2135* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం! 

గ్రామ మెరుగుదల కృషిలో స్వచ్ఛ సైన్యం - 2135* వ నాటి ప్రత్యేకతలు.  

 

ఈ శుక్రవారం (26.02.2021) వేకువ 4.24 కే ఊరి ఉమ్మడి మేలు కోసం ఆతృతతో సంసిద్ధులై పోయిన డజను మందికి పైగా స్వచ్చంద శ్రమదాతల్ని గమనించారా? వీరు కాక మరో 2 – 3 నిముషాలకే కార్యక్షేత్రానికి చేరుకొన్న అంతే మంది – వెరసి పాతికమంది పరోపకార కర్మిష్టులు చకచకా చేతొడుగులుతాల్చి, కొడవళ్ళు, దంతెలు, డిప్పలు వంటి కశ్మల మారణాయుధాలు ధరించి, బెజవాడ బాట ప్రక్క నిర్వహించిన స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణల్ని వాట్సాప్ మాధ్యమ చిత్రాలలోను, దృశ్య శ్రవణా (వీడియో) లలోను కనుగొనగలరు!

 

        ఈనాటి శ్రమదాన సంరంభం కోసం స్వచ్చోద్యమ కారుల్ని ఆహ్వానించింది సువిశాలమైన  NTR పార్కు! (అతగాడేమో భారతదేశంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడూ, గత ముఖ్యమంత్రీ!) సమాజమే దేవాలయమనీ, సామాజికులే దైవాలనే ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నం చేసిన NTR పేరిట ఒక సర్వజన ప్రయోజనకరమైన చోట రెండు గంటల పాటు చల్లపల్లిని స్వచ్ఛ – పరిశుభ్ర – సుందరంగా తీర్చిదిద్దే ఒక మంచి పనిలో స్వచ్ఛ సైనికులిలా శ్రమించడం సముచితంగా లేదూ!

 

ఈ పార్కులో నేటి ప్రయత్నం రెండు విధాలుగా ఉన్నది :

 

- దుబ్బులుగా, కళావిహీనంగా, కొంత ఎండుతూ ఉన్న పసరిక (లాన్) ను తొలగించి, పనిలో పనిగా అందలి ప్లాస్టిక్ సంచుల్నీ, నీళ్ళ సీసాలనూ ఏరడం. ఇందు కోసం కార్యకర్తలు నేల మీదే చతికిలబడి కూర్చొని ముందుకు జరుగుతూ, కొడవళ్ళతో గడ్డినీ – కలుపునూ కోస్తూ  - 15 మంది తదేకంగా పనిచేస్తుండగా – నలుగురు ఆ గడ్డి మేటల్ని ట్రాక్టర్ లో నింపడం! వీళ్ళకు తలా ఒక చాక్లెట్టు, మంచి నీరు మరొకరు అందించడం.... ఇది కాదా పరోపకార శ్రమజీవన సౌందర్యమంటే?

 

- పార్కులో నడక దారి తూర్పు వైపున ఆరేడుగురి ముఠా కత్తులు ఝుళిపిస్తూ – పనికిరాని పిచ్చి మొక్కల్ని, ఎండు గడ్డినీ, ప్రహరీ వెలుపల్నుండే పార్కులోకి పెరిగిన ఈత చెట్లనూ నరుకుతూ, సదరు తుక్కును దంతెలతో లాగి గుట్టలు చేయడం, మరొకరు వాటిని దూరంగా ఉన్న ట్రాక్టర్ లోకి తట్టలతో రవాణా చేయడం! స్వచ్ఛ కార్యకర్తలు సరే – వాళ్ళు వేల దినాలుగా ఈ బరువు పనుల కలవాటు పడి, ఈ రకమైన వ్యసనానికి అతుక్కుపోయారు; కొత్తవాళ్లు ఒక్క మారు కనీసం అరగంట పాటు ప్రయత్నించి చూస్తే గాని – ఆ శ్రమదాన మేమిటో – అందలి మజా ఏమిటో – అదెంతగా ఆరోగ్యదాయకమో – ఆత్మ సంతృప్తికరమో – తెలిసివస్తుంది!

 

- పార్కు ఒక మూలన ఇద్దరు కార్యకర్తల్ని గమనిద్దునుగదా – వాళ్ళు కత్తులతో కొబ్బరి చెట్ల ఎండు మట్టల్ని తొలగిస్తూ, ఆ చెట్లు పార్కులో ఉదయపు నడక వారికి ఎంతగా అందంగా కనిపించాలో – అంతగా శ్రమిస్తున్నారు!

 

గ్రామ పంచాయితి 12 వ, నాల్గవ వార్డు సభ్యులు (వీరిలో చివరి వారు ఊరి ఉపసర్పంచ్ గానీ గాక – చల్లపల్లికి తలమానికమైన – చాల ఊళ్ళకు ఆదర్శమైన NTR పార్కు మూలకారకుల్లో ముఖ్యుడు!) నేటి స్వచ్చంద శ్రమదానంలో పాల్గొనడమూ, 6.40 సమయంలో ముమ్మార్లు ఈ ముమ్మనేని నాని ప్రవచిత గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్పాన్ని నినాదాలుగా వినిపించడమూ విశేషం.

 

మిగిలిన అన్ని వార్డుల సభ్యులు కూడ వీలైతే సకుటుంబంగా ఇలా వచ్చి, గ్రామ మెరుగుదల కృషికి సంఘీభావం తెలిపి, పాల్గొంటే అది ఊరంతా స్వచ్ఛ – పచ్చ తోరణానికి, స్వచ్ఛ కార్యకర్తల మరింత మనో స్థైర్యానికి మేలిమలుపౌతుంది!

 

        రేపటి మన గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం మనం వేకువ 4.30 కు ముందే చేరుకోవలసినదీ, రకరకాల కశ్మలాల మీద తడాఖా చూపవలసినదీ – బెజవాడ దారిలోని నందమూరి తారకరాముని పార్కే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 4

(గ్రామ) కల్మషాల మాడు మీద కార్యకర్త మొదటి దెబ్బ

స్వచ్ఛ – ధన్య చల్లపల్లి సాధనలో తొలి అడుగది!

ఒక విశాల గ్రామోన్నతి ధైర్యానికి దిక్సూచది!

గంగులపాలెం దారికి కలదింతటి ఘన చరిత్ర!     

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

26.02.2021.