2141* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

విశిష్ట స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2141* వ నాటి శ్రమ తీవ్రతలు.  

 

ఇది 6.3.2021(శనివారం) నాటి వేకువ 4.24 సమయం! ఎందుకో రోజుటి  మంచు వర్షం లేదు గాని సాదా హిమపాతం వల్ల వచ్చిన చలిలోనే బెజవాడ దారిలోని శ్రీ మంతుక్లబ్ దగ్గర ఆగి, వీధి కశ్మలాల మీద యుద్ధానికి సంసిద్ధులైన 15 మంది స్వచ్చంద కార్యకర్తల్ని “ ఏమి సంగతి” (వాట్సాప్) సామాజిక మాధ్యమంలో చూడవచ్చు. అనతి నిముష వ్యవధిలోనే మరో 12 మంది వీరికి జత కూడి, వెరసి 27 మంది చల్లపల్లి గ్రామ కాలుష్య విధ్వంస కారుల తెగింపుతో అక్కడికి నాల్గు ప్రక్కల – అగ్రహారం రెండు బాటల కొంత మేర, వృద్ధాశ్రమ వీధి, శివాలయం ప్రాంతం, విజయవాటిక రహదారి స్వచ్చ-శుభ్ర-సుందరీకృతములు కావడానికి 2 గంటల సమయం-అనగా 50 పని గంటలకు పైగా పట్టింది.(ఐతే ఏం లాభం? ఎవరి స్వస్తత కోసం ఈ సుదీర్ఘ శ్రమదానం నిరంతరంగా జరుగుతున్నదో- ఆ గ్రామస్తులు ఎందరు దీన్ని చూశారు? 6.00 కు ముందే సంసిద్ధులైపోయిన టీ కొట్ల, పాల పాకెట్ల, దిన పత్రికల, పండ్ల దుకాణ వ్యాపారులు తప్ప! ) వాహనదారులు, బస్సు ప్రయాణికులం టే- వాళ్లెలెలాగూ తప్పనిసరై రోజూ చూసే శ్రమదాన వేడుకే ఇది!

 

          ఇక – నేటి మన వీధి పారిశుద్ధ్య ప్రయత్న వివరాలు:

 

- అంతకుముందూ, కరోనా తడాఖా తోనూ మన గ్రామం కొత్త సంస్కృతేదంటే- క్రమంగా ఇంటి వంటలు తినడం తగ్గి, హోటళ్ల తిళ్లు కూడా నీరసించి, రోడ్ల ప్రక్క బళ్ల దగ్గరే టిఫిన్-కాఫీ-టీ లు, కొండొకచో భోజనాలు కూడ చేసేదాక వెళ్లడం! కూరలు, పళ్లు అన్ని నిత్యవసరాలకు, విలాసాలకూ ప్రధాన వీధులే వేదికలు కావడం! మరి వందలాది ఈ అంగళ్ల దగ్గర ఉత్పన్నమయ్యే అన్ని రకాల చెత్తలకూ స్వచ్చ కార్యకర్తలే పరిష్కర్తలుగా నిలవడం! వీటికి తోడు సామాజిక బాధ్యతారహితులు కొందరు ఇతర చెత్తలు కాక, చెట్లు కొట్టి, డ్రైన్లలో పడవేయడం! అందువల్లనే ఈ రోజు స్వచ్చంద శ్రమదాతల కష్టం రెట్టింపై పోయింది మరి!

 

- నేటి తక్కిన పారిశుద్ధ్య  పనులకన్నా, డ్రైన్ల లోని దిక్కు మాలిన వ్యర్ధాల వెలికితీత, లోతట్టు పిచ్చి- ముళ్ల మొక్కల తొలగింపు మరింత కష్టమై పోయింది గాని, ఈ కృషితో ఆయా చోట్ల గోడల మీద మన సుందరీకర్తలు గతంలో వేసిన భావ స్పోరక చిత్రాలు, అందమైన వ్రాతలు దారిన పోయేవారికి మరలా కనిపిస్తున్నాయి- ఇందుకు గాను నలుగురైదుగురు స్వచ్చ కార్యకర్తల ఒంటి మీద, బట్టల మీద చిక్కని సిరా మరకల్లాగా బురద చుక్కలు వచ్చినా – అవి వాళ్లకు అలంకారప్రాయాలు మరి!

 

ఈనాటి చివరి 25 నిముషాల స్వచ్చంద కృషే అందరూ చూడదగింది, పరిశీలించి గుర్తుంచుకోదగింది! వాళ్లే పోగులు చేసిన ప్లాస్టిక్ లు, బురద గుంటల చెట్ల కొమ్మలు, ముళ్ల కంపలు, ఉద్యానాల సమస్త వ్యర్ధాలు, ట్రస్టు ట్రాక్టర్ల కెత్తే కృషి! చెత్త తట్టలు మోస్తున్నప్పటి ఉరుకులు-పరుగులు, డిప్పలలోకి దుమ్ము –ధూళి నింపి ట్రక్కులోకి రవాణా చేస్తున్న చురుకుదనాలు, 50 గజాల దూరం నుండి వట్టి చేతుల్తో కూడ వ్యర్ధాల చేర్పులు, ఇవన్నీ ఎత్తాక చీపుళ్లతో మళ్లీ ఊడ్పులు- ఈ ఉత్సాహం, సందడి-విచక్షణ, విజ్ఞతలు- అసలిదంతా చూస్తుంటే ఒక క్రమశిక్షణతోగూడిన సర్కస్ లాగే అనిపించింది! ట్రక్కులో నిలబడి, క్రింద వాళ్లు అందిస్తున్న వ్యర్ధాలను చెమటలు కార్చుతూ సర్దుతున్న ఒక ప్రముఖ సీనియర్ డాక్టరమ్మను, 60 ఏళ్ల పై బడిన- దుమ్ము డిప్పలతోపరుగిడుతున్న ఇద్దరు పెద్దలను, అంతిమంగా అక్కడ చీపురు తో ఊడుస్తున్న గ్రామ ఉప సర్పంచి ని ... మనం ఈ ఊళ్లో కాక, ఇంకా ఎప్పుడు- ఎక్కడైనా చూడగలమా?

 

ఈ రోజు కూడ నిమ్మపళ్ల, శివబాబు గారి సొరకాయల పంపకం జరిగింది. సుందరీకరణ బృంద ప్రముఖుడు ఆకుల దుర్గా ప్రసాదు గారి త్రిగుణాత్మక గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలు కాస్త ఆవేశంగా మారుమ్రోగాయి! కార్యకర్తల నిరంతర సుదీర్ఘ శ్రమదాన నిబద్ధతకు పులకించిన ముమ్మనేని నాని( వైస్ ప్రెసిడెంట్) గారి సానుకూల సహకార దృక్పథ వాగ్దానమూ జరిగింది.

 

రేపటి మన వేకువ 4.20 సమయపు కలయిక, వీధి పారిశుద్ధ్య శ్రమదాన వేదిక గ్రామ మూడు రోడ్ల ప్రధాన కూడలి అని గమనార్హం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 9

ఎవ్వరు ఊహించినారు? జోస్యమెవరు చెప్పినారు?

భూలోకపు నరక పథం పూల తోట ఔతుందని ?

శ్రమవేదం-త్యాగ నిరతి సాధించిన విజయం ఇది!

దేశ- కాల అవధి దాటి దీపించే స్ఫూర్తి ఇదే!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

06.03.2021