్ని పనుల కోసం రేపు ఉదయం 4.30 కే మనం బెజవాడ దారిలోని బంకు వద్ద కలుసుకోవలసి ఉన్నది!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 2

అసంఖ్యాక పుష్పభరిత అత్యద్భుత ఆరామం

చూపు త్రిప్పుకోనీయని సుమ సుందర వైభవం

భావుక ఛాయాచిత్ర విభాసిత సుమ ప్రాంగణం

ప్రతి నిత్యం పరిరక్షక బాధ్యుల సంసేవితం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

24.02.2021.