2140* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2140* వ రోజున స్వచ్చోద్యమ చల్లపల్లి సందడులు.  

 

05.03.2021 (శుక్రవారం) వ తేదీలో కూడ - ఇంకా వేకువ 4.20 కూడ కాని మంచు - చీకటి వేళ - తలశిల బికనీర్ ఆహారశాల ఎదుట నిలిచిన డజను మంది ఔత్సాహిక స్వచ్ఛ కార్యకర్తలను మన సామాజిక మాధ్యమంలో గమనించండి... ఇప్పుడేనా? – ఎనాళ్ళుగానో ఈ గ్రామం కోసం – వీళ్ళ దినచర్య ఇలాగే మొదలౌతున్నది! ఇక అక్కడ నుండి పనిముట్ల బండిలో నుండి ఈ రోజుకు తమకవసరమైన చేతొడుగులు, తలదీపాలు, కత్తీ కటార్లు, గొర్రులు వంటివి తీసుకొని, ఈ 29 మంది ప్రవృత్తి నిపుణులు రెండు గుంపులుగా చీలి, శ్రీమంతుల క్లబ్బు దిశగా కొందరు, నందమూరి పార్కు వైపుకు కొందరు చకచకా వెళ్ళిపోయారు. తదుపరి రెండు గంటల పాటు తమ తమ స్వయం నిర్దేశిత గ్రామ మెరుగుదల కృషికి అంకితులైన వైనం వివరించే ముందు మనదొక సందేహం :

 

        సుమారు 28 వేల మంది చల్లపల్లి ప్రజల్లో ఈ 29 మంది మాత్రమేనా - ఇది తమ గ్రామమనీ, దీని బాధ్యతలు, భవితలు తాము స్వీకరించాలనుకొనేది? తమ తల్లినో, బిడ్డనో, ఇంటినో సొంతమనుకొన్నట్లే - తల్లి వంటి మాతృ గ్రామాన్ని, దాని స్వచ్ఛ - శుభ్ర - స్వస్తతా భారాన్ని కూడా సొంతం చేసుకుని, మోయాలనుకొనే వారుండరా? ఈ కార్యకర్తలకు సహకరించి, ప్రోత్సహించే సహృదయులు చాల మంది ఉన్న మాట నిజమేకాని, క్షేత్ర స్ధాయిలో ప్రత్యక్ష కార్య నిమగ్నులయేవారు  100 – 150 మందేనా? – అది కూడ 2140 దినాల, మూడు లక్షల పని గంటల గ్రామ సేవ తదుపరి కూడానా! ఇంకొక 7 – 8 ఏళ్ల తదుపరి ఐనా గ్రామ పౌరుల అలవాట్లలో, ఆచరణలో మార్పు రాక పోతుందా!

 

నేటి స్వచ్చంద శ్రమ వివరాల కొస్తే :

 

1) ముందుగా పార్కులో పని మొదలు పెట్టింది ఏడెనిమిది మందే గాని, సమయం గడిచే కొద్దీ మరో పది మంది వారితో కలిసి, బాట్మింటన్ కోర్టు వద్ద ఐదారుగురు, చిన్నారుల పార్కు రెండు ప్రక్కలా 12 మంది ఆ మంచు వానలోనే – కనీ, కనిపించని వెలుగులోనే – కాస్త ఎగుడు దిగుడు నేల మీదే చతికిలబడి మంచుకు తడిసి, చేతికి పట్టుదొరకకున్నా సరే వదలక కత్తులతో దుబ్బులుగా పెరిగిన ఎండు – పచ్చి  గడ్డిని కోసి, దంతెలతో గుట్టలు చేసి, ట్రాక్టర్ లో నింపుకొని చెత్త సంపద కేంద్రానికి చేర్చారు.

 

2) సుందరీకర్తలేమో బికనీర్ దగ్గర నుండి కోట మూల దిశగా – బెజవాడ దారిని, తదు భయ పార్శ్వాలను, కస్తూరి రహదారి వనాన్ని, పండ్ల విక్రయ అంగళ్ళనూ ఊడ్చి, అందగించే బాధ్యతలో మునిగిపోయారు. కూరగాయల దుకాణం, మెకానిక్ షెడ్లు, దారి ప్రక్క తాత్కాలిక గుడారాలు వంటివి ఈ కార్యకర్తలకు కావలసినంత పని కల్పించాయి! సరిపడా సంతృప్తిని మిగిల్చాయి!

 

        వ్యక్తులుగా గాక, సమూహంగా – ఒక సామాజిక సద్భావంతో – ఒక స్వచ్ఛ తాత్త్వికతతో పని చేస్తుంటే వచ్చే సత్ఫలితమేమిటో 2140* దినాల నుండి ఋజువౌతూనే ఉన్నది. ఎంతటి తాత్త్విక బల సంపన్నులైనా, మనలో ఏ కార్యకర్తయినా – ఒక్కరుగా ఈ మహత్తర స్వచ్ఛ కృషి, ఇంతటి సత్ఫలితమూ సాధ్యపడుతుందా?

 

        కాఫీ కషాయ ఆస్వాదనం తరువాత – సొర, నిమ్మకాయల  ఉచిత పంపకం తరువాత 6.40 సమయంలో మన స్ఫూర్తిగా ముమ్మారు స్వగ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్పాన్ని ధృడంగా చాటిన వారు తూములూరి లక్ష్మణరావు! తదనంతరం నేటి కార్యకర్తల ఇనుమడించిన కృషిని ప్రశంసించి, సమీక్షించిన వారు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు! ప్రతి నెలలాగే మార్చి మాసానికి కూడ 2000/- విరాళాన్ని మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీకి సమర్పించిన వారు డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణుల వారు!

 

రేపటి రోజు మన  ప్రధాన వీధి స్వచ్ఛ – శుభ్రతల కోసం మనం వేకువ 4.20 కే కలిసి, పూనుకో దగ్గ స్థలం శ్రీమంతుల క్లబ్బు -  కస్తూరి ఉద్యానవన ప్రాంతం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 8

 

ఒక బోగన్ విలియ చాలు ఒక్కటె రేరాణి చాలు

భావుకతను తట్టి లేపి పరవశింప చేయ జాలు

వేలో మరి లక్షలొ ఇది విరి జాతర! పూదొంతర!

ఇన్ని ఊళ్ళ ఇంతమంది నింతగ ఆకర్షించిందిర!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

05.03.2021