2138* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో - 2138* వ నాడు.  

 

ఈ మార్చి నెల – బుధవారం – 3 వ నాటి వేకువ మంచు వానలో 28 మంది తమ గ్రామానికెంతో ఆనంద – ఆరోగ్యదాయకమైన తారకరాముని పార్కు దగ్గర 4.18 నిముషాలకే ఉధ్యక్తులైపోయి, ఎప్పటి దిన చర్యలాగే వివిధ పనిముట్లను చేబూని, రెండు ముఠాలుగా ఏర్పడి, రెండు చోట్ల నిర్వహించిన స్వచ్ఛయజ్ఞం రెండు గంటల పాటు – 6.15 కు ముగిసింది. చివరలో కొద్ది సమయం మాత్రం లయన్స్ సేవా సంస్థ సభ్యులిద్దరు కూడ పాల్గొన్నారు.

 

నేటి స్వచ్ఛతా ప్రయత్నం సంగతేమిటంటే –

 

పార్కులోని తూర్పు ప్రక్కన ఆదివారం నాటి అసంపూర్ణ కృషికి కొనసాగింపుగా అక్కడ అక్రమంగా పెరిగిన ఎండు గట్టి, నిరర్ధక – నిరుపయోగమైన మొక్కల తొలగింపు, ట్రక్కులోకి తరలింఫు. ఇందులో నడుం వంచి, కూర్చుని కూడ కత్తులతో పని చేసిన పది మంది, దంతెలు – డిప్పలు వాడిన ఇద్దరు. ఐతే – ఈ భాగమంతా నీరు చేరి, తడి పొడిగా ఉండగా – ఒంటికి, బట్టలకి బురద అంటుకొంటే మాత్రం ఇందులో ఎవరు వెనక్కి తగ్గారు గనుక! తెలవారే సమయానికి ఒక కార్యకర్త పార్కు తూర్పు ప్రహరీ మీదకు లంఘించి, గోడ మీద మంచుకు కాలుజారకుండ నిలదొక్కుకుంటూ బైట నుండి పార్కులోకి పెరిగి, అల్లిన ఈత మట్టల్నీ, తీగల్నీ తొలగిస్తున్న ఒక విన్యాసాన్ని వాట్సాప్ గుంపులో వీక్షించండి.

 

- దక్షిణ దిశలో ఆదివారం శేషించిన పిచ్చి – ముళ్ళ మొక్కల్నీ, వాటి నడుమ దొరికే ప్లాస్టిక్ సంచులు, సీసాల వంటివి నరికి, ఏరి, పెరిగిన గడ్డిని కోసి, ఈ అన్ని వ్యర్ధాలను గుట్టలు చేసి, ట్రాక్టర్ లోని  కెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చే పనిలో డజను మందికి పైగా శ్రమించారు. వీరిలో గ్రామ ప్రధమ మహిళ సకుటుంబంగా పాల్గొనడం కూడ విశేషమే!

 

మరి – ఇందరు గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు, ఉన్నత వృత్తి నిపుణులు, వేలాది దినాలుగా ఎందుకిలా గ్రామ సేవలో రోజూ రెండు గంటలు గడుపుతారో – బయటి వాళ్ళకు అర్ధం గాదు సరే, ఈ కార్యకర్తల సంసేవిత గ్రామంలోనే - ఇదే సమయంలోనే సుఖనిద్రాముద్రితులైన సోదర గ్రామస్తులకెందుకీ గ్రామ బాధ్యతలు పట్టవో నాకు బొత్తిగా అర్ధం కాదు! ఇలాగే ఈ పరిస్థితులు కొనసాగితే –  స్వచ్ఛ కార్యకర్తల “సమగ్ర – సంపూర్ణ – స్వచ్ఛ – సుందర” స్వగ్రామ లక్ష్యాలు ఎన్నటికి పూర్తయేను?

 

6.20 సమయంలో కాఫీ – కబుర్ల కన్న ముందే – పల్నాటి అన్నపూర్ణ  గారి రుచి – శుచికర, ఆరోగ్యదాయక వేడి రాగి జావ ను కార్యకర్తలు ఆస్వాదించారు (వెనకటికి – 150 ఏళ్ల నాటి కరువులో డొక్కా సీతమ్మ గారు ఆకొన్న వారిని బ్రతికించేదట! మన ఈ మహిళా కార్యకర్త పేరు “డొక్కా అన్నపూర్ణ అని మార్చాలేమో!) ఆ 10 నిమిషాల వ్యవధిలోనే నిమ్మకాయల, ప్రేమానందుని సొరకాయల పంపకం పూర్తయింది!

 

శివరామపురం రైతు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్పంతో 6.40 కి నేటి మన సొంత ఊరి బాధ్యతలు ముగిశాయి.

 

రేపటి మన కర్తవ్య నిర్వహణను మనం తొలుత నిర్దేశించినట్లు కాక – బైపాస్ మార్గం ప్రక్కన బికనీర్ ప్రాంగణం దగ్గర 4.30 కన్న ముందే కలుసుకొని కొనసాగిద్దాం!

   

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 6

 

చవి చూసిన స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం కాదండీ-

దాని వెనుక శ్రమదాతల ఔదార్యం చూడండీ!

వాళ్ళననుసరించునపుడు వచ్చు సుఖం పొందండి

స్వచ్చోద్యమ శ్రమ జీవన సౌందర్యమె మేలండీ!

         

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

03.03.2021 

– పల్నాటి అన్నపూర్ణ గారి రుచి – శుచికర, ఆరోగ్యదాయక ‘వేడి రాగి జావ’