2139* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2139* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ విశేషాలు.  

 

గురువారం – 4.3.2021 వ తేదీ కూడ షరా మామూలుగానే - 4.20 కే – జడలు విప్పిన మంచులోనే – 27 మంది స్వచ్ఛ కార్యకర్తల త్రిముఖ పారిశుధ్య చర్యలు ఠంచనుగా మొదలైపోయినవి. ఇంచుమించు రెండు గంటల పాటు ఒక సందడిగా – ఒక బాధ్యతగా – అనివార్యంగా నెలకొన్న ఆయాచిత గ్రామ స్వచ్ఛ – శుభ్ర – స్వస్త – సుందరీకరణ చర్యలు –

 

1) బైపాస్ బాట దగ్గరి బికనీర్ భోజన విక్రయశాల ఎదుట, 2) కీ.శే. కస్తూరి మామ్మ ఉద్యానం వద్ద, 3) NTR పార్కులోను ఏకకాలంలో మొదలై, లక్ష్యాల కనుగుణంగాను, పరిశీలకులకు ఆశ్చర్యాద్భుతంగాను ముగిసినవి.

 

ఐదారు రోజులుగా ఈ మంచు వర్షంలా ఎందుకు పడుతున్నది? పగలు ఎండ తీవ్రత ఎందుకు? వీచే గాలి ప్రాణవాయువును సకల జీవుల కందించడమెందుకు?... ఇలాంటి ప్రశ్నలను సైన్స్ సమాధాన పరుస్తుంది. చల్లపల్లి స్వచ్చోద్యమ కారులు 2139* దినాల సుదీర్ఘ కాలంగా – ప్రతి రోజూ వేకువ 3.40 కే మేల్కొని, వానైనా, ఎండైనా, మంచు ముంచుతున్నా – తమ స్వార్ధం కోసం కాక – 27 వేల మంది గ్రామస్తుల ఉమ్మడి స్వస్తత కోసం 4.30 నుండి 6.30 దాక ఎందుకు శ్రమిస్తారు?” అనే ప్రశ్నకు మాత్రం సామాజిక శాస్త్రవేత్తలు మాత్రమే జవాబు చెప్పగలుగుతారు. అసలిలాంటి ప్రశ్నలు బయలుదేరి, చర్చలు జరగాలనే నా వంటి ఆశావహుల నిరీక్షణ!

 

- NTR పార్కులో మరికొంత సుందరీకరణ అవసరమని భావించిన ఏడుగురు కార్యకర్తలు కత్తి - దంతె - పారలతో అందులోకి ప్రవేశించి, తామనుకొన్న లక్ష్యంలో సగమైనా పూర్తి చేయగలిగారు - అవసరార్ధంగా కూర్చొని, వంగి, ఒక పెద్దాయనైతే కర్ర ఊతంగా సగం వంగొని ప్రయాసపడుతూ శుభ్రపరుస్తూ – వీళ్ళు ప్రదర్శించిన స్వచ్ఛ - శుభ్రతా విన్యాసాలు, నడుమ కొన్ని సమయోచిత ఛలోక్తులు, శ్రమ తెలియకుండా సెల్  ఫోన్ నుండి వింటున్న పాత సినిమా పాటలు – పద్యాలు - ఆ రెండు గంటలూ వాళ్ళదొక ప్రత్యేక ప్రపంచం!

 

బికనీర్ భోజన శాల ఎదుట కాలుష్యాల మీద 16 మంది స్వచ్ఛ సైనికులు చేసిందైతే అక్షరాలాయుద్ధమే! ఏ వారం – పదిరోజుల నాడో – ఎవరో పెద్ద వేప చెట్టును నరకగా డ్రైనులో నిండిపోయిన కొమ్మలు, ఆకులు, కాండాలు కాక, వాటికి తోడు ప్రక్కనున్న కూరల అంగడి రోజు వారీ వ్యర్ధాలు నిండిపోయిన మురుగు ఎంత ఘాటు కంపు కొడుతున్నదీ – ఏ ధైర్యశాలురైనా ముక్కు మూసుకోకుండ అక్కడ 10 నిముషాలుండ గల్గితే గాని తెలవదు! గంటన్నర పాటు శ్రమించి పెద్ద ట్రాక్టరు ట్రక్కు నిండా ఆ మురుగు వ్యర్ధాలను, కొమ్మల్ని ఎక్కించిన ఈ 16 మందికీ గ్రామ ప్రజల తరపున నా శిరసాభివందనాలు!

 

- అక్కడ నుండి 150 గజాల దూరం బెజవాడ రోడ్డును రెండు ప్రక్కలా నిర్విరామంగా ఊడ్చి ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ సారా సీసాల్ని ఏరి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించిన నలుగురు ధన్యులకూ కృతజ్ఞతలు!

 

కాఫీపానీయ వినియోగానంతర సమీక్షా సమయంలో – నిమ్మ పండ్ల, సొరకాయల పంపకం కాక, కోడూరు వేంకటేశ్వరరావు గారు NTR పార్కులో కొత్త మొక్కలు నాటే నిమిత్తంగా ఇచ్చిన 5000/- విరాళాన్ని మనకోసం మనం ట్రస్టీ గారు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించారు.

 

మన రేపటి స్వచ్ఛ దిన చర్యకోసం 4.30 కన్న ముందే మరొకమారు బికనీర్ ప్రాంగణంలోనే కలుసుకొందాం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 7

 

ఇంత వింతల బంతి పువ్వులు – చెంతనే చేమంచి గుత్తులు

చాలవని కనకాంబరములూ – అసంఖ్యాకము లితరజాతులు!

అసలు ఇది ఒక నడక బాటా – అందమగు ఉద్యాన వనమా?

జనులు మెచ్చే – మనసు దోచే జాణతనమా? – ప్రౌఢ గుణమా?    

         

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

04.03.2021

కోడూరు వేంకటేశ్వరరావు గారు NTR పార్కులో కొత్త మొక్కలు నాటే నిమిత్తంగా ఇచ్చిన 5000/- విరాళాన్ని ‘మనకోసం మనం’ ట్రస్టీ గారు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించారు.